చంద్రబాబును దొంగదెబ్బ తీయాలని బీజేపీ కుట్ర చేస్తోంది

Yanamala Ramakrishnudu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు నిధులు విడుదల అవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి ఏడాది ఆర్థిక లోటుకు గత రెండేళ్లుగా పైసా కూడా ఇవ్వలేదని, పోలవరానికి రూ.3,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా అది కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. వెనుకబడిన జిల్లాల నిధులను కూడా వెనక్కి లాక్కున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబును బీజేపీ దొంగ దెబ్బతీయాలని చూస్తోందని, ఆ పార్టీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో జగన్, పవన్ పాత్రధారులని యనమల ఆరోపించారు. ఈ ఇద్దరి ఇప్పుడు కొత్తగా మజ్లిస్ పార్టీ తోడైందని ఎద్దేవా చేశారు. జగన్ తనకు దోస్త్ అని ఒవైసీ అంటున్నారని, పేదల డబ్బు దోచుకున్న జగన్‌కు, అసద్‌కు ఎలా దోస్తీ కుదురిందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. 

సిద్ధాంతపరంగా బీజేపీకి వ్యతిరేకమైన మజ్లిస్‌, ఆ పార్టీతో అంటకాగే జగన్‌కు ఎలా మద్దతిస్తుందని.. అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ సిద్ధాంతాలను పక్కనపెట్టి బీజేపీని బలపడేలా చేస్తారా అని యనమల ప్రశ్నించారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోవడమే ఇందుకు నిదర్శనమని.. తెలుగుదేశంపై ప్రజల దృష్టి మళ్లించాలనే కుతంత్రం చేస్తున్నారని అన్నారు. వీరి కుట్రలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని.. ఏపీకి న్యాయం జరగాలంటే భాజపా కూటమిని ఓడించాలని యనమల పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు