బలహీన సర్కారు

Narendra Modi
  • ప్రతిపక్ష పార్టీలకు కావాల్సింది అదే.. అలా ఉంటే దేశాన్ని దోచుకుంటారు

  • యూరియా స్కాంలు చేసుకుంటారు.. బలమైన ప్రభుత్వం ఉండకూడదట..

  • ఒక్కరిని ఓడించాలనే కలుస్తున్నారు.. కూటమికి సిద్ధాంత ప్రాతిపదిక లేదు

  • అయోధ్య కేసుకు కాంగ్రెస్సే అడ్డం.. అగ్రవర్ణ పేదలకు 10% కోటా మేలు

  • అది దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది.. సీబీఐకి ఆ రాష్ట్రాల్లో నిషేధం ఎందుకు

  • తప్పులు చేశారని భయపడుతున్నారా.. బీజేపీ జాతీయ సదస్సులో మోదీ

న్యూఢిల్లీ: బలహీన ప్రభుత్వం వస్తే దేశాన్ని దోచుకోవచ్చని ప్రతిపక్షం భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ సదస్సును ఉద్దేశించి ఆయన శనివారం మాట్లాడారు. భారత రాజకీయాల్లో ‘మహాకూటమి’ పేరిట ఓ విఫల ప్రయోగం గురించి ఇటీవలి కాలంలో ఓ ప్రచారం జరుగుతోందని, వీళ్లంతా కలిసి ఒక నిస్సహాయ ప్రభుత్వం (మజ్‌బూర్ సర్కార్) ఏర్పడాలని కోరుకుంటున్నారని అన్నారు. వాళ్లకు బలమైన ప్రభుత్వం (మజ్‌బూత్ సర్కార్) అవసరం లేదని, అది వస్తే వాళ్ల స్కాంలు మరోసారి ఆగిపోతాయన్నదే వారి భయమని మోదీ చెప్పారు. రైతులకు వారి పంటలకు సరైన ధర లభించడానికి తాము బలమైన ప్రభుత్వం రావాలనుకుంటున్నామని, కానీ ప్రతిపక్షాలు మాత్రం మళ్లీ యూరియా స్కాం చేయడానికి వీలుగా బలహీన ప్రభుత్వాన్నే కోరుకుంటున్నాయని విమర్శించారు. సాధారణంగా రాజకీయాలంటే సిద్ధాంతాల ప్రాతిపదికగా ఉంటాయని, కూటములు కూడా దూరదృష్టితో ఉంటాయని.. కానీ తొలిసారి అన్ని పార్టీలు కలిసి కేవలం ఒక్క వ్యక్తిని ఓడించడానికి కలుస్తున్నాయని మోదీ అన్నారు. అయోధ్య భూవివాదం పరిష్కారం కాకూడదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన న్యాయవాదుల ద్వారా అయోధ్య కేసుకు అడ్డంకులు కలిగిస్తోందని, ఆరోపణలు చేయడం ద్వారా ప్రధాన న్యాయమూర్తిని సైతం అభిశంసించేందుకు వారు సిద్ధపడుతున్నార ని ఆరోపించారు. ప్రతి విషయంలోనూ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆలోచించే కాంగ్రెస్‌ది ఏం మనస్తత్వమని అన్నారు. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడంపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. ఇది అన్ని సమస్యలకూ పరిష్కారం కాదు గానీ, దేశాన్ని కొత్తదిశలో ముందుకు తీసుకెళ్లగల సామర్ధ్యం మాత్రం దానికి ఉంటుందన్నారు. దీనివల్ల నవభారతానికి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు. పైగా ఈ కొత్త అవకాశం వల్ల ఏ ఒక్కరి హక్కులూ పోవని అన్నారు. రైతుల సమస్య గురించి మాట్లాడుతూ.. ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ రైతులను కేవలం ఓటర్లుగానే చూశాయని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడానికి తాము పగలు, రాత్రి కష్టపడుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో సీబీఐని నిషేధించినందుకు ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రభుత్వాలు ఏ అక్రమాలకు పాల్పడ్డాయని సీబీఐ గురించి భయపడుతున్నాయని ప్రశ్నించారు. ఇప్పుడు వాలుల సీబీఐని వ్యతిరేకిస్తున్నారు.. రేపు మరో సంస్థను వ్యతిరేకిస్తారని..  