ఫైనల్ ప్రాక్టీస్

Virhat Kohli
  • నేడు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే 

  • మూడు మ్యాచ్‌ల సిరీస్

  • ఉదయం 7:50 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

సిడ్నీ: టెస్టు సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన ఈ నూతన సంవత్సరంలో తొలి వన్డే సిరీస్‌కు సిద్దమైంది. ఆస్ట్రేలియాతో జరగనున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఈ ఏడాది జరగనున్న వరల్డ్ కప్‌కు చివరి సన్నాహకంగా టీమిండియా భావిస్తోంది. కానీ ఊహించని టీవీ షో వివాదం కోహ్లీ సేన ఏకాగ్రతను కాస్త దెబ్బతీసినట్టయింది. శనివారమిక్కడ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనుంది. ఓ టీవీ షోలో భారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. అయితే తొలి మ్యాచ్‌కు తుది జట్టు ఎంపికకు ఆ ఇద్దరు క్రికెటర్లపై తీసుకోనున్న నిర్ణయం కోసం టీమ్ మేనేజ్‌మెంట్ ఎదురుచూస్తోందిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మామూలుగా అయితే ఒక రోజు ముందే తుది జట్టును టీమిండియా ప్రకటిస్తుంది. కానీ కళంకిత క్రికెటర్లపై సీఓఏ, బీసీసీఐ స్పష్టమైన నిర్ణయాలు ఇంకా వెలువడక పోవడంతో ఈ మ్యాచ్‌కు తుది జట్టును ప్రకటించలేదు. దీంతో ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే తొలి వన్డేకు పాండ్య, రాహుల్ అందుబాటులో ఉంటారు. అయినప్పటికీ తొలి వన్డేకు రాహుల్‌ను పక్కన పెట్టే అవకాశముంది. ఎందుకంటే అతను టెస్టు, వన్డే రెండు ఫార్మాట్లలోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. అయితే పాండ్య ఈ మ్యాచ్‌లో ఆడతాడా? లేదా అనేదానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. జట్టులో ఆల్ రౌండర్ ఉండటం చాలా అవసరం. అతను 10 ఓవర్లు బౌలింగ్ చేయడంతో పాటు మిడిలార్డర్‌లో బ్యాటింగ్ కూడా చేయగలడు. ఒకవేళ పాండ్య ఈ మ్యాచ్‌కు దూరమైతే టీమిండియా తన బౌలింగ్ అటాక్‌లో మార్పులు చేసుకుంటుంది. ఎందుకంటే జస్‌ప్రీత్ బుమ్రాకు ఇప్పటికే ఈ సిరీస్‌కు, న్యూజిలాండ్‌తో సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో చివరిసారిగా ఓ ప్రయోగం చేయాల్సి ఉంటుంది. భువనేశ్వర్ కుమార్‌కు తుది జట్టులో చోటు దక్కుతుంది. అయితే ఒకవేళ కోహ్లీ ముగ్గురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగాలనుకుంటే పాండ్య స్థానంలో ఎవరు ఆడతారో చూడాలి. ఇటువంటి సమయంలో మహ్మద్ షమీ లేదా ఖలీల్ అహ్మద్‌లలో ఎవరికో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. పచ్చ గడ్డితో ఉన్న సిడ్నీ పిచ్‌ను చూస్తుంటే టీమిండియా కెప్టెన్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌వైపు మొగ్గు చూపుతాడనిపిస్తోంది. ఒకవేళ తొలి వన్డేలో పాండ్య ఆడకపోతే ఆల్ రౌండర్ స్థానాన్ని రవీంద్ర జడేజా భర్తీ చేస్తాడని కోహ్లీ అన్నాడు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాల్సి వస్తే జడేజాకు తోడుగా కుల్‌దీప్ యాదవ్ ఉంటాడని.. అవసరమైతే కేజార్ జాదవ్ పార్ట్ టైమ్ బౌలర్ బాధ్యతలు నిర్వర్తిస్తాడని కూడా కోహ్లీ చెప్పాడు. ఇద్దరు ఓపెర్లతో పాటు కోహ్లీ మూడో నంబర్ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. జాదవ్, ఎంఎస్ ధోనీ, అంబటి రాయుడు మిడిలార్డర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. 2018లో ధోనీ అంతంత మాత్రంగానే ఆడాడు. 20 వన్డేల్లో 25 సగటుతో 275 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో బరిలోకి దిగనున్న ధోనీ ఈ నూతన సంవత్సరంలో శుభారంభం చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రాయుడుకు ఎంతో కీలకమైన నాల్గో నంబర్ స్థానంలో బాధ్యతలు మరోసారి అప్పగించనుంది. గత సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో తాత్కాలికంగా రాయుడును మిడిలార్డర్‌లో దింపింది. ఆ టోర్నీలో 11 వన్డేలు ఆడిన రాయుడు 392 పరుగులు చేయడంతో పాటు వెస్టిండీస్‌పై 56 సగటు నమోదు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలున్నాయి. 

