ప్రచారానికి 15 వేల మందితో మహిళా సైన్యం

Updated By ManamWed, 10/03/2018 - 02:56
Women's army
  • కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ వ్యూహరచన

  • 4 నుంచి నగరంలో ఇంటింటి ప్రచారం

  • టీఆర్‌ఎస్‌కు తడాఖా చూపిస్తాం: సునీతారావు

imageహైదరాబాద్ః రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి 15 వేల మంది మహిళా కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో ఉన్న టీపీసీసీ ఆ దిశలో ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం  మహిళా కాంగ్రెస్‌లో లక్షమంది మహిళలు సభ్యులుగా ఉన్నారని చెబుతున్నారు. వారిలో కనీసం పదోవంతు మహిళలను ఎన్నికల ప్రచారంలోకి దింపాలని టీపీసీసీ ప్రచార కమిటీ యోచిస్తోంది. కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇటీవల సమావేశమై  ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరేళ్ల శారద నేతృత్వంలో గతంలో ఎన్నడూలేని విధంగా పార్టీ  కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు, సీఎం కార్యాలయం ముట్టడి, ఆస్పత్రుల తనిఖీలు, వైద్యశిబిరాలు నిర్వహించడం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. దాదాపు లక్ష మంది మహిళలను సభ్యులుగా చేర్పించారు. వారిలో కాంగ్రెస్‌ను ఎన్నికల్లో గెలిపించాలనే లక్ష్యంతో ఉన్న వారిని ఎంపిక చేసి  ప్రచారంలోకి దింపాలని భట్టి ఆలోచన. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సునీతారావు సారథ్యంలో 50 మంది మహిళలు తమకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించాలని భట్టి విక్రమార్కను కోరగా అందుకు ఆయన అంగీకరించారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా మహిళా నేతలను పరిచయం చేశారు. పార్టీ కోసం ప్రచారం చేస్తామంటే ఎందుకు వద్దంటాము...వెంటనే ఎన్నికల యుద్ధంలోకి రండి...పిలుపునిచ్చారు. టీపీసీసీ చీఫ్ కూడా   గ్రీన్‌సిగ్నల్  ఇచ్చిన విషయాన్ని సునీతారావు తదితరులు మీడియాకు వెల్లడించారు. గాంధీభవన్‌లో సునీతారావుతో పాటు జ్యోతిరెడ్డి, షాహిదాబేగం, కల్పన, మంజులారెడ్డి తదితరులు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సునీతారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఈ నెల 4 నుంచి  హైదరాబాద్ లో ఇంటింటి ప్రచారానికి దిగుతున్నామని, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, టీఆర్‌ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లలో చైతన్యం తీసుకువస్తామని చెప్పారు.

కేసీఆర్ పాలనలో అన్నివర్గాలకు అన్యాయం జరిగిందని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్‌మెంట్,ఇంటికో ఉద్యోగం తదితర హామీలను అపద్ధర్మ సీఎం కేసీఆర్ మరిచారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ గెలిస్తే చేపట్టబోయే కార్యక్రమాలను కూడా వివరిస్తామన్నారు.చీరలు ఇవ్వకున్నా పర్వాలేదు కానీ, నాసీరకం చీరలను పంపిణీ చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు.  టీఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ మహిళా శక్తి తడాఖా చూపిస్తామని సునీతారావు అన్నారు.

English Title
Women's army with 15,000 people for the campaign
Related News