ఇమ్రాన్ శాంతిమంత్రం

Updated By ManamFri, 09/21/2018 - 00:43
imaran
  • ద్వైపాక్షిక చర్చలు పునరుద్ధరిద్దాం.. ముందు విదేశాంగ మంత్రుల భేటీ

  • ఆపై మీరు పాక్‌కు వచ్చే వాతావరణం.. కశ్మీర్‌సహా అన్ని అంశాలపై చర్చిద్దాం

  • భావి తరాల ప్రయోజనాలకే చర్చలు.. మీ హార్దిక శుభాకాంక్షలకు కృతజ్ఞతలు

  • ప్రధాని మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ లేఖ.. ఇమ్రాన్ శాంతిమంత్రం

imaranఇస్లామాబాద్: పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ శాంతి మంత్రం జపించారు. భారత ప్రధాని నరేంద్రమోదీకి ఒక లేఖ రాసి.. అందులో ఉగ్రవాదం, కశ్మీర్ సమస్య సహా ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తున్న పలు కీలకాంశాలపై ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరిద్దామని అందులో ప్రస్తావించారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈనెల 14వ తేదీన రాసిన ఈ లేఖలో.. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీల మధ్య సమావేశం జరిగితే బాగుంటుందని ప్రతిపాదించారు. న్యూయార్క్‌లో ఈ నెలలో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించవచ్చని ప్రతిపాదించారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పాలంటే ఇద్దరు విదేశాంగ మంత్రుల మధ్య సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ముందే భేటీ నిర్వహించాలని ప్రతిపాదించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సమస్యాత్మకంగా ఉన్నాయడంలో అనుమానం లేదని చెప్పారు. తాము తమ దేశ ప్రజల.. ముఖ్యంగా భవిష్యత్తు తరాల ప్రయోజనాల దష్ట్యా జమ్ము కశ్మీర్ సహా.. అన్ని సమస్యలను శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని భావిస్తున్నామన్నారు. ఇరు దేశాల మధ్య విభేదాలను తగ్గించుకుని, పరస్పర ప్రయోజన ఫలితాలు వచ్చేలా చూద్దామని తెలిపారు. పాక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తనకు మోదీ అందించిన శుభాకాంక్షలకు కతజ్ఞతలు తెలిపారు. ఖురేషీ, సుష్మాల మధ్య జరిగే చర్చలు కొత్త దారులు చూపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ పాకిస్థాన్ సందర్శించి, గతంలో ఆగిపోయిన ద్వైపాక్షిక చర్చలను పునఃప్రారంభించే అవకాశం కలగొచ్చని అన్నారు. అంతకుముందు తనకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 18న రాసిన లేఖకు సమాధానంగా ఇమ్రాన్ తాజా లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్‌కు రాసిన లేఖలో.. తాము పాకిస్థాన్‌తో అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన సంబంధాలు కొనసాగించాలనే భావిస్తున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాదంలేని దక్షిణాసియా కోసం పనిచేద్దామన్నారు. 

Tags
English Title
Imran Shantimantam
Related News