40 వేల కోట్లతో 10 లక్షల ఇళ్లు

Updated By ManamFri, 11/09/2018 - 23:39
cm
  • పట్టణాల్లోని పేదలకు నిర్మాణం.. ‘గేటెడ్ కమ్యూనిటీ ప్లస్’ తరహాలో..

  • ఈ నెల 15లోపు లబ్ధిదారుల ఎంపిక

  • 22కల్లా ఆన్‌లైన్ లాటరీ పద్ధతి పూర్తి

  • డిసెంబరు 15న లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు

  • సీఎం చంద్రబాబునాయుడు వెల్లడి

cmఅమరావతి: పట్టణాల్లోని పేదల ఇంటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.  రూ. రూ.40వేల కోట్లతో పట్టణ పేదలకు 10 లక్షల ఇళ్ల నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం పట్టణ గృహ నిర్మాణంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.‘‘దేశానికే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పట్టణ గృహ నిర్మాణ(అర్బన్ హౌజింగ్) కార్యక్రమం. లక్షలాది పేద కుటుంబాల కలల ప్రాజెక్టు. ఏపీలో రూ.39,427 కోట్లతో 9,58,230 ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం.ఇందులో కేంద్రం వాటా రూ.7,946 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.13,481కోట్లు. కేంద్ర, రాష్ట్రాల వాటా కింద ఇప్పటివరకు రూ.5,804కోట్లు విడుదల చేశాం.ఈ ప్రాజెక్టు సమాజానికి అతిపెద్ద సంపద అవుతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘‘పట్టణ పేదలకు సొంతింటి కల నిజం చేయాలి. దేశంలోనే బెస్ట్ ఏజెన్సీలను గుర్తించాం. రెండు, మూడు స్థాయిలలో క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నాం. పీఎంఏవై ఎన్టీఆర్ నగర్‌లు (ఏహెచ్ పి) కింద మంజూరైన ఇళ్లు 5,29,786. అందులో గ్రౌండ్ అయినవి 3,29,217. వాటిలో 98,705 ఇళ్లకు శ్లాబులు పడ్డాయి. ఎన్టీఆర్ అర్బన్ హౌజింగ్(బీఎల్‌సీ) కింద మంజూరు అయ్యింది 4,28,444. అందులో గ్రౌండ్ అయ్యింది 1,01,426. వాటిలో ఇప్పటివరకు 56,800 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది’’ అని సీఎం పేర్కొన్నారు. నవంబరు 15లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, ఆన్ లైన్ లాటరీ నవంబరు 22కల్లా పూర్తిచేయాలని సూచించారు. మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు నవంబరు 30కల్లా ముమ్మరం కావాలన్నారు. లబ్దిదారుల ఎంపిక బాధ్యత జిల్లా ఎంపిక కమిటీ, ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. మీడియా సమక్షంలో లాటరీ పద్ధతిని పారదర్శకంగా నిర్వహించాలని, ఇందులో ఎలాంటి లోపాలు ఉత్పన్నం కారాదని అన్నారు. తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాజెక్టు ప్రారంభంలో ఉన్న శ్రద్ధ పూర్తి చేయడంలో చూపడం లేదని సీఎం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ, మునిసిపల్ అధికారులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ఎందులోనూ రాజీపడే ప్రసక్తే లేదని, రోడ్లు,విద్యుత్, తాగునీరు, డ్రైనేజి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలని అన్నారు. వీధి దీపాల ఏర్పాటుతో పాటు పచ్చదనం పెంపొందించాలని సూచించారు.తాను ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు.

‘గేటెడ్ కమ్యూనిటీ ప్లస్’ తరహాలో..
పట్టణాల్లోని పేదలకు ‘గేటెడ్ కమ్యూనిటీ ప్లస్’ తరహాలో ఇళ్లు నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. ఇళ్లకు దగ్గరలోనే ఆర్ధిక కార్యకలాపాలు(ఎకనామిక్ యాక్టివిటీస్) పెంచుతున్నాం’’ అని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, కాలువ శ్రీనివాసులు, పట్టణాభివ ద్ధి శాఖ కార్యదర్శి కరికాల వలవన్, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్ ఎల్ బిసి కన్వీనర్, ఎమ్మెల్యేలు,మున్సిపల్ కమిషనర్లు,బ్యాంకర్లు పాల్గొన్నారు.

లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు..
డిసెంబరు 15న ‘‘లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు’’ వేడుకగా జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మన ఇళ్ల నిర్మాణం ఇతర రాష్ట్రాలకు ఒక నమూనా వంటిదని,  ఏడు రాష్ట్రాల ప్రతినిధి బృందాలు చూసి ప్రశంసించాయని చెప్పారు. ‘‘ ఇళ్లు చూడగానే ఆహ్లాదంగా ఉండాలి. యజమాని దగ్గరుండి ఇంటి పనులు చూసుకోవాలి. ఇంటితో అనుబంధం పెంచుకునేలా చేయాలి. ఈ రోడ్లు ఎప్పుడు వేశారు. ఆ పార్కు ఎప్పుడు అభివృద్ధి చేశారు. వీధి దీపాలు ఎప్పుడు పెట్టారు అనే భావన ప్రజల్లో రావాలి. మొత్తం ప్రాజెక్టు వివరాలను ఆన్‌లైన్ లో ఉంచాలి’’ అని సీఎం  పేర్కొన్నారు. 

కొన్ని రంగాల్లోనే అభివృద్ధి?
కొన్ని రంగాలు మినహా మిగతా రంగాల్లో ఆశించినంత వృద్ధి రేటు కనిపించడం లేదని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వ్యవసాయ రంగం, అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందని, ఉత్పాదక రంగంలో జీవీఏ పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించారు. వృద్ధి రేటులో పారిశ్రామికాభివృద్ధి చాలా కీలకమని సీఎం పేర్కొన్నారు. కానీ గత మూడేళ్లుగా సేవారంగంలో జీవీఏలో అంతగా వృద్ధి కనిపించడం లేదని చెప్పారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయంతో  పోలిస్తే ఉద్యానరంగంలో నష్టాలు తక్కువని, స్థిరంగా వృద్ధిరేటు సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.  హార్టికల్చర్, అగ్రికల్చర్, ఆక్వా ఈ మూడు రంగాలు సమంగా అభివృద్ధి చెందితే వృద్ధి రేటు బాగుంటుందని చంద్రబాబు చెప్పారు. సంబంధిత విభాగాలతో వర్కుషాపు నిర్వహించుకుని ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని  ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.  రైతులను వీలున్న చోట, వనరులన్న ప్రదేశాల్లో వ్యవసాయరంగం నుంచి ఆక్వా కల్చర్ కు మళ్లించాలని, అప్పుడే రైతులకు రెట్టింపు ఆదాయానికి మార్గం సుగమం అవుతుందని చెప్పారు. ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి,  వ్యవసాయం, అనుంబంధ రంగాలైన ఉద్యానరంగం, ఆక్వా, పాడిపరిశ్రమల అభివృద్ధికి మరింత దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఈ రంగాలపై దృష్టిపెడితే వృద్ధి రేటు 20 శాతం సాధించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పర్యాటకులు అత్యధిక సంఖ్యలో వచ్చేందుకు హోటళ్ల నిర్మాణం జరగాల్సి ఉందన్నారు.

English Title
10 lakhs house with 40,000 crore
Related News