పల్లెకు కదిలిన ఓటరు

voters

హైదరాబాద్: ఓటు హక్కు వినియోగించుకొనేందుకు నగరవాసులు సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో పలు ప్రయాణ ప్రాంగణాలన్నీ ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. వరుస సెలవులు రావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లతో పాటు పలు ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ప్రజలు తమ స్వగ్రామాలకు బయల్దేరి వెళ్తున్నారు. దీంతో ఆయా ప్రాంగణాలు జనంతో కిక్కిరిసిపోయి పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఆర్టీసీ యాజమాన్యం అప్పటికప్పుడు సమావేశమై పరిస్థితి సమీక్షించి కొన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. రోజూ తిరిగే 3500 బస్సులకు అదనంగా మరో 1200 బస్సులు వేసినట్టు ఆర్టీసీ ప్రకటించింది. కానీ ఈ బస్సులు మాత్రం తమకు ఎంతమాత్రం సరిపోవడంలేదని, గంటలపాటు తాము ప్రయాణ ప్రాంగణాల్లో బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సిటీ బస్సులను కూడా కరీంనగర్, వేములవాడ, జగిత్యాల, సిరిసిల్ల బోర్డులు పెట్టి నడుపుతున్నారు. పండుగలు, పరీక్షల సమయంలో ప్రత్యేక బస్సులు వేసే ఆర్టీసీ యాజమాన్యం ఐదేళ్ల కోసారి వచ్చే ఎన్నికల సమయంలో బస్సులు వేయకపోవడంతో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా బస్సు ప్రాంగణాల్లో ఎక్కడ చూసినా యువతే కనబడుతోంది. ఓట్లు వేసేందుకు వారు ఉత్సాహంతో ఊళ్లకు వెళ్తున్నారు.

ఎన్నికలకు లక్ష మంది పోలీసులతో భద్రత
తెలంగాణ ఎన్నికలకు లక్ష మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. 414 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 404 ఎస్‌ఎస్ టీమ్లు.. 3, 385 సంచార బృందాలను నియమించామని చెప్పారు. 279 కేంద్ర కంపెనీలు బలగాలతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మొబైల్ టీమ్లు ఏర్పాటు చేశామని, తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేదని ఆయన పేర్కొన్నారు.మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, 4 వేలకుపైగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని జితేందర్ చెప్పారు.

2,80,64,684 మంది ఓటర్లు..
కాగా తెలంగాణలో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లున్నారు. అందులో మహిళలు 1,39,05,811 మంది కాగా,  పురుషులు 1,41,56,182 మంది వరకు ఉన్నారు. ఎన్నికల బరిలో 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కూటమి - టీఆర్‌ఎస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఏర్పడింది. బీజేపీ, మజ్లీస్, బీఎల్‌ఎఫ్, బీఎస్‌పీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. అత్యధికంగా మల్కాజిగిరిలో 42 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అత్యల్పంగా బాన్స్‌వాడలో ఆరుగురు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల విధుల్లో సుమారు లక్ష మంది పోలీసులు ఉంటున్నారు. పోలింగ్ కోసం 55,329 ఈవీఎంలు, 42,751 వీవీప్యాట్స్, 39,763 కంట్రోల్ యూనిట్లను వినియోగించబోతున్నారు. పెద్ద నియోజక వర్గం శేరిలింగంపల్లిలో 5,75,541 మంది, చిన్న నియోజక వర్గం భద్రాచలంలో 1,37,319 మంది ఓటర్లు ఉన్నారు.

Tags

సంబంధిత వార్తలు