ముందు మా అవసరాలు.. ఆ తర్వాతే ఇతరులకు

Updated By ManamTue, 08/21/2018 - 00:24
harish-rao
  • 60 ఏండ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయాల్ని పూడ్చేందుకే కొత్త ప్రాజెక్టులు

  • ఢిల్లీలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ సమావేశంలో హరీశ్‌రావు

  • తెలంగాణ సమస్యలను లేవనెత్తిన మంత్రి

 harish-raoహైదరాబాద్: ‘తెలంగాణ అవసరాలు తీరిన తరువాత మిగిలిన నీటిని ఇతర రాష్ట్రాలకు ఇవ్వడానికి తమకెలాంటి అభ్యంత రం లేదని’ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నదుల అనుసంధానంపై ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు కొనసాగాయి. దీనిలో పాల్గొన్న హరీశ్‌రావు తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాల ఆదుకోవాలన్నారు. తెలంగాణకు కేటాయించిన 954 టీఎంసీల నికర జలాలు పోగా మిగిలిని నీటిని తీసుకోమని చెప్పారు. తమ ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వకుండా నదుల అనుసంధానానికి డీపీఆర్ తయారు చేయడాన్ని గట్టిగా వ్యతిరేకించినట్లు హ రీశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ, ఎపీకి కేటాయింపులు జరిగాక నదుల అనుసంధానంపై ఆలోచించాలని సమావేశంలో స్పష్టం చేసిన ఆయన, ఇదే అంశాన్ని రాత పూర్వకంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అందించామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కొత్తగా నిర్మించిన సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు త్వరగా ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా ఏ ప్రాజెక్టులకు ఇవ్వడం లేదన్నారు. ఇదే విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఒకరు చెప్పారని గుర్తుచేశారు. అయితే, 60:40 నిష్పత్తిలో గ్రాంట్లు ఇస్తామని చెప్పిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు. మహారాష్ట్రలో కొన్ని ప్రాజెక్టులకు గ్రాంట్లు ఇచ్చినట్లుగానే, తెలంగాణకు గ్రాంట్లు ఇవ్వాలని కోరామన్నారు. మా ఇంజనీర్ల అప్రమత్తతతో రెండు పెను ప్రమాదాలు తప్పాయన్నారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల దగ్గర భారీ ప్రమాదాన్ని అపగలిగామన్నారు. పిడుగుపాటుకు జనరేటర్ పాడైన విపత్కర పరిస్థితుల్లో ప్రాజెక్ట్ సామర్థ్యంకన్నా ఎక్కువ ఇన్ ఫ్లో వచ్చినప్పుడు కాలినడకన వెళ్లి మాన్యువల్‌గా గేట్లను ఎత్తి ప్రమాదం నుంచి కాపాడామన్నారు. కడెం ప్రాజెక్టు దగ్గర మరో ప్రమాదం తప్పిందన్నారు. ఒక గేటు ఓపెన్ కాకపోవ డంతో చాలా ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల పనితీరు,  పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నారని వారికి వివరించామన్నారు. ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేక సమయాన్ని కేటాయించి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా అధికరులను ఆదేశిస్తున్నామని...తెలంగాణకు సంబందించిన అన్ని అంశాలను కేంద్రానికి వివరించామని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు భేటి అనంతరం మీడియాకు తెలిపారు

Tags
English Title
Before our needs .. and then to others
Related News