సంక్షేమమే సర్కారు లక్ష్యం

Updated By ManamThu, 06/14/2018 - 06:45
harish
  • 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం.. బొల్లారంలో రిజర్వాయర్‌కు శంకుస్థాపన

  • రూ.10.44 కోట్ల అభివృద్ధి పనులు.. అక్టోబర్ నాటికి నీటి కొరతకు చెక్

  • జిన్నారంలో మంత్రి హరీశ్ రావు

imageజిన్నారం: రాష్ట్ర చరిత్రలో 24 గంటల విద్యుత్ అందించిన ఘనత టీఆర్‌ఎస్ సర్కారుదేనని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. దీంతో పారిశ్రామికవేత్తలు, రైతులు, ప్రజలకు ఎంతో మేలు కలిగిందని ఆయన వివరించారు. ఈ మేరకు బుధవారం మెదక్ జిల్లా పటాన్ చెరు నియోజక వర్గంలో మంత్రి హరీశ్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి జిన్నారం మండలంలోనూ మంత్రి పర్యటించారు. మండల పరిధిలోని  బొల్లారం గ్రామంలో రూ.18 కోట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా నిర్మించనున్న రిజర్వాయర్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్ పర్సన్ రాజమణి మురళీ యాదవ్‌లతో కలిసి రూ.10.44 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గంలో పలు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తయి, ప్రారంభం కూడా అయ్యాయని చెప్పారు. మరి కొన్నింటికి శంకుస్థాపన చేశామని, అవి కూడా త్వరలోనే నిర్మాణం పూర్తి చేసుకుని, అందుబాటులోకి వస్తాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి చొరవతో అమీన్‌పూర్, రామచంద్రాపురంలో మంచినీటి కొరతను తీర్చేందుకు 51 కోట్ల రూపాయలతో మంచినీటి సరఫరా పనులు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ గ్రామాల పరిధిలో 30 లక్షల లీటర్ల నీరు నిల్వ సామర్థ్యం ఉన్న ట్యాంక్ నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా అమీన్‌పూర్‌లో 12 ఈఎస్‌ఎల్‌ఆర్ ట్యాంకుల నిర్మాణం చేస్తున్నామని, 200 కిలోమీటర్లతో మంచినీటి పైప్‌లైన్లు వేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తామని, దసరా నాటికి పనులు పూర్తిచేసి, అక్టోబరులో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని మంత్రి వెల్లడించారు. అమీన్‌పూర్‌ను మండలం చేశామని, ఇకపై రిజిస్ట్రేషన్ ఇబ్బందులు కూడా తొలగిపోయాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పటాన్‌చెరు నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకర్గంలోని అన్నీ మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. గతంలో అమీన్‌పూర్ మండలంలో భూకబ్జాలు అధికంగా జరిగేవని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత దీనికి అడ్డుకట్ట వేశామని చెప్పారు. అదేవిధంగా, అమీన్‌పూర్‌లో నూతన రహదారులు, లైటింగ్ వ్యవస్థ, కుంటలు, చెరువులను కాపాడేందుకు మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవచూపుతున్నారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరగా ఉన్న అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడి, పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

బీహెచ్‌ఈఎల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్‌ప్రెస్ హైవేను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కొలన్ రవీందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, సర్పంచ్ రోజారాణి, ఉప సర్పంచ్ వేణుపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసి కొలన్ బాల్ రెడ్డి, ఆత్మ కమిటీ ఛైర్మెన్ గడీల కుమార్ గౌడ్, ఏఎంసీ చైర్ పర్సన్ బూరుగడ్డ పుష్ప నాగేష్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్.సపన్నదేవ్, పటాన్‌చెరు నియోజకవర్గ ఇంఛార్జ్ గాలి అనిల్ కుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు ప్రకాశం చారి, మండల అధ్యక్షుడు నవనీత్  రెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, కార్మిక విభాగం రాష్ట్ర నాయకులు వర ప్రసాద్ రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్ రెడ్డి, నాయకులు మెట్టుకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

English Title
Welfare is the goal of the government
Related News