ఆంధ్రా కంపెనీలకు దోచిపెడుతున్న కేసీఆర్

Updated By ManamTue, 10/16/2018 - 00:27
Jaipal reddy
  • రెండు కంపెనీలకే  రూ. 77,436 కోట్ల పనులు అప్పగింత

  • తెలంగాణ పాలిట ఈస్టిండియా కంపెనీగా మారిన మెగా

  • ఆ కంపెనీకి రూ.60,436 కోట్లు, నవయుగకు రూ. 17 వేల కోట్లా ?

  • కమీషన్ల కోసమే వేలకోట్ల      కాంట్రాక్ట్ పనుల ధారాదత్తం 

  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సమగ్ర విచారణ

  • కేసీఆర్‌పై  జైపాల్ రెడ్డి ఆరోపణలు

imageహైదరాబాద్: తెలంగాణ ప్రజల రక్తం, స్వేదాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు అపద్ధర్మ సీఎం  కేసీఆర్  పంచిబెడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నవయుగ, మెగా రెండు కంపెనీలకే రూ.77,436 కోట్ల పనులను అప్పగించడం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదని ఆరోపించారు. కమిషన్ల కోసమే వేలకోట్ల పనులను ఇచ్చారని చెప్పారు.  సోమవారం గాంధీభవన్ లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

కమీషన్ల వ్యవహారాన్ని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. దమ్ముంటే తేల్చుకునేందుకు సిద్ధం కావాలని ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ లంచగొండితనం ,అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. కాళేశ్వరంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పనులను మెగా, నవయుగ కంపెనీలకు, మిషన్ భగీరథ పనులను కోయో కంపెనీకి ప్రభుత్వం అప్పగించిందని, ఆంధ్రా కంపెనీలకే కాంట్రాక్టులు ఇచ్చి టీడీపీతో కాంగ్రెస్ పార్టీ  పొత్తుపై కేసీఆర్ తో పాటు ఆయన పార్టీ  నేతలు విమర్శలు చేయడం అర్థం లేని విషయమన్నారు.

నీ కాంట్రాక్టులన్నీ ఆంధ్రోల్లకే ఇస్తావు...మేం పొత్తు పెట్టుకుంటే విమర్శిస్తావు.., నీవు చేస్తే సంసారం మేం చేస్తే వేరా ? అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పనుల్లో 30 శాతం ఎక్సెస్ అంచనాలు వేశారని , నిపుణులతో చర్చకు సిద్ధమా? అంటూ జైపాల్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు కేసీఆర్ దోచిపెడుతున్నారని ఆరోపించారు. మెగా, నవయుగ కంపెనీలకు కేసీఆర్ కుటుంబం బానిసగా మారిందని చెప్పారు. ప్రాజెక్టులపై సమాచారం అడిగితే ఎవరికీ దొరక్కుండా డాక్యుమెంట్లు దాచిపెడుతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని పదే పదే విమర్శిస్తున్నారు..., ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు కట్టిందెవరయ్యా ? ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును పునరాకృతి పేర కాళేశ్వరంగా మార్చింది వాస్తవం కాదా ? రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ. 80 వేల కోట్లకు పెంచడం మీ అవినీతి కోసం కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ మోసం, దగాలకు భయపడే ప్రసక్తిలేదని, అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరిపిస్తామని జైపాల్ రెడ్డి హెచ్చరించారు. నవయుగ, మెగా కంపెనీలను అనర్హులుగా ప్రకటిస్తామన్నారు.

English Title
KCR losing to telangana
Related News