జంబూ సవారి

Updated By ManamTue, 10/16/2018 - 00:27
jamboo savari

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మైసూరు దసరా ఉత్సవాల్లో హైలైట్ అంటే.. ‘జంబూ సవారీ’నే.  ఈ సవారి చూసేందుకు రెండు కళ్లు చాలవని ప్రత్యక్షంగా చూసిన వారు అభివర్ణిస్తారంటే.. ఇది ఎంత కనుల పండువగా ఉంటుందో ఊహించవచ్చు. 12 ఏనుగులు మైసూరు రాజవీధుల్లో ఒలకబోసే రాజదర్పం చూసేందుకు లక్షలాది మంది దేశవిదేశాల నుంచి వస్తారు. 
 

సందడి వెనుక కథ
imageరాష్ట్రం నలుమూలలా గాలించి రాజఠీవీకి నప్పే ఏనుగుల బృందాన్ని అటవీశాఖ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు ఏటా ఎంపిక చేస్తారు. ఇందుకు ఏనుగుల ఎత్తు, బరువు, ఆరోగ్యం, చర్మం, దంతాలు, వయసు వంటి విషయాలను ఆమూలాగ్రం చూస్తారు. ఇక ఇవి బరువు మోస్తాయా లేదా? ప్రజల మధ్య ధైర్యంగా తిరగగలవా? డప్పుల హోరులో ఇవి భయాందోళనకు గురవుతాయా? మావటితో ఎలా సహకరిస్తాయి.. వంటి ఎన్నో మానసిక అంశాలపైన వీరు కూలంకుషంగా గజరాజులను పరిశీలించాకనే ట్రైనింగ్ మొదలవుతుంది.

నెలన్నర ట్రైనింగ్
 

image

దసరాకు 45 రోజుల ముందు ఈ ట్రైనింగ్ మొదలై..మైసూరు మహారాజమందిరంలో ఈ గుంపు తిష్టవేస్తుంది. ఉత్సవాల చివరి రోజున ‘అర్జున’ అనే గజరాజు 750 కేజీల బరువున్న బంగారు పల్లకిలో (గద్దెపై) అమ్మవారిని తీసుకువస్తుంది. ఏడున్నర టన్నుల బరువు మోసేందుకు అనువుగా.. 200 కిలోల బరువున్న ఇసుక, చెక్కను బరువులుగా మోపుతూ క్రమంగా ఆ బరువును 800 కేజీలకు పెంచేలా అర్జున కు ట్రైనింగ్ ఇస్తారు. రోజుకు రెండుసార్లు అర్జునపై ఇలా బరువులు పెడుతూ..5 కిలోమీటర్ల రాజమార్గంలో రిహార్సల్స్ చేయిస్తారు. ఇక ఈ రిహార్సల్స్ ముగిసిందో వెంటనే.. వేడి నీటితో వీటికి స్నానం చేయిస్తారు. ఆతరువాత ఏడుగురు వండిన ఆహారాన్ని వీటికి కడుపునిండా పెడతారు. ఈ ఆహారంలో కొబ్బరినీళ్లు, బె ల్లం, ఉప్పు, ఎండుగడ్డి, పచ్చగడ్డి, అన్నం వంటి ఎన్నో పదార్థాల మిశ్రమాన్ని ప్రేమగా అందిస్తారు. వీటికి డయేరియా, కడుపునొప్పి వచ్చిందో వెంటనే వైద్యులు తగు చికిత్స అందించి, ఆహారంలోనూ మార్పులు చేస్తారు.

5,650 కేజీల గజరాజు
imageరామన్న అనే 75 ఏళ్ల వ్యక్తి గత 45 ఏళ్లుగా వీటికి గడ్డి సరఫరా చేస్తున్నారు.  ఇందుకు 4 నెలల ముందునుంచే ప్రత్యేకంగా గడ్డిని పెంచుతాడు. నిత్యం 2 టన్నుల పచ్చగడ్డిని సప్లై చేయడం ఈయన విధి.  పశువైద్యుడు డాక్టర్ నాగరాజే 2 దశాబ్దాలుగా దసరా జంబూ సవారికి ఏనుగులను మానసికంగా, శారీరకంగా సిద్ధంచేస్తున్నారు. ఈ ఏనుగులకు కూడా రిటైర్‌మెంట్ ఉంటుంది.. 65 ఏళ్ల తరువాత ఇవి రిటైర్ అవుతాయి. అంటే మరో 8 ఏళ్లలో అర్జున రిటైర్ అయ్యాక.. ఆ స్థానాన్ని ధనుంజయకు ఇచ్చే అవకాశం ఉంది. గజేంద్ర, ద్రోణ, అభిమన్యు, గోపి వంటివి ఆతరువాతి వరుసలోకి వస్తాయి. 5,650 కిలోల బరువున్న అర్జున ఏనుగు 2012 నుంచి చాముండేశ్వరి అమ్మవారి గ ద్దెను మోస్తూ ..దసరా ఉత్సవాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. 1999-2011 మధ్యకాలంలో 13 సార్లు బలరామా అనే ఏనుగు గద్దెను మోయగా..నేటికీ ఇది జంబూ సవారీలో పాల్గొంటూనే ఉండడం విశేషం. ఈ ఏనుగుల బృందానికి 34 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఉండగా.. ఒక్కో మావటికి లక్ష రూపాయల చొప్పున బీమా ఉంది.

English Title
jamboo savari in Mysore
Related News