ఎప్పుడు చావాలో డిసైడ్ చేస్తా!

Updated By ManamWed, 07/11/2018 - 23:35
japan nurse
  • రోగుల రక్తంలోకి హానికర రసాయనాలు ఎక్కించిన నర్సు

  • 20 మందిని చంపిన జపాన్ మహిళ అరెస్టు 

japan nurseటొక్యో: తాను డ్యూటీలో ఉండగా రోగి మరణిస్తే వారి కుటుంబానికి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ఓ నర్సు దారుణానికి ఒడిగట్టింది. ఇంజక్షన్‌ల ద్వారా రోగుల రక్తంలోకి హానికర రసాయనాలను ఎక్కించి వారు ఎప్పుడు చావాలో ఆమె నిర్ణయించేది. ఈ విధంగా ఆమె 20 మంది రోగుల మరణశాసనం రాసింది. జపాన్ మీడియా కథనం ప్రకారం 2016లో జరిగిన 88 ఏళ్ల ఓ వృద్ధుడి హత్య కేసులో ఆయూమీ కుబొకి(31) అనే ఓ మాజీ నర్సును పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అయితే, పోలీసు విచారణలో ఆ నర్సు సంచలన విషయాలు బయటపెట్టింది. ఒకటి, రెండు కాదు ఏకంగా 20 మంది ప్రాణాలు తనకు నచ్చినప్పుడు తీశానని చెప్పింది. తనకు నచ్చినప్పుడు వాళ్లు చనిపోవాలనే అలా చేశానని ఆ నర్సు పోలీసులకు చెప్పింది. 2016లో జరిగిన హత్య ఘటనపై పోలీసులు విచారణ చేయగా, సబ్బులు, వాషింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించే పలు రసాయనాలతో కూడిన వాడని ఇంజక్షన్లు ఓ ఆస్పత్రిలో లభ్యమయ్యాయి. ఆస్పత్రిలో మరణించిన 79, 89 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు వృద్ధుల శరీరాల్లో కూడా ఇదే రసాయనం ఆనవాళ్లు లభించాయి. దీనిపై విచారణ చేసిన పోలీసులు ఆయూమీ కుబొకిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రశ్నించగా.. ఇద్దరు కాదు మొత్తం 20 మందికి ఆ ఇంజక్షన్లు చేశానని చెప్పింది. ఆ రోగులతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తన డ్యూటీ సమయంలో వారు మరణిస్తే, ఆ విషయాన్ని ఆ కుటుంబాలకు ఎలా చెప్పాలో తెలియక అలా చేశానంది. అయితే 2016 తర్వాత కుబొకి నర్సుగా పని చేయడం మానేసింది.

English Title
Decide in Chawla!
Related News