ఇండియాతో బంగ్లా ఢీ

Updated By ManamFri, 09/21/2018 - 00:11
hardhik
  • నేటి నుంచి సూపర్ ఫోర్ దశ

  • ఆసియా కప్ క్రికెట్

దుబాయ్: లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా సూపర్ ఫోర్ దశకు చేరుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం తొలి మ్యాచ్‌లో ఇండియా, బంగ్లాదేశ్ జట్లు ఆడనున్నాయి. అయితే టీమిండియాకు టీమ్ కాంబినేషన్ బెడద పట్టుకుంది. ఎందుకంటే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వెను నొప్పి గాయానికి గురయ్యాడు. మరోవైపు హాంకాంగ్, పాకిస్థాన్‌లతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆడిన భువనేశ్వర్ కుమార్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చే అవకాశముంది. అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ కూడా దూం కావడంతో టీమిండియా గాయాల సంఖ్య పెరిగింది. ఎడమ చేతి పేసర్ ఖలీల్ అహ్మద్‌ను భువీ స్థానంలో జట్టులోకి తీసుకునే అవకాశముంది. మనీష్ పాండే రాకతో మిడిలార్డర్ బ్యాటింగ్ బలోపేతమైందని చెప్పవచ్చు. పాండ్య బౌలింగ్ కోటాను కేదార్ జాదవ్ భర్తీ చేసే అవకాశముంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ టీమిండియాకు శుభారంభాన్నిచ్చారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడు, దినేష్ కార్తీక్ సత్తా చాటారు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్‌లో లేకపోవడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ధోనీ దూకుడుగా ఆడలేకపోతున్నాడు. దీంతో అతను క్రీజు వద్ద నిలదొక్కుకునేందుకు మరింత ముందుగానే ధోనీని రోహిత్ పంపించే అవకాశముంది. చరిత్రలో ఇండియా, పాకిస్థాన్ జట్లే చిరకాల ప్రత్యర్థులు.

కానీ 2015 వరల్డ్ కప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్ వివాదం తర్వాత బంగ్లాదేశ్ కూడా టీమిండియాకు ప్రత్యర్థిగా మారింది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో బంగ్లాదేశ్ కూడా బలమైన ప్రత్యర్థి అన్న వాదనను కొట్టిపారేయలేం. 2012 ఆసియా కప్‌లో ఈ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. మష్రఫే మోర్తజా, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా రియాద్ వంటి స్ఫూర్తిదాయక ఆటగాళ్లతో ఎటువంటి ప్రత్యర్థినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. మోర్తజా, షకీబ్ వంటి అనుభవజ్ఞుల అండతో నాణ్యమైన పేసర్లు ముస్తాఫిజుర్ రహమాన్, రూబెల్ హుస్సేన్ టీమిండియాను మిడిల్ ఓవర్లలో కట్టడి చేసేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. రెండు రోజులు రెండు మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. గురువారం అఫ్ఘానిస్థాన్‌తో అబుధాబీలో మ్యాచ్ ఆడిన బంగ్లా జట్టు శుక్రవారం దుబాయ్‌లో సూపర్ ఫోర్ మ్యాచ్‌ను టీమిండియాతో ఆడుతుంది. నిజానికి ఇది ఒరిజినల్ షెడ్యూల్ కాదు. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ను బీసీసీఐ మేనేజ్ చేయడం చాలా మందిని బాధించింది. 

  • పాండ్యా, అక్షర్ ఆసియాకప్‌కు దూరం

  • జడేజా, చాహర్‌లకు పిలుపు

imageఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడి టోర్నీ నుంచి వైదొలగగా, ఇప్పుడు మరో ఇద్దరు భారత క్రికెటర్లు అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్‌లు సైతం గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమయ్యారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అక్షర్ పటేల్ ఎడమచేతి చూపుడు వేలికి గాయమైంది. దాంతో అక్షర్ చేతి వేలికి స్కాన్ చేసిన తర్వాత గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో అతను పూర్తి సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స్పష్టం చేసింది.ఈ విషయాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న బీసీసీఐ.. తొడ కండరాల గాయంతో పేసర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఆసియాకప్‌కు దూరమైనట్లు తెలిపింది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ తొడ కండరాలు పట్టేశాయి. దాంతో అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ స్థానంలో సిద్దార్థ్ కౌల్‌లు తదుపరి సిరీస్‌లో ఆడతారని పేర్కొంది. హార్దిక్ పాండ్యా స్థానంలో దీపక్ చాహర్‌ను జట్టులోకి తీసుకున్నారు.

English Title
Bangla with India
Related News