నిరంతర సత్యాన్వేషి

Updated By ManamFri, 05/18/2018 - 00:47
Continuous truth

image‘నోబెల్’ పురస్కారాన్ని తిరస్కరించిన ధిక్కార శాస్త్రవేత్త. ఎందరో నోబెల్ పురస్కార గ్రహీతలకు ఆయన పరిశోధనలు మార్గదర్శకాలుగా నిలిచిన వైజ్ఞానిక స్రష్ట. 26 ఏళ్ళ వయసులోనే నోబెల్ పురస్కారం పొందగలిగే సైద్ధాంతిక కృషిచేసిన అరుదైన భారతీయ మేధావి. విశ్వమేధావి, ప్రఖ్యాత ప్రభావశీల సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఇ.సి.జి. సుదర్శన్ (86)  సోమవారం అమెరికా లో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు గురువారం ఆస్టిన్ నగరంలో జరిగాయి. ఎన్నక్కల్ చాందీ జార్జి సుదర్శన్ 1931 లో కేరళలోని పల్లాంలో జన్మించారు. ఆయన 40 ఏళ్ళపాటు టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఐదు దశాబ్దాల పాటు సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా కృషిచేశారు. సైద్ధాంతిక భౌతి కశాస్త్రం, క్వాంటమ్ ఆప్టిక్స్, క్వాంటమ్ కంప్యూటేషన్, ఆప్టికల్ కొహెరెన్స్, సుదర్శన్-గ్లాబర్ రెప్రెజెంటేషన్, వి-ఎ థియరీ, టాకియాన్స్, క్వాంటమ్ జెనో ఎఫెక్ట్, ఓపెన్ క్వాంటమ్ సిస్టెమ్, స్పిన్-స్టాటిస్టిక్స్ థియరమ్, నాన్ ఇన్‌వేరియన్స్ గ్రూప్స్, పాజిటివ్ మ్యాప్స్ ఆఫ్ డెన్సిటీ మాట్రిసిస్ తదితర రంగాల్లో అద్భుతమైన ప్రారంభ ఆవిష్కరణలు చేశారు. భారత ప్రభుత్వం 2007లో ఆ యనకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించింది. నోబెల్ పుర స్కారానికి ఆయన పేరును 9 సార్లు సిఫార్సు చేసినా ఆయనకు ఆ అవార్డు దక్కలేదు. 2005లో గ్లాబర్ అనే శాస్త్రవేత్తతో కలిపి సుద ర్శన్‌కు నోబెల్ పురస్కారాన్ని లోపాయికారీగా ప్రకటించినపుడు దాన్ని ఆయన తిరస్కరించి తన మహోన్నత వ్యక్తిత్వాన్ని చాటు కున్నారు. పాక్పశ్చిమ ప్రాంత ప్రజల మధ్య సంబంధాలు, తత్వ శాస్త్రం, మతం తదితర అంశాలపై ఆయన విస్తృతంగా అధ్య యనం చేశారు. 

సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన సుదర్శన్ ఒక హిందూ విద్యార్థిని వివాహం చేసుకున్న తర్వాత హిందూ మత విశ్వాసాల వైపునకు మొగ్గారు. అయితే ఆయన తనను ఒక ‘వేదాంతిన్ హిందూ’గా అభివర్ణించుకున్నారు. ఆయన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఐఎఫ్‌ఆర్)లో ప్రము ఖ శాస్త్రవేత్త హోమీ బాబా వద్ద శిష్యరికం చేశారు. 1958లో న్యూయార్క్‌లోని యూనివర్సిటీలో రాబర్ట్ మార్షక్ వద్ద గ్రాడ్యు యేట్ విద్యార్థిగా చేరారు. రోచెస్టర్ విశ్వవిద్యాలయంలో 1958లో డాక్టరేట్ సాధించారు. భౌతికశాస్త్రంలోని అనేకరంగాలలో ఆయన గణనీయమైన పరిశోధనలు చేశారు. రాబర్ట్ మార్షక్‌తో కలసి ఆయన వి-ఏ (వెక్టర్ మైనస్ ఏక్సియల్) సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఆ సిద్ధాంతం ‘ఎలక్ట్రో వీక్ థియరీ’ అనే వినూత్న సిద్ధాం త ఆవిర్భావానికి దోహదం చేసింది. వి-ఎ సిద్ధాంతంపై ఆధార పడి రిచర్డ్ ఫెన్‌మ్యాన్, ముర్రే గెల్-మన్‌లకు, 1979లో స్టీవెన్ వెయిన్‌బెర్గ్, షెల్డెన్ గ్లాషో, అబ్దుస్ సలాం అభివృద్ధి చేసిన ఎలక్ట్రో వీక్ థియరీ తదితర పరిశోధనలకు వారికి నోబెల్ పురస్కారాలు పొందారు. 1960లో క్వాంటమ్ ఆప్టిక్స్ రంగంలో ఆయన కృషి చే శారు. సంప్రదాయక ఎలక్ట్రోమ్యాగ్నటిక్ సిద్ధాంతాన్ని ఆప్టికల్ ఫీల్డ్స్‌ను వివరించేందుకు సుదర్శన్ చేసే ప్రయత్నాన్ని ఎద్దేవా చేస్తూ ప్రముఖ శాస్త్రవేత్త గ్లాబర్ తీవ్రంగా విమర్శించారు. కొహె రెంట్ కాంతిని క్వాంటమ్ సిద్ధాంతం రీత్యా విజయవంతంగా వివరించారు. అయితే సుదర్శన్ సిద్ధాంతాన్ని ఆ తర్వాత తన సొంత సిద్ధాంతం (పి-రెప్రెజెంటేషన్)గా గ్లాబర్ ప్రతిపాదించడం వివాదాస్పదంగా మారింది. అయితే మధ్యేమార్గంగా ఆ సిద్ధాంతానికి సుదర్శన్-గ్లాబర్ రెప్రెజెంటేషన్ అని పేరును స్థిరపరచారు. అయితే 2005లో రాయ్ జె.గ్లాబర్‌కు మాత్రమే క్వాంటమ్ ఆప్టిక్స్‌లో కృషిచేసినందుకు నోబెల్ పురస్కారం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు నిరసన వ్యక్తంచేస్తూ స్వీడిష్ అకాడమీకి గ్లాబర్ మోసం గురించి వివరిస్తూ లేఖ రాశారు. దాంతో సుదర్శన్, గ్లాబర్‌లిద్దరికీ ఉమ్మడి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. ఆ తర్వాతి తరం నోబెల్ పురస్కార గ్రహీతలైన స్టీఫెన్ హాకింగ్, రోజర్ పెన్‌రోజ్, పీటర్ హిగ్స్ వంటి విజ్ఞానశాస్త్ర దిగ్గజాలు సుదర్శన్ కనుగొన్న నూతన సైద్ధాంతిక భౌతికవాద పరిశోధనలపై ఆధారపడి చేసిన కృషి కారణంగానే నోబెల్ పురస్కారాలు పొందారు. ‘వీక్ ఇంటర్‌యాక్షన్స్‌కు చెందిన సార్వత్రిక సిద్ధాంతం, సూర్యకాంతి కన్నా వేగంగా ప్రయాణం చేసే కణాలు ‘టాకియాన్స్’, సిమెట్రీస్ అండ్ క్వాంటమ్ థియరీలు, స్పిన్, స్టాటిస్‌స్టిక్స్, క్వాంటమ్ జెనో ఎఫెక్ట్, ఎవల్యూన్ ఆఫ్ జనరల్ క్వాంటమ్ స్థితులు తదితర సిద్ధాంతాలు ఒక భారతీయ శాస్త్రవేత్త ఆవిష్కరించడం దేశానికే గర్వకారణం. 

