విమానాల కొనుగోలులో విస్తారా

Updated By ManamWed, 07/11/2018 - 16:56
vistara
  • 50 నియో ఎయిర్ బస్సులు,6 డ్రీమ్ లైనర్ విమానాలకు విస్తారా ఆర్డర్

 

vistara

న్యూఢిల్లీ : విమానయాన సంస్థ విస్తారా 3.1 బిలియన్ డాలర్ల (సుమారుగా రూ. 21,344 కోట్ల) విలువైన 19 ఎయిర్‌బస్, బోయింగ్ విమానాలకు ఆర్డర్లు పెట్టినట్లు బుధవారం వెల్లడించింది. విదేశాలకు సర్వీసులతో సహా ఆశావహమైన విస్తరణ పథకాలను సంస్థ చేపట్టింది. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద ఎ320 నియో రకానికి చెందిన 21 విమానాలున్నాయి. అటువంటి విమానాలు మరో 50 సమకూర్చుకోవాలని సంస్థ భావిస్తోంది.

ఎ 320 నియో రకానికి చెందిన 13 విమానాలకు ఎయిర్‌బస్‌కు, 787-9-డ్రీమ్‌ లైనర్ విమానాలు ఆరింటి కోసం బోయింగ్‌కి స్థిరమైన ఆర్డర్లు పెట్టేందుకు అంగీకరించినట్లు విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రచురించిన ధరల జాబితా ఆధారంగా ఈ రెండింటి సంస్థలకు పెట్టిన ఆర్డర్ల విలువ 3.1 బిలియన్ డాలర్ల మేరకు ఉంది. 

ఎయిర్‌బస్‌తో సంతకాలు చేసిన అభిమత లేఖ ప్రకారం 13 ఎ 320 నియో విమానాలు, ఎ 321 నియో విమానాన్ని సంస్థ కొనుగోలు చేయనుంది. ఎ 320 నియో రకానికి చెందిన మరో ఏడు విమానాల కొనుగోలు అవకాశాలను కూడా సంస్థ అట్టేపెట్టుకుంది. లీజింగ్ కంపెనీల నుంచి మరో 37 కొత్త ఎ 320 నియో రకం విమానాలను విస్తారా లీజుకు తీసుకుంటుందని కూడా ఆ ప్రకటన వెల్లడించింది. 

ఎ 320 నియో, ఎ 321 నియో విమానాలకు సిఎఫ్ఎం ఇంటర్నేషనల్‌కు చెందిన లీప్ 1-ఎ ఇంజన్లను విస్తార విమానయాన సంస్థ ఎంపిక చేసుకుంది. ఈ విమానాలు 2019 నుంచి 2023 మధ్యలో సంస్థకు అందనున్నాయి. దేశంలో నెట్‌వర్క్‌ను పటిష్టపరచుకునేందుకు, ఈ ఏడాది మున్ముందు ప్రారంభించబోయే అంతర్జాతీయ సర్వీసులకు ఈ విమానాలను ఉపయోగించుకోనున్నట్లు ఆ ప్రకటన తెలిపింది. కాగా టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలసి సంయుక్త రంగంలో విస్తారా సంస్థను నెలకొల్పాయి. ప్రస్తుతం ఈ సంస్థ 22 గమ్యస్థానాలకు సేవలందిస్తోంది. వారానికి 800లకు పైగా సర్వీసులు నిర్వహిస్తోంది. 

English Title
vistara orders 50 Airbus Neos, 6 Dreamliners
Related News