జాత్యహంకారానికి రాజ్యాంగ హోదా 

Updated By ManamSun, 07/22/2018 - 00:45
IMAGE

ప్రతిపక్షాల నిరసనల మధ్య ఇజ్రాయిలీ పార్లమెంట్ గురు వారం వివాదాస్పద ‘నేషన్-స్టేట్’ (జాతి-రాజ్యం) చట్టాన్ని imageఆమోదించింది. జాతి రాజ్యం అంటే నిర్ధిష్టంగా చెప్పాలంటే.. ఒక విభిన్న సంస్కృతి లేదా నిర్దిష్ట జాతి/భాషకు సంబంధించిన ప్రజా సమూహం ఒక ప్రాంతంలో తమదైన రాజ్యాన్ని, రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవడమే. ఈ చట్టంతో యూదు జాతీయులకే ఇజ్రాయిల్ దేశంలో సర్వహక్కులు సంక్రమిస్తాయి. ఇతర జాతీయలు, మతస్థులు రెండవ శ్రేణి పౌరుల హోదాకు దిగజారుతారు. యూదుయేతర జాతి నిర్మూలనకు ఇది ప్రాతిపదిక కల్పించడమే కాదు, ప్రాథమి కమైన సమానత్వ హక్కును బాహాటంగా కాలరాయడమే. మానవ హక్కులను, మైనారిటీల హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ చట్టాలను, న్యాయ నియమాలను నిర్లక్ష్యం చేయడమే.

ఇంతవరకు ఇజ్రాయిల్ చేసిన చట్టాల్లోకెల్లా ఇది అత్యంత అమానుషమైనది. యూదు రాజ్యాంలో యూదులే ప్రథములని, యూదుయేతరులంతా ద్వితీయ శ్రేణి పౌరు లుగా పరిగణించే ఈ చట్టంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయిల్ జనాభాలో 20 శాతా నికి పైగా ఉన్న యూదుయేతరులను ముఖ్యంగా పాలస్తీనీయులన్లను లక్ష్యంగా ఇప్పటికే అనేక దాడులు జరుగు తున్నాయి. పాలస్తీనియులను శరణార్థులుగా మార్చి, తన రాజకీయ ప్రయోజనాల కోసం వారిపై మరింత జాత్యం హకార దాష్టీకానికి పాల్పడేందుకు నెతన్యాహు దక్షిణ పక్ష శక్తులకు ఈ చట్టం మరింత అవకాశం కల్పిస్తోంది. ఈ చట్టం పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత సంక్లిష్టంగా మార్చే ప్రమాదం ఉంది. 

ఇజ్రాయిల్ పార్లమెంట్ ఆమోదించిన ‘జాతి రాజ్యం’ చట్టం ప్రకారం హిబ్రూ మాత్రమే అధికార భాషగా గుర్తింపు పొందింది. అరబిక్ భాష అధికార హోదాను కోల్పోయింది. జెరూసలెం నగరంలో కొంత భాగం ఇజ్రాయిల్‌కు, మరి కొంత భాగం పాలస్తీనాకు రాజధానిగా ఉండాలనే ప్రతి పాదన ఉన్నది. అయితే ఈ నగరం పూర్తిగా ఇజ్రాయిల్ రాజధాని అని గతంలో అమెరికా గుర్తింపును ఈ చట్టం ధ్రువీకరిస్తుంది. యూదుల నివాసాలను వృద్ధి చేయడం జాతీయ విలువగా ఈ కత్త చట్టం పేర్కొంటున్నది. దీని వల్ల ఆక్రమిత ప్రాంతాలలో యూదులను తరలించి నివాసాలు ఏర్పాటు చేయడం వేగవంతమవుతుది. ఆక్రమిత ప్రాంతా లలోని అరబ్బులు హైకోర్టును ఆవ్రయించడానికి వీలు లేదు. తమపై దాడులు చేసినందుకు ఇజ్రాయిల్ దేశంపై, సైనికు లపై కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉండదు. ఇప్పటికే విద్య వైద్యం, నివాసాలు మొదలైన అన్ని రంగాల్లో అరబ్బుల పట్ల వివక్ష సాగుతున్నది. ఇజ్రాయిల్ ప్రభుత్వం ఆక్రమిత ప్రాంతాలలోని పాలస్తీనా ప్రజలనే దారుణంగా అణచివేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను తరలించి ఆక్రమిత ప్రాంతాల్లో వారికి నివాసాలను ఏర్పాటు చేస్తున్నది. స్వయం నిర్ణయాధికార హక్కు యూదులకు మాత్రమే వుంటుందని చెప్పడం ద్వారా గత యాభై ఏళ్ళలో అక్రమగా ఆక్రమించిన పాలస్తీనా భూ భాగాల గురించి ఎవరూ ప్రశ్నించకుండా చేయడమే ఈ చట్టం ఉద్దేశం. గ్రేటర్ ఐక్య జెరూసలెంను ఇజ్రాయిల్ రాజధానిగా ప్రకటించడమే కాక, జాతీయ గీతం, చిహ్నాలు, పతాకాలను కొత్తగా రూపొందించడం వంటి యూదు జాత్యహంకార చర్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తీవ్రతరమైన నేపథ్యంలో అంతర్జాతీయంగా తలెత్తిన ఫాసిస్టు, అర్థ ఫాసిస్టు, దక్షిణ పక్ష రాజకీయ శక్తులు, ప్రభు త్వాలు క్రమంగా మైనారిటీలపైన, బడుగు, బలహీన వర్గాలపైన విద్వేషకాండకు పాల్పడుతున్నాయి. దక్షిణపక్ష, ఫాసిస్టు, జాత్యహంకార రాజకీయ శక్తుల ఏకీకరణ దిశగా భౌగోళిక రాజకీయ సమీకరణాలు కేంద్రీకృతమవుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయిల్ జాతి రాజ్యం చట్టం ముందు కొచ్చింది. భవిష్యత్‌లో అమెరికా భౌగోళికాధిపత్య రాజకీయ, ఆర్థిక, సైనిక వ్యూహాలకు ఇజ్రాయిల్ జాతి రాజ్యం కొత్త తరహాలో కీలక పాత్ర వహించే ప్రమాదం ఉన్నది. 