ఆర్మీ, పోలీసులు, సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, కాగ్.. అన్నీ తప్పేనని, కేవలం వాళ్లు మాత్రమే ఒప్పని ఎద్దేవా చేశారు. తాను మరికొన్ని నెలల్లో జైలుకు వెళ్తానని 2007లో ఒక కాంగ్రెస్ మంత్రి అన్నారని, వాళ్లు చివరకు అమిత్‌షాను జైల్లో కూడా పెట్టారని, కానీ తాము మాత్రం సీబీఐని గుజరాత్‌లోకి రానివ్వకుండా చట్టం ఏమీ చేయలేదని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం తనను 12 ఏళ్ల పాటు వేధించినా ఒక్క రోజు కూడా తాను తమ రాష్ట్రంలోకి సీబీఐ రాకను నిషేధించలేదని గుర్తుచేశారు. సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం దేశం మారగలదని బీజేపీ ప్రభుత్వం రుజువు చేసిందని, ప్రభుత్వం అవినీతి లేకుండా.. అధికార కేంద్రాల్లో మధ్యవర్తులు లేకుండా నడవగలదని కూడా నిరూపించిందని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి తొలి ప్రధానమంత్రి అయి ఉంటే, దేశం ఇప్పుడు మరింత విభిన్నంగా ఉండేదని తెలిపారు. అలాగే, అటల్ బిహారీ వాజ్‌పేయి 2000 సంవత్సరం ఎన్నికల తర్వాత కూడా ప్రధానిగా ఉండి ఉంటే దేశం సరికొత్త ఎత్తులకు ఎదిగేదని మోదీ తెలిపారు. తమకంటే ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం దేశాన్ని అంధకారంలోకి నెట్టేసిందని, యూపీఏ హయాంలో జరిగిన స్కాంలు, అవినీతి వల్ల భారతదేశం పదేళ్లను కోల్పోయిందని అన్నారు. 21వ శతాబ్దంలోని తొలి పదేళ్లు దేశానికి చాలా ముఖ్యమని చెప్పారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదన్నారు. ఇందుకు తాము గర్వపడుతున్నామని చెప్పారు. కేంద్రంలోను, 16 రాష్ట్రాలలోను బీజేపీ, మిత్రపక్షాల ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు కేవలం రెండు గదుల్లో, ఇద్దరే ఇద్దరు ఎంపీలతో నడిచిన పార్టీ.. ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో జాతీయ సదస్సు నిర్వహించుకుంటోదని, ఇది చాలా అద్భుతం, మరువలేనిదని చెప్పారు. కాపలాదారును ఎవరూ ఆపలేరని, అతడు ఏ ఒక్కరినీ వదలిపెట్టడని.. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని అన్నారు. ఇంతకుముందు రుణాలు రెండు రకాలుగా తీసుకునేవారని, వాటిలో ఒకటి కామన్ విధానం కాగా మరొకటి కాంగ్రెస్ విధానమని చెప్పారు. కాంగ్రెస్ విధానంలో బ్యాంకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ల మోసకారి స్నేహితులకు బలవంతంగా రుణాలు ఇవ్వాల్సి వచ్చేదన్నారు. ప్రజానుకూల విధానాలను కాంగ్రెస్ వ్యతిరేకించిందని, దేశాభివృద్ధికి అడ్డంకులు కల్పిస్తోందని అన్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన నాయకులు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించలేరంటూ సోనియా, రాహుల్ మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు