అయోధ్య కేసులో సుప్రీం కీలక నిర్ణయం

Updated By ManamSat, 03/24/2018 - 08:50
constitutional bench to decide muslims masjid essentiality
  • 1994 ఫరూకీ కేసులో నాటి సుప్రీం తీర్పు పున:పరిశీలన కోసం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ

  • బాబ్రి కేసులో నాటి వివాదాస్పద తీర్పును పున:పరిశీలించాల్సిన అవసరముందన్న సుప్రీం 

constitutional bench to decide muslims masjid essentiality

న్యూఢిల్లీ: రామజన్మభూమి అయోధ్య-బాబ్రి మసీదు కేసు‌లో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అది ఎప్పటికి తేలేనో ఏమో గానీ.. ఆ కేసు ఇప్పుడు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. సుప్రీం కోర్టు మసీదులకు సంబంధించి ఓ ధర్మ సందేహాన్ని వ్యక్తం చేసింది. అదేంటంటే.. ‘ముస్లింలకు మసీదు అనేది అంత ముఖ్యమా?’ అనే సందేహాన్ని ముందు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌ల నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ సందేహాన్ని నివృత్తి చేయడం కోసం.. 1994లో నాటి సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ‘ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు మసీదులే అక్కర్లేదు. బయట కూడా చేసుకోవచ్చు. కాబట్టి ముస్లింలకు మసీదుల అంత ముఖ్యమేం కాదు’ తీర్పును పున:పరిశీలించాల్సిందిగా సూచిస్తూ దానిని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే, అసలు అయోధ్య-బాబ్రి మసీదు భూ తగాదా మొత్తం కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అవసరం లేదని తేల్చి చెప్పింది.

బాబ్రి మసీదు కేసుకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అసలైన కక్షిదారుల్లో ఒకరైన ఎం సిద్దిఖీ తరఫు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ కోర్టులో వాదనలు వినిపించారు. ముస్లింలకు మసీదులు అవసరమా అన్న ఒక్క అంశాన్నే రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసే బదులు కేసు మొత్తాన్ని బదిలీ చేయొచ్చు కదా అని కోర్టును కోరారు. అయోధ్య విషయంలో మళ్లీ ‘ఇస్మాయిల్ ఫరూఖీ కేసు’ను తిరిగితోడడం సబబు కాదన్నారు. కాబట్టి ఆ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే, దానికి న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుత సుప్రీం త్రిసభ్య ధర్మాసనమే అయోధ్య కేసును వాదిస్తుందని, ఇస్లాంలో మసీదులనేవి ప్రార్థనకు ప్రాథమిక ఆధారాలన్న ముస్లింల మనోభావాలను పరిశీలించాల్సిన అవసరముందని, అందుకే రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ముందు ఆ వివాదానికి చెక్ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పింది. 

1994 కేసు..
1994 ఇస్మాయిల్ ఫరూఖీ కేసులో నాటి సుప్రీం ధర్మాసనం ముస్లింల ప్రార్థనలకు మసీదులు అక్కర్లేదన్న తీర్పునిచ్చిందని ధర్మాసనం గుర్తు చేసింది. ముస్లింలు నమాజ్‌ను ఓపెన్ ప్లేస్‌లోనైనా చేసుకోవచ్చని, మసీదులే అక్కర్లేదని, కాబట్టి మసీదులు ముస్లింలకు అంత అవసరం లేదని నాటి సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించినట్టు చెప్పింది. కాబట్టి దానిని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేవని వ్యాఖ్యానించిందని, ఆ వివాదాన్ని ముందు పరిష్కరించాల్సిన అవసరముందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, దీనిపై దాదాపు రెండు గంటల పాటు వాదనలు వినిపించిన లాయర్ ధావన్.. ఫరూఖీ కేసులో సుప్రీం కోర్టు తప్పుడు తీర్పునిచ్చిందని, అంతకుముందు మరో ధర్మాసనం ఇచ్చిన ‘మసీదు ఎప్పటికీ ఉంటుంది. మసీదు ప్రాధాన్యం ఎప్పటికీ మాసిపోకూడదు. దానిని కూల్చేసినా ప్రార్థనకు నిలయంగానే భావించాలి’ తీర్పుకు విరుద్ధంగా నాటి ధర్మాసనం తీర్పు ఉందని ధావన్ వాదించారు. అయినా కూడా ఆ అంశాన్ని ముందు పరిష్కరించేందుకు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరముందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

English Title
constitutional bench to decide muslims masjid essentiality
Related News