అమెరికాలోని ఆస్టిన్ విశ్వవిద్యాలయంలో సుదర్శన్ ఎక్కువ కాలం పనిచేసినప్పటికీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్, అమెరికాలోని హర్వార్డ్ రోచెస్టర్ విశ్వవిద్యాలయాల్లో, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో పనిచేశారు. సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తలందరి వలె సుదర్శన్ కూడా తాత్విక సూత్రాలను ఎక్కువగా అధ్యయనం చేశారు. వేదాంత దార్శనికతను ఆయన తన పరిశోధనాత్మక దృక్కోణంగా అభివృద్ధి చేసుకున్నారు. సమ కాలీన భారతీయ తాత్వికుడు, గొప్ప చింతనాపరుడు జిడ్డు కృష్ణ మూర్తిని తరచూ కలుస్తూ అనేక తాత్విక చర్చల్లో మునిగి తేలేవారు. వేదాంత దార్శనికత గురించి ప్రపంచవ్యాప్తంగా సుద ర్శన్ ప్రసంగాలు సుపరిచితం. ఐసీటీపీ డిరాక్ మెడల్ (2010), మజోరానా ప్రైజ్ (2006) టిడబ్ల్యూఏఎస్ ప్రైజ్ (1985), బోస్ మెడల్ (1977), పద్మభూషణ్ (1976), సి.వి. రామన్ అవార్డు (1970) తదితర అవార్డులు సుదర్శ న్‌ను వరించాయి. సుదర్శ న్‌కు నోబెల్ పురస్కారం దక్కక పోయినప్పటికీ ఆయన సిద్ధాంత ప్రేర ణతో, ఆయన స్ఫూర్తి తో చాలామందికి నోబె ల్ భౌతికశాస్త్ర పురస్కా రాలు వరించాయి. శాంతి ప్రవక్త మహాత్మ గాంధీకి కూడా నోబెల్ శాంతి పుర స్కారం ఇచ్చి గౌరవించని స్వీడిష్ అకాడెమీ సుదర్శన్ వంటి వారిని గుర్తించక పోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. సైద్ధాంతిక భౌతిక శాస్త్ర రంగంలోని అనేక విప్లవాత్మక సిద్ధాంతాలకు సుదర్శన్ ఒక ట్రెండ్ సెట్టర్. అలాంటి మహా చింతనాపరుడ్ని తగిన విధంగా గౌరవించుకోలేక పోవడం వైజ్ఞానిక ప్రపంచానికే సిగ్గుచేటు. నూతన ఆవిష్కరణల్లో మునిగి తేలడం, సత్యాన్వేషణ తృష్ణతో పొందిన ఆనందం (జాయ్ ఆఫ్ డిస్కవరి) ముందు ఏ ‘నోబెల్’ పురస్కారం సమానం కాదనే స్ఫూర్తితో సుదర్శన్ వైజ్ఞానిక జైత్రయాత్ర చేశారు. యువతరం ఆయన దార్శనికతను, అన్వేషణా సంకల్పాన్ని స్ఫూర్తిగా గ్రహించాలి. 
 
 మాదిరాజు సునీత

English Title
Continuous truth
Related News