2 నుంచి కొత్త పంచాయతీలు 

Updated By ManamFri, 07/13/2018 - 02:07
Panchayats
  • భవనాలు, సిబ్బందిని కేటాయిస్తున్నాం.. కార్యదర్శుల రేషనలైజేషన్ వెంటనే చేయాలి

  • హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలి.. గ్రామాల్లో నర్సరీల ఏర్పాటూ పూర్తి చేయాలి

  • కలెక్టర్లు, అధికారులను ఆదేశించిన   పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి

Panchayatsహైదరాబాద్: ఆగస్టు 2 నుంచి కొత్త గ్రామ పంచాయతీలు ఉనికిలోకి వస్తాయని పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4383 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం తమ ప్రభుత్వ ఘనతేనని అన్నారు.  ఆ గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలు, జెడ్పీ సీఈఓలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నెలాఖరుతో పంచా యతీల పాలకవర్గాల పదవీకాలం ముగియ నున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే వచ్చే నెల 2 నుంచి కొత్తగా ఏర్పడిన పంచాయతీలకు భవనాల ఏర్పాటు, ఉద్యోగుల విభజన, ఆస్తుల విభజన తదితర అంశాలను నాలుగైదు రోజులో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 14 వ ఆర్థిక సంఘం నిధులను కూడా జనాభా ప్రాతి పదికన విభజించి, కొత్త పంచాయతీలకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైన చోట క్లస్టర్ల విభజన కూడా పూర్తి చేసి... గ్రామ కార్యదర్శులను జనాభా ప్రాతి పదికన రేషనలైజేషన్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3500 మంది పంచాయతీకార్యదర్శులను  జనాభా ప్రాతిపదికన రేషనలైజేషన్ చేయాలన్నారు. ఈ లెక్కన నాలుగైదు గ్రామాలకు, ఐదారువేల జనాభాకు ఒక కార్యదర్శి ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

దేనికైనా సిద్ధంగా ఉండండి 
నెలాఖరుతో పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగుస్తుందని...ఆ తర్వాత అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కల్గకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగించినా లేదా ప్రత్యేకాధికారులకు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినా సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను మంత్రి జూపల్లి కోరారు. జిల్లాలో ఉన్న గ్రామాల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేకాధికారులుగా నియమించేందుకు నాలుగైదు రోజుల్లోనే జాబితాలు సిద్ధం చేసుకుని సన్నద్ధంగా ఉండాలన్నారు. పాలకవర్గాల పదవీకాలం పొడిగించినా...ప్రత్యేకాధికారులను నియమించినా ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అలాగే హరితహారం, ఉపాధి హామీతో పాటు ఏ ఒక్క అభివృద్ధి పనికి ఆటంకం కల్గకుండా చూసుకోవాలన్నారు. ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని, నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలోనూ నర్సరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీలో భాగంగా సీజనల్ పనులన్నీ ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందని...ఇందుకోసం దాదాపు రూ. 9 కోట్ల పనిదినాలను వినియోగించుకున్నట్లు పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ తెలిపారు. రానున్న రెండు, మూడు నెలల్లో దాదాపు రూ. 4  కోట్ల పనిదినాలను హరితహారం కోసం వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, అధికారులు ఆశా, రామారావు, సుధాకర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

English Title
New Panchayats from 2
Related News