విరోధాభాస ప్రజాస్వామ్యం

Updated By ManamFri, 05/18/2018 - 00:47
image

imageకర్ణాటకలో ప్రజాస్వామ్యం విరోధాభాసంగా మారింది. ప్రత్యర్థి కాంగ్రెస్ కంటే తక్కువ ఓట్లు సాధించిన బీజేపీ శాసనసభాపక్ష నేత యడ్యూరప్ప గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తక్కువ శాతమే అయినప్పటికీ మెజారిటీ ఓటర్లు బీజేపీని తిరస్కరించారు. అయితే ఓట్ల మెజారిటీ కంటే నియోజకవర్గాల వారీ సీట్ల మెజారిటీని గెలుపు ఓటముల నిర్ణాయక అంశంగా పరిగణిస్తున్న రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య ప్రమాణం అమలవుతున్న నేపథ్యంలో మైనారిటీ ప్రజాభిప్రాయం గల బీజేపీ సైతం అధికారంలోకి రాగలిగింది. ఎక్కువ సీట్ల సంఖ్య సాధించిన బీజేపీ కర్ణాటకలో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, కాంగ్రెస్-జెడి(ఎస్) ఎన్నికల అనంతర కూటమి ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మెజారిటీని సాధించి ఏకైక అతిపెద్ద రాజకీయ కూటమి గానూ పరిగణిస్తుంది. అతిపెద్ద పార్టీ లేదా అతిపెద్ద కూటమి రెండింటిలో ఎవరిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలన్నది గవర్నర్ విచక్షణపై ఆధార పడి ఉంటుంది. అయితే గతంలో బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును నిర్లక్ష్యం చేస్తూ కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా యడ్యూరప్పను  ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి బలనిరూపణకు 15రోజుల గడవు ఇవ్వడం వివాదాస్పదమైంది. బలనిరూపణ పూర్తయిన తర్వాతనే మంత్రివర్గాన్ని ఏర్పా టు చేయవలసి ఉంటుంది. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ అసెంబ్లీ ఎదుట నిర సన కార్యక్రమాన్ని చేపట్టింది. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్, జేడీఎస్, సీని యర్ న్యాయవాది రాంజెఠ్మలానీలు సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలవడంతో కర్ణాటక పరిణామాలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. 

మణిపూర్, గోవా, మేఘాలయల్లో అత్యధిక సీట్లను పొందిన పార్టీలను కాదని, ప్రత్యర్థి పార్టీలను చీల్చి, ఆ పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ఏకైక అతిపెద్ద కూటమి పేరుతో అధికారాన్ని హస్తగతం చేసుకుందన్న ఆరో పణలు విదితమే. ఇప్పుడు అదే సాంకేతికంగా ఏకైక అతిపెద్ద కూటమిగా ఆవిర్భవించిన కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మోకాలడ్డటం కర్ణాటకలో నెలకొన్న మరో వైచిత్రి! ఎన్నికలానంతర కూటములు అధికారం లోకి రావడం ఆ రాష్ట్రాల్లో సబబైనపుడు స్వచ్ఛంగా ఏర్పడిన కాంగ్రెస్- జేడీ ఎస్ కూటమి ఎలా అనర్హతమైందని వివిధ రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సంధానకర్తలుగా నిలిచి సమాఖ్య వ్యవస్థ పరిఢవి ల్లడానికి సారథ్యం వహించాల్సిన గవర్నర్ల వ్యవస్థ తొలి నుంచి కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాల ప్రాతినిథ్య వ్యవస్థగా మారడం రాజ్యాంగంలో నెలకొన్న విరోధాభాసం. 

క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టకుండా, ప్రజలను పక్క దారి పట్టించేందుకు కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు ప్రాధాన్యత ఇచ్చాయి. రైతాంగ సంక్షోభం, సాగు, తాగు నీటిసమస్య, నిరుద్యోగం, ఉద్యోగ భద్రత, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, విద్య వైద్యం వంటి అనేక సమస్యలు చర్చనీయాంశం కాకుండా పక్కన బెట్టి కులం, మతం తదితర ఉద్వేగభరిత అస్తిత్వ అంశాలను మాత్రమే ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టాయి. ప్రజల్లో చీలికలు సృష్టించేందుకు బీజేపీ మతాన్ని వాడుకుంటే, కాంగ్రెస్ కూడా అదే తీరులో లింగాయత్‌లకు ప్రత్యేక మతం హోదా కల్పించా లని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచార సమయంలో అమిత్‌షాతో పోటీ పడి రాహుల్ గాంధీ సైతం గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ, అసలు సమ స్యల్ని మరుగున పరచి ప్రజల్ని ఆకర్షించేందుకు ప్రయత్నించి, ఇప్పుడు ప్రజా స్వామ్యం గురించి మాట్లాడుతుండడం సిగ్గుపడాల్సిన విషయం. అవినీతి, నేర చరిత్ర ఉన్న వారికి టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా, ప్రచారపర్వంలో ఒకవైపు కోట్లు కుమ్మరిస్తూ, మరోవైపు పోలింగ్ అక్రమాలకు కర్ణాటకలోని పార్టీలన్నీ పోటీపడ్డాయి. పార్టీల పోకడలు, విధానాలతో పాటు నేతల మాటలు, చేతల్లో ఏమాత్రమూ తేడాలేని పార్టీల్లో ఏదో ఒకదానిని ఎంచుకోక తప్పని స్థితి ఓట ర్లకు ఏర్పడింది. పోలైన ఓట్లలో వివిధ పద్ధతుల్లో మూడవవంతు కూడా సాధించని పార్టీలు అధికారంలోకి వచ్చి మెజారిటీ ప్రజలపై రాజ్యమేలుతుంటే, అది మెజారిటీ ప్రజల ఆమోదంతో గెలిచిన పార్టీ ఎలా అవుతుంది? భారత దేశ ప్రజాస్వామిక ప్రక్రియలోనే విరోధాభాసం కొనసాగుతోంది. ఈ నేప థ్యంలో రాజకీయ పార్టీలన్నిటికీ తమ చర్యలకు సమర్థన దొరుకుతున్న సమయంలో కర్ణాటక రాజకీయ పరిణామాల్లో ఏది సవ్యం? ఏది అపసవ్యం? అని సామాన్యుడు తేల్చుకునేదెట్లా?

English Title
Orthodox democracy
Related News