హైదరాబాద్‌లో తొలి వన్డే

Team India
  • విశాఖలో రెండో టీ20 

  • భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ఖరారు

హైదరాబాద్: ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఈ నెలలో భారత్ పర్యటనకు రానుందని బీసీసీఐ తెలిపింది. ఈ పర్యటనలో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు రెండు టీ20లు, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడతాయి. 24వ తేదీ బెంగళూరులో జరిగే తొలి టీ20తో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభమవుతుంది. మార్చి 13న ఢిల్లీలో జరిగే చివరి వన్డేతో ముగుస్తుంది. మ్యాచ్‌లన్నీ డే/నైట్ మ్యాచ్‌లే. అయితే రెండో టీ20కి విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుండగా.. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ ఏడాది జరిగే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా ఆడే చివరి సిరీస్ ఇదే. చివరి వన్డే జరిగిన 10 రోజుల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఐపీఎల్ మే నెల మధ్యలో ముగుస్తుంది. వరల్డ్ కప్ ఇంగ్లాండ్‌లో మే 30న ప్రారంభమై జూలై 14న ముగుస్తుంది. 


భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్
తేదీ                           మ్యాచ్                     వేదిక
ఫిబ్రవరి 24              తొలి టీ20                బెంగళూరు
ఫిబ్రవరి 27             రెండో టీ20              విశాఖపట్నం
మార్చి 2               తొలి వన్డే                 హైదరాబాద్
మార్చి 5              రెండో వన్డే               నాగపూర్
మార్చి 8             మూడో వన్డే               రాంచీ
మార్చి 10           నాల్గో వన్డే               మొహాలీ
మార్చి 13            ఐదో వన్డే               ఢిల్లీ

Tags

సంబంధిత వార్తలు