లోకేశ్‌తో ఛాలెంజ్ అని...మళ్లీ పత్తాలేరు

Updated By ManamFri, 11/09/2018 - 16:59
GVL Narasimharao lashes out at chandrababu naidu
GVL Narasimharao lashes out at chandrababu naidu

విజయవాడ : తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహరావు మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు చర్చల పేరుతో రచ్చ చేస్తున్నారని, చర్చలకు పిలిచి పోలీసుల చాటున పారిపోవడం సిగ్గుచేటు అని అన్నారు. సవాళ్లు విసిరి, సమాధానాలు చెప్పలేక పిరికిపందల్లా పారిపోతున్నారని జీవీఎల్ ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారమిక్కడ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ...‘మాజీమంత్రి మాణిక్యాలరావు ఛాలెంజ్‌కి టీడీపీ వాళ్లు ఎందుకు భయపడ్డారో చెప్పాలి. నారా లోకేశ్‌తో ఛాలెంజ్ అన్నారు. మళ్లీ పత్తాలేరు. లోకేశ్ స్థాయి ఏంటి?. ముఖ్యమంత్రి కొడుకు అని తప్ప ఆయనకు విషయం లేదు. బీజేపీ నేతలంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. 

మాణిక్యాలరావును పరామర్శించేందుకు వెళితే వారధి వద్ద అడ్డుకోవడం అప్రజాస్వామికం. జాతీయ మీడియా ముందు టీడీపీ ప్రభుత్వ అరాచకాలన్నీ బయటపెడతాం. ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముతో విలాస ప్రయాణాలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల కోసం బెంగళూరు, ఢిల్లీ పర్యటలనకు వెళ్లినప్పుడు పార్టీ ఫండ్ ఖర్చు పెట్టుకోవాలే తప్ప ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు. రాజకీయ కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు రాష్ట్ర ఖజానా నుంచి ప్రభుత్వానికి చెల్లిస్తే అధికారులను కోర్టుకు ఈడ్చుతాం. విశాఖలో భూ కుంభకోణంపై సిట్ నివేదిక ఇస్తే తూతూ మంత్రంగా క్యాబినెట్ ఆమోదించడం సిగ్గుచేటు. చంద్రబాబుకు ప్రచారంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై లేదు.

సిట్ అంటే సిన్సియర్‌గా టీడీపీ అని అర్థం. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు వస్తే వారిని తప్పించే విధంగా కుట్రలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో నిర్వహించే భూ దందాలపై ఉద్యమాలు చేపడతాం. స్టీల్ ఫ్లాంట్‌తో పాటు విశాఖ రైల్వేజోన్ కూడా ఏర్పాటు చేయగల సమర్ధుడు చంద్రబాబు...పునాది రాళ్లు వేసి వదిలివేయడం ఆయనకు అలావాటేగా. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల్లోని 11 విద్యాసంస్థలను కేంద్రం చొరవతో రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి.

పదేళ్ల కాలపరిమితి ఉన్నా నాలుగేళ్లలో కేంద్రం చేసి చూపించింది. టీడీపీ, కాంగ్రెస్ రాయలసీమపై వివక్ష చూపాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేశాం. ట్రైబల్ యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  ఈ నెల 18న తిరుపతిలో బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ పెట్టి రాయలసీమ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.’ అని అన్నారు.

English Title
GVL Narasimharao lashes out at chandrababu naidu
Related News