ఫేక్ న్యూస్‌కు చెక్.. వాట్సాప్ కొత్త ఫీచర్!

Updated By ManamTue, 07/10/2018 - 16:20
WhatsApp offers full page newspaper ads, stop fake news

WhatsApp offers full page newspaper ads, stop fake newsముంబై: ‘మీరు- మేము కలిసి తప్పుడు వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేద్దాం’.. మంగళవారం దేశవ్యాప్తంగా ప్రధాన పత్రికలలో కనిపించిన ఫుల్ పేజీ ప్రకటన ఇది! అసత్య ప్రచారాలు, వదంతుల కారణంగా అమాయకులపై దాడులు జరగడాన్ని ఖండిస్తూ ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ ఈ ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లీష్‌తోపాటు పలు ప్రాంతీయ భాషల పత్రికలలోనూ ఈ ప్రకటన ఇచ్చినట్లు వాట్సాప్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. తప్పుడు వార్తల ప్రచారాన్ని అడ్డుకునే చర్యలు చేపట్టాలంటూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ కంపెనీకి లేఖ రాసిన విషయం తెలిసిందే! అదేవిధంగా ఇప్పటికే ఆ చర్యలు తీసుకున్నామని.. ప్రభుత్వం కూడా కలిసి వస్తే మరింత మెరుగైన చర్యలు చేపట్టవచ్చని ఆ కంపెనీ బదులిచ్చింది. ఈ క్రమంలో వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వాట్సప్ 2.18.204 బీటా వెర్షన్లో ‘అనుమానిత లింక్’ అనే కొత్త ఫీచర్‌ను యాడ్ చేసింది. 

ఈ ఫీచర్‌తో వినియోగదారుడు తనకు వచ్చిన సందేశం ఫార్వార్డ్ చేసిందా.. లేక అవతలి వ్యక్తి స్వయంగా టైప్ చేసిందా అనేది తెలుసుకోవచ్చట! ఒకవేళ లింక్ మెసేజ్ ఉంటే అది వార్నింగ్ కింద లెక్క.. కాబట్టి మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు నిజానిజాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఈ యాప్‌తో పుకార్లకు అడ్డుకట్ట వేయొచ్చని వాట్సాప్ అభిప్రాయపడుతోంది. కాగా, ఫేక్ న్యూస్ విషయంలో వినియోగదారులకు అవగాహన పెంచేందుకు ఇతర ప్రత్యామ్నాయాలనూ పరిశీలిస్తోంది. అందులో భాగంగానే మంగళవారం పత్రికలలో ప్రకటన ఇచ్చినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.

English Title
WhatsApp offers tips to stop fake news on full page newspaper ads
Related News