కేంద్రాన్ని మీరన్న అడుగుర్రి సారూ!

Updated By ManamThu, 07/12/2018 - 07:05
allparthy
  • కేంద్ర,రాష్ట్రాలు దాగుడుమూతలాడుతున్నాయి.. విజిలెన్స్ కమిటీలు, సర్వేల పేరుతో కాలయాపన

  • ఉక్కుకంపెనీ వ్యవహారంపై విపక్షనేతల ఆరోపణలు.. పునర్విభజన చట్టంలో ఉందన్న నాయకులు

allparthyహైదరాబాద్: బయ్యారం ఉక్కు పరిశ్రమ 4 కోట్ల తెలం గాణ ప్రజల ఆకాంక్షగా కేంద్రానికి తెలపాలని సీపీఐ ఆధ్వర్యంలోని అఖిలపక్ష బృందం రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్‌ను కోరింది. వేలాది మంది యువతకు ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధిని, రాష్ట్రానికి ఆదాయాన్ని చేకూర్చే పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర గవర్నర్‌గా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని విన్నవిం చింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదం డరామ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తది తరుల బృందం బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బయ్యారం ఉక్కుపై దాగుడుమూత లాడుతున్నాయని ధ్వజమెత్తారు. విభజన స్పష్టంగా పేర్కొన్న పరిశ్రమ ఏర్పాటుపై కమిటీలంటూ కాలయాపనజేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని గవర్నర్‌కు వివరించామని చెప్పారు. ‘బయ్యారం ఉక్కు పరిశ్రమ ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ. దీని కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ నిర్మాణం అంశాన్ని స్పష్టంగా పొందుపర్చారు. పోలవరం ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ముంపునకు గురవుతున్నందున, జిల్లాలో రూ.30 వేల కోట్లతో, ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చట్టంలోని 13వ క్లాజులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆర్నెల్లలో ప్రారంభిస్తామని ప్రకటించారు. నాలుగేండ్లు గడిచిపోయినా టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్ కమిటీలు, సర్వేలంటూ కాలయాప నజేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అవుతుంద’ని గవర్నర్‌కు ఇచ్చిన వినతిలో అఖిలపక్షం పేర్కొంది. ఈ రాష్ట్ర గవర్నర్‌గా ఉక్కు పరిశ్రమ కోసం కృషి చేయాలని నరసింహన్‌కు విన్నవించింది. పర్యావరణానికి, గిరిజనులకు హాని తలపెట్టకుండా పరిశ్రమను ఏర్పాటు చేయాలని టీజేఏఎస్ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ, టి.ప్రజాఫ్రంట్, ఆర్‌ఎస్పీ, సీపీఐ యంఎల్, సీపీఐ న్యూడెమోక్రసీ నేతలు గవర్నర్ కలిసినవారిలో ఉన్నారు.

Tags
English Title
You are the center of the center is Sarah!
Related News