ఆశలన్నీ ఆయనపైనే

Updated By ManamFri, 07/13/2018 - 06:46
amith
  • నేడు హైదరాబాద్‌కు అమిత్‌షా

  • బీజేపీ ఆఫీసులో వ్యూహరచన.. పర్యటనపై రాజకీయల్లో ఆసక్తి

  • వివిధ వర్గాలతో వేర్వేరు సమావేశాలు.. తెలంగాణలో గెలుపు కోసమే : లక్ష్మణ్

imageహైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. ఈయన రాకపై రాజకీ య వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. రాజకీయ వ్యూహాలు చేయడంలో దిట్ట అయిన కమల దళపతి రాష్ట్రంలో ఎలాంటి చక్రం తిప్పనున్నారో అని అందరూ వేచిచూస్తున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి ఆ పార్టీ నేతలకు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి. అయితే అమిత్ షా గత నెలలోనే రావాల్సి ఉండగా, పలు కారణాలతో రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. 

రోజంతా పార్టీ కార్యాలయంలోనే.. 
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అమిత్ షా.. రాష్ట్రంలోని వివిధ వర్గాలతో వేర్వేరుగా ప్రత్యే కంగా సమావేశం కానున్నారు. బీజేపీ సీనియర్ నేతలు, విస్తారక్‌లు, హోల్‌టైమర్లు, తదితరులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, ఎమ్మెల్యే టిక్కె ట్ ఆశావహులు, జన చైతన్యయాత్ర విశేషాలు, చేరిక లు తదితర విషయాలపై చర్చించనున్నారు. ఆయా విషయాలపై రోజంతా పార్టీ కార్యాయంలోనే ఉండి ప్రత్యేకంగా మాట్లాడతారు. కాగా రాష్ట్ర పరిస్థితులపై అమిత్ షా అన్ని వివరాలను తెప్పించుకున్నట్లు సమాచారం. అదే విధంగా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులతో ఎప్పటికప్పుడు స్వయంగా అమిత్ షా ఫోన్‌లో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. 

మళ్లీ రాజకీయ వేడి పుట్టిస్తారా..?
ఏడాడి క్రితం అమిత్ షా రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించారు. అక్కడ బూత్ స్థా యి నుంచి పార్టీ బలోపేతంపై కార్యకర్తలతో సమా వేశమయ్యారు. దళితులతో సహపంక్తి భోజనం చేశా రు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం రూ. లక్ష కోట్లు ఇచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. దీంతో రాష్ట్రంలో ఒక్క సారిగా రాజకీయాలు వేడెక్కాయి. స్వయంగా సీఎం కేసీఆరే విలేకరుల సమావేశం నిర్వహించారు. అమిత్ షా కాదు బ్రమిత్ షా అని మండిపడ్డారు. లెక్కలతో సహా వివరించారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధమే నడిచింది.  అయితే ఇటీవల టీఆర్‌ఎస్‌పై బీజేపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే అమిత్ షా పర్యటిస్తుండటంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఏర్పాట్లు పూర్తి.. 
అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అమిత్ షా పాట్నా నుంచి ఉదయం 10.30గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. ఆయనకు బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను గురువారం కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు పరిశీలించారు. 

టార్గెట్ తెలంగాణ: లక్ష్మణ్
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అమిత్ షా రాష్ట్ర పర్యటన చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళిక రచించనున్నట్లు వివరించారు. త్రిపుర, అస్సోంలలో మాదిరే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు. టార్గెట్ 60 ప్లస్ అసెంబ్లీ స్థానాలు, రెండంకెల పార్లమెంట్ స్థానాలు సాధించడమే ధ్యేయమన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమిత్ షా పర్యటన తర్వాత రాష్ట్రంలో మరింత ఉధృతంగా పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీనే ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలు అవకాశావాద, విభజన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నియంతృత్వ, కుటుంబపాలన, అవినీతి పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మనోహర్‌రెడ్డి, ఆచారి, సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాకేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags
English Title
All the hopes are on him
Related News