నిపా.. ఇప్పుడు సామాజిక సమస్య

Updated By ManamFri, 05/25/2018 - 12:02
Nipah Turned Out To Be A Social Issue
  • నర్సులకు బస్సుల్లో ప్రవేశం నో.. ఆటోల్లోనూ ఎక్కించుకోని వైనం

  • బాధితుల మృతదేహాలను అనుమతించని శ్మశానాలు.. కేసు నమోదు

Nipah Turned Out To Be A Social Issueకోజికోడ్: ఉన్నట్టుండి చెలరేగి మనుషుల ప్రాణాలను బలిగొంటున్న నిపా వైరస్ ఇప్పుడు సామాజిక సమస్యగా పరిణమించింది. ప్రాణాంతక వైరస్ బారిన పడి చనిపోయిన వారి మృతదేహాలను కనీసం శ్మశానవాటికలోకే అనుమతించని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. నిపా రోగులకు చికిత్స చేస్తున్న నర్సులను జనం వెలేస్తున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. కోజికోడ్‌లోని పెరంబ్ర తాలూకా ఆస్పత్రికి చెందిన నర్సులను బస్సులో ఎక్కేందుకూ అనుమతివ్వలేదు తోటి ప్రయాణికులు. ఈ అమానుష ఘటన బుధవారం జరిగింది. నిపా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న ఆ నర్సులు ఎక్కిన బస్సులో తాము ప్రయాణించబోమని, వారన్నా దిగాలి.. లేదంటే తామన్నా బస్సు దిగిపోవాలని ప్రయాణికులు పట్టుబట్టారు. ఆందోళన చేశారు. చివరకు వారే బస్సు నుంచి దిగిపోయారు.

బస్సుల్లోనే ఎక్కనివ్వట్లేదంటే.. ఇటు ఆటో వాళ్లూ వాళ్లను ఎక్కించుకునేందుకు ఇష్టపడడం లేదు. వాళ్లను ఎక్కించుకుంటే ఆ పాడుబడ్డ మాయదారి వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనని భయపడుతున్నారు. ఇక, ప్రాణాంతక వైరస్ దాడితో మరణించిన అశోకన్ అనే వ్యక్తి మృతదేహాన్ని శ్మశానంలోకి అనుమతించనందుకు గానూ మవూర్ రోడ్‌లోని శ్మశానవాటిక సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిపా బాధితులకు చికిత్స చేసే నర్సులు, రోగుల బంధువులు, స్నేహితులు బహిష్కరణకు గురవుతున్నారు. మరోవైపు నిపా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని.. నిపా బాధితులకు చికిత్స చేస్తున్న ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

ప్రజల్లో నిపా గుబులు పట్టుకుందని, ఆ భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కోజికోడ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ జయశ్రీ వాసుదేవన్ తెలిపారు. ఇలాంటి సందర్భంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. మహమ్మారి వైరస్ బారి నుంచి తమను, తమ కుటుంబాలను కాపాడుకునేందుకే జనం అలా వ్యవహరిస్తున్నారని స్వచ్ఛంద కార్యకర్తలు అంటున్నారు. జనాల్లో ఇప్పటికే చాలా తప్పుడు సమాచారం వెళ్లిపోయిందని సామాజిక కార్యకర్త బేబి షిరీన్ అన్నారు. 

English Title
Nipah Turned Out To Be A Social Issue
Related News