జన్‌పథ్ కాదు.. జన్‌మత్

Updated By ManamSun, 05/27/2018 - 01:28
modi
  • ప్రజాకాంక్షలకు అనుగుణంగా పరిపాలన.. నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం

  • అది ఇష్టం లేని నేతలు ఏకమవుతున్నారు.. కుమారస్వామి ప్రమాణం అందుకు నిదర్శనం

  • సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం..‘నల్లధనం’ నుంచి ‘జన్‌ధన్’వైపు పయనిస్తున్నాం

  • ప్రపంచంలో భారత్‌పై విశ్వాసం పెరిగింది.. ఒడిశాలోని కటక్ భారీ ర్యాలీలో ప్రధాని మోదీ

 

imageకటక్: ‘‘మా పాలన జన్‌పథ్ నుంచి కాదు.. జన్‌మథ్‌కు అనుకూలంగా సాగుతుంది.ప్రజల ఆకాంక్షలు, కలలు, ఆశలు..నేను పని చేయడానికి ప్రేరణ ఇస్తాయి’’ అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. నల్లధనానికి, అవినీతికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయని, ఇది కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణం చేసినప్పుడు దేశ ప్రజలందరి కళ్ల ముందు నిలిచిందని ఎద్దేవా చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఒడిశాలోని కటక్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. నా నాలుగేళ్లలో ఎన్‌డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. సర్జికల్ స్రైక్స్, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ వంటి సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నామని మోదీ పేర్కొన్నారు. ‘‘మా ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది. సంకీర్ణ పక్షాలతో కలిసి సాగుతున్నాం. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఒక స్థిరమైన సంకల్పంతో.. భారత్ అభివృద్ధి పథంలో సాగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా భారత్‌పై విశ్వాసం పెరిగేలా చేసింది. కఠినమైన, పెద్ద  నిర్ణయాలు తీసుకునేందుకు మేం భయపడం’’ అని మోదీ అన్నారు.

నాలుగేండ్ల క్రితం దేశంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఒక కుటుంబం 48 ఏండ్ల imageపాలనలో దేశానికి ఏం చేసిందో గుర్తు చేసుకోవాలని, ఆ కుటుంబం దేశాన్ని ఏ విధంగా చూసిందో జ్ఞప్తికి తెచ్చుకోవాలని అన్నారు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు తమ ప్రభుత్వంపై విశ్వాసం పెట్టుకున్నారని, వారి విశ్వాసం మేరకు ‘నల్లధనం’ నుంచి ‘జన్ ధన్’ వైపు ప్రయాణం చేస్తోందని పేర్కొన్నారు. అరాచకం నుంచి సుపరిపాలన దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేదల అభివృద్ధే తమ ప్రథమ పాధాన్యమని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అందరూ పేదరికం నుంచి వచ్చినవారేనని అన్నారు. బ్యాంకుల్లోకి పేదలు వచ్చేందుకు కాంగ్రెస్ ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. పేదల జీవితాలు కూడా విలువైనవేనని, వారికి కూడా జీవిత బీమా కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎందుకు ఆలోచించలేదో చెప్పాలని అన్నారు. ఈ నాలుగేండ్లలో జరిగిన పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1500 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. తమ పార్టీ దృష్టిలో సుపరిపాలన అంటే స్వచ్ఛమైన రాజకీయాలేనని, వ్యవస్థతో ప్రజలను అనుసంధానించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

తాము అధికారంలోకి వచ్చేనాటికి దేశవ్యాప్తంగా 39 శాతం మందికి పారిశుద్ధ్య సౌకర్యాలు ఉన్నాయని, దేశానికి స్వాతంత్య్ర వచ్చిన అనంతరం 2014 వరకు దేశవ్యాప్తంగా 6 కోట్ల మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. కానీ తమ నాలుగేళ్ల పాలనలో 7.5 కోట్ల టాయిలెట్లు నిర్మితమయ్యాయని చెప్పారు. అలాగే.. నక్సల్స్, మావోయిస్టుల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. భగవాన్ జగన్నాథుని గడ్డపై నుంచి 125 కోట్ల దేశవాసులను పలుకరించే అవకాశం దక్కడం తన అదృష్టమని చెప్పారు. ఒడిశా గడ్డపై పుట్టిన నేతాజీ సుబాశ్ చంద్రబోస్‌ను గుర్తు చేసుకున్నారు. ప్రజలు అందిస్తున్న ప్రేమాభిమానాలు తనకు శక్తినిస్తున్నాయని, మరింత పని చేసే విధంగా ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. తన ప్రభుత్వం సరైన దిశలో పయనిస్తోందని, ప్రజా విశ్వాసాన్ని సాధించిందని చెప్పారు.

ఉద్యమంలా అభివృద్ధి
న్యూఢిల్లీ: నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా అభివృద్ధి ఒక ఉద్యమంగా మారిందని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ‘‘భారత రూపురేఖలను మార్చివేసేందుకు 2014లో ఇదే రోజు (మే 26) మన ప్రయాణం మొదలైంది. ఈ నాలుగేళ్లలో అభివృద్ధి ఓ ఉద్యమంలా మారింది. దేశ వృద్ధి కోసం ప్రతి భారతీయుడు ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నాడు. 125 కోట్ల ప్రజానీకం భారత్‌ను ఉన్నత శిఖరాలను తీసుకెళ్తున్నారు’’ అని తన పాలనకు నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డారు. ‘‘సాఫ్ నియత్.. సహీ వికాస్ (పరిశుద్ధమైన సంకల్పం.. సరైన పరోగతి’’ హాష్‌ట్యాగ్‌తో ఈ పోస్ట్ చేశారు. ‘‘మా ప్రభుత్వం ఎనలేని విశ్వాసం ఉంచి ప్రతి భారతీయపౌరుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ మద్దతు, మాపై చూపిస్తున్న ప్రేమానురాగాలే మాకు ప్రేరణగా నిలుస్తున్నాయి. కొండంత బలం ఇస్తోంది ’’ అని మోదీ అభిప్రాయపడ్డారు. ఇదే స్ఫూర్తితో, ఇదే నిబద్ధతతో ప్రజాసేవకు పునరంకితం అవుతామని స్పష్టం చేశారు. ‘‘నా దృష్టిలో.. భారతదేశమే నా తొలి ప్రాధాన్యం’’ అని పేర్కొన్నారు. సంపూర్ణ సమైక్యత సాధించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఎన్నో భవిష్యత్ విధానాలను, ప్రజాహిత కార్యక్రమాలను ప్రారంభించిందని చెప్పారు. 

English Title
not janpath .. janmath
Related News