జెరూసలెంను అంతర్జాతీయ నగరంగా పరిగణిస్తూ ఐక్యరాజ్యమితి చేసిన తీర్మానాన్ని ఇజ్రాయిల్ జాతీయ చట్టం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది. 1948లో ఇజ్రాయిల్ పాలస్తీనా లోని అరబ్బు ప్రాంతాలపై దాడి చేసి కొన్ని ప్రాంతాలను కబళించినపుడు జెరూసలెం స్వతంత్ర అంతర్జాతీయ నగరంగా వుంటుందని ఐరాస తీర్మానించింది. ముస్లింలు, యూదులు, జుడాయిస్టులు మూడు మతాలకు చెందినవారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జెరూసలెంపై యూదులదే పెత్తనం కొనసాగింది. 1949లో అరబ్బులకు, ఇజ్రాయిల్‌కు మధ్య జరిగిన యుద్ధంలో జెరూసలెంలోని పశ్చిమ ప్రాంతాన్ని ఇజ్రాయిల్ ఆక్రమించుకోగా, తూర్పు ప్రాంతం జోర్డాన్ ఆధీనంలో ఉంది. 1967 యుద్ధం తరువాత వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలెంను జోర్డాన్ నుంచి ఇజ్రాయిల్  స్వాధీనం చేసుకుంది. 1980లో తన ఆధీనంలో ఐక్య జెరూసలెంను ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నాన్ని ఐక్యరాజ్య సమితి అడ్డుకుని, ఆ నగరం స్వతంత్ర ప్రాంతంగా ఉంటుం దని తీర్మానించింది. అయితే మారిన ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో జెరూసలెంను ఇజ్రాయిల్ రాజథానిగా గుర్తిస్తు న్నట్లు అమెరికా ప్రకటించడమే కాక తన రాయబార కార్యా లయాన్ని కూడా అక్కడి తరలించడంతో మళ్ళీ పాత వివాదం మరింత తీవ్ర రూపంలో ముందుకొచ్చింది. సౌదీ అరేబియా తదితర చమురు సంపన్న రాచరిక కుటుం బాలను కూడగట్టి ఇజ్రాయిల్‌ను పటిష్టపరచి, ఇరాన్‌పైకి రెచ్చగొట్టడం ద్వారా చమురు నిల్వలు పుష్కలంగా ఉన్న పశ్చిమాసియాపై పట్టు సంపాదించడమన్నది అమెరికా వ్యూహం. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని షేల్ గ్యాస్, ఆయిల్ నిల్వలు అమెరికాకు అందుబాటులోకి వచ్చాక, చమురు మార్కెట్‌పై ఆధిపత్యం కొనసాగించడం కోసం పశ్చిమా సియా చమురు నిల్వలపై పట్టు కోసం అమెరికా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది.

ఇజ్రాయిల్ జాతి రాజ్యం చట్టం ద్వారా ప్రత్యక్షంగా ఇరాన్, పరోక్షంగా ఈయూ, చైనా, రష్యాల మద్దతుగల స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకుగల అవకాశాలను అడ్డుకోవాలని చూస్తోంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అమెరికా సహాయంపై మందగించిన ఇజ్రాయిల్‌కు ఈ పరిస్థితి ఒక మంచి అవకాశంగా దొరికింది. ఇదే అదనుగా జాతి రాజ్యం అనే ఈ జాత్యహంకార చట్టాన్ని రూపొందించింది. అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతుల్లో కూరుకుపోయిన దక్షిణ పక్ష నెతన్యాహు ప్రభుత్వం నవంబర్ లో జరిగే ఎన్నికల నేపథ్యంలో తిరిగి అధికారంలోకి వచ్చేం దుకు యూదు దురహంకారాన్ని అనేక రూపాల్లో రెచ్చగొడు తోంది. అదే సమయంలో పాలస్తీనా పోరాటానికి సుదీర్ఘ కాలంగా మద్దతు పలుకుతున్న భారత వైఖరి దక్షిణ పక్ష భావజాలంతో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా యూటర్న్ తీసుకుంది. జెరూసలెంను ఇజ్రాయిల్ అయోధ్యగా సంఘపరివార్ శక్తులు భావిస్తున్నాయి. నెతన్యాహు ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అన్నిరంగాల్లో సాన్నిహిత్య పెంపొందించుకోవడం ఇరు దేశాల అధినేతల ఒకే రకమైన భావజాల గూటి పక్షులు కావడమే. జాత్య హంకార ఇజ్రాయిల్ పాలకులను అడ్డుపెట్టుకొని భౌగోళికా ధిపత్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు అమెరికా వేస్తున్న ఎత్తు గడలను ప్రపంచ ప్రజలు చిత్తు చేయకపోతే అంత ర్జాతీయ సమాజం మరిన్ని రక్తసిక్త యుద్ధాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.  

- మాదిరాజు సునీత

English Title
Constitutional status for racism
Related News