1985 వరల్డ్ చాంపియన్‌షిప్, 2008 సీబీ సిరీస్ విజయాలు కాకుండా ఆస్ట్రేలియాలో టీమిండియాకు పేలవ రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో కంగారూలతో ఆడిన 48 వన్డేలకుగాను 35 మ్యాచ్‌ల్లో మాత్రమే టీమిండియా గెలిచింది. ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేకపోవడం టీమిండియాకు మరోసారి కలిసిరానుంది. తొలి వన్డేకు ఆస్ట్రేలియా తుది జట్టును ప్రకటించింది. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా నాథన్ లియాన్ ఉన్నాడు. 2010 తర్వాత తొలిసారి పీటర్ సిడ్డిల్‌కు జట్టులో చోటు దక్కింది. తొలిసారి వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ అలెక్స్ క్యారే తొలి వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్‌తో కలిసి బరిలోకి దిగనున్నాడు. ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హాండ్‌స్కంబ్ మిడిలార్డర్ బాద్యతలు నిర్వర్తించనున్నారు. ఆరు, ఏడు స్థానాల్లో మార్కస్ స్టోనిస్, గ్లెన్ మాక్స్‌వెల్ బరిలోకి దిగనున్నారు. అయితే ఆస్ట్రేలియా పేస్ అటాక్ పేపరుపై బలహీనంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎనిమిదేళ్ల తర్వాత సిడ్డిల్ ఆస్ట్రేలియా జట్టుకు ఆడనున్నాడు. మరోవైపు ఎడమ చేతి పేసర్ జాసన్ బెహ్రాన్‌డార్ఫ్ శనివారం వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. ఆస్ట్రేలియా తుది జట్టు: ఆరోన్ ఫించ్, అలెక్స్ క్యారే (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హాండ్‌స్కంబ్, మార్కస్ స్టోనిస్, గ్లెన్ మాక్స్‌వెల్, నాథన్ లియాన్, పీటర్ సిడ్డిల్, జై రిచర్ట్సన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్.

ఎస్‌సీజీలో గణాంకాలు
ఎస్‌సీజీలో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు 16 వన్డేలు ఆడాయి. ఆస్ట్రేలియా 13, ఇండియా రెండు మ్యాచ్‌ల్లో గెలిచాయి. టీమిండియా చివరిసారిగా 2016లో మ్యాచ్ గెలిచింది. మరో రెండు బంతులు మిగిలివుండగా 331 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ సెంచరీలు చేయగా.. టీమిండియాలో మనీష్ పాండే 81 బంతుల్లో 104 పరుగులు సాధించాడు. 
ధావన్ మరో 65 పరుగులు చేస్తే వన్డేల్లో 5000 పరుగులు పూర్తి చేస్తాడు. జడేజా 18 పరుగులు చేస్తే 2000 పరుగులు పూర్తవుతాయి. భువనేశ్వర్ 100 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు 1 వికెట్ దూరంలో ఉన్నాడు. 
క్యారే తొలిసారి వన్డేల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. 

సంబంధిత వార్తలు