శబరిమల గుడిలోకి ఏ వయసు మహిళలైనా వెళ్లొచ్చు

Updated By ManamThu, 07/19/2018 - 08:36
shabarimala
  • రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు

  • పురుషులతో సమానంగా పూజలు చేయొచ్చు

  • చట్టాల ద్వారా మహిళలను అడ్డుకోజాలరు.. ఏ ప్రాతిదికన మహిళలను అడ్డుకుంటారు?

  • ఆలయ యాజమాన్యానికి సుప్రీం ప్రశ్న.. నేడు కూడా కొనసాగనున్న విచారణ

imageన్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాతిగాంచిన శబరిమల ఆలయంలోకి ఏ వయసు మహిళలైనా వెళ్లవచ్చునని, ఇది రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పురుషలతో సమానంగా ప్రార్థనలు, పూజలు చేసుకోవచ్చునని, వయసు ఆధారంగా మహిళల పట్ల వివక్ష చూపకూడదని తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస ఇందూ మల్హోత్రాలతో కూడిన ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం కీలక తీర్పు వెలువరిం చింది. నెలసరి కారణంగా 10-50 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకూడదని సంప్రదాయం ఉంది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించించింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆలయంలోకి వెళ్లడం.. వెళ్లకపోవడమనేది చట్టాలపై ఆధారపడి ఉండదు.

ఆలయంలోకి వెళ్లడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజ్యాంగంలో అధికరణం 25, 26 ప్రకారం ఈ హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఏ ప్రాతిపదికన మహిళలకు ప్రవేశాన్ని మీరు (ఆలయ అధికారులు) నిరాకరిస్తారు..?  ఆలయాన్ని తెరిచారంటే ఎవరైనా అందులోకి వెళ్లవచ్చు. ఆలయం ప్రజల ఆస్తి. అది ప్రైవేటు వ్యవహారం కాదు’’ అని జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఆలయంలోకి పురుషులతో పాటు మహిళలు కూడా వెళ్లవచ్చునని, పూజా కార్యక్రమాల్లో ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయని అన్నారు. ఏ ప్రాతిపదికన అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తున్నారని ఆలయ అధికారులను ప్రశ్నించారు.

ఆలయంలో పూజించే హక్కు పురుషుడికి ఎంత ఉందో, అ అంతే హక్కు మహిళకు కూడా ఉంటుందని  జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం సరికాదని అన్నారు.అదే సమయంలో కేరళ ప్రభుత్వాల తీరుపైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేపింది.  శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంపై తాము సానుకూలంగానే ఉన్నామని 2015లో అప్పటి కేరళలో వామపక్ష ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే.. 2017లో యూడీఎఫ్ ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. గత ఏడాది వామపక్ష ప్రభుత్వం నవంబరు 7న సుప్రీంకోర్టుకు మరో అఫిడవిట్ సమర్పిస్తూ.. మహిళల ఆలయ ప్రవేశానికి తమ ప్రభుత్వం సుముఖంగానే ఉందని తెలిపారు. ఈ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివిధ సమయాల్లో వివిధ  రకాలుగా మీ వైఖరి ఉందని మండిపడింది. ఈ కేసులో వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్.. మహిళలపట్ల వివక్ష చూపించడం రాజ్యాంగంలోని అధికరణం 17కు విరుద్ధమని పేర్కొన్నారు. ఇది అంటరానితనాన్ని ప్రోత్సహించడమేనని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.

 గత ఏడాది అక్టోబరు 13న ఈ పిటిషన్‌పై విచారణను సర్వోన్నత న్యాయస్ధానం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. ‘‘మహిళలు ప్రవేశిం చకుండా దేవాలయాలు అడ్డుకోగలవా?’’... ‘‘దేవాలయాల్లోకి మహిళలు ప్రవేశి ంచకుండా అడ్డుకుంటే.. వారి రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించినట్టు అవుతుందా లేదా?’’... వంటి పలు ప్రశ్నలను ధర్మాసనం చర్చించనుంది.

English Title
Women of any age can go to the Sabarimala temple
Related News