మన నడకే.. మన నడత..!

Updated By ManamWed, 06/27/2018 - 13:04
Walking Describes Your Character and Attitude, What Is Yours?
  • మనమెలాంటోళ్లమో చెప్పేందుకు నడిచే తీరే నిర్వచనం

Walking Describes Your Character and Attitude, What Is Yours?

మీరెలాంటోళ్లు..? మీ వ్యక్తిత్వం ఏమిటి..?.. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ప్రశ్నలే ఇవి. ఎన్నో రకాలుగా మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు. అలాగే మనమెలాంటి వాళ్లమో మన నడక కూడా చెప్పకనే చెబుతుందంటున్నారు అధ్యయనకారులు. మరి, ఈ నడకల ప్రకారం మీరెలాంటి వాళ్లో ఓ సారి చెక్ చేసుకోండి..

  • కొందరు వ్యక్తులు పక్కవాళ్లకు దొరకకుండా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు దూసుకెళ్లిపోతుంటారు. నడకలో వారిని అందుకోవడం కొందరికే అసాధ్యమే. అయితే, అలాంటి వాళ్లే జీవితంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారట. వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పాళ్లు ఎక్కువగా ఉంటాయట. జీవితంలో అన్ని రకాల అనుభవాలను పొందినవారై ఉంటారట. అందరూ తనతోపాటే ఉండాలనుకునే మనస్తత్వమట వీరిది. ఇలాంటివాళ్లది కలుపుగోలు మనస్తత్వమట.
  • కొందరు నడవలేక నడవలేక అడుగులో అడుగేసుకుంటూ నడుస్తుంటారు. ఏం కొంపలంటుకుపోయాయిలే అన్న చందాన చాలా విశ్రాంతంగా నడుస్తుంటారు. అలాంటోళ్లు జీవితంలో ఎక్కువగా విశ్రాంతినే కోరుకుంటారట. చాలా గోముగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేందుకే చూస్తారట. ఇంకోటేంటంటే.. ఇలాంటి వాళ్లకు ప్రమాదాలూ ఎక్కువ జరిగే అవకాశముంటుందట. 
  • మరో రకం.. శబ్దాలు చేసుకుంటూ, టపీటపీమని నేలను తన్నుతూ వేగంగా దూసుకెళ్లిపోయేవాళ్లు.. వాళ్లు ఎక్కువగా కోపిష్టులట. మొహంలో ఎప్పుడూ ఏదో ఒక నిర్లిప్తత ఉంటుందట. అంతేకాదు.. చిన్న పిల్లల చేష్టల్లా ఉంటుందట వారి ప్రవర్తన. 
  • సిగ్గుసిగ్గుగా.. తలదించుకుని అడుగులే వేయరాదన్న రీతిలో నడుస్తుంటారు ఇంకొందరు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం మాట దేవుడెరుగు.. కనీసం నోట్లో నుంచి మాట కూడా మెదపలేరట. అలాంటి వాళ్లు మహా సిగ్గరులట. అలాంటోళ్లు వేగంగా నడిస్తే మంచిదని సూచిస్తున్నారు పరిశోధకులు.

ఈ నాలుగింట్లో మీరు ఎలాంటి వాళ్లో ఓ సారి సరిపోల్చి చూసుకోండి.. ఇక, నడకతో కేవలం వ్యక్తిత్వమే కాదు.. నడిచే తీరు ఆరోగ్యాన్ని కూడా నిర్వచిస్తుందట. వంకరగా నడిచేవాళ్లకు పార్కిన్సన్ వ్యాధి ఉన్నట్టు లెక్కట. ఇక, మోకాళ్లు వంచి..లేపుతూ నడిచేవాళ్లు మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారట. ఇవన్నమాట.. మన నడక చెప్పే సంగతులు.

English Title
Walking Describes Your Character and Attitude, What Is Yours?
Related News