పల్లేటూర్ 

Updated By ManamThu, 07/12/2018 - 01:23
farmers

villageటూరిజం డిపార్ట్‌మెంట్ మొదలుపెట్టిన రూరల్ టూరిజం కొత్త పుంతలు తొక్కుతోంది.  వెరైటీగా సాగే ప్రాజెక్టుగా ఈ టూర్‌ను రూపొందించడం హైలైట్. సంస్కృతి పేరుతో సాగుతున్న ఈ ప్రాజెక్టు పట్ల ఆకర్షితులైన బెల్జియం టూరిస్టులు మన పల్లె వాతావరణాన్ని ఆద్యంతం ఆస్వాదిస్తుండడం విశేషం.

 

బెల్జియం గెస్టులు
తిరుపతి సమీపంలోని మాధవమాల గ్రామంలో ప్రస్తుతం బెల్జియం నుంచి వచ్చిన ఇద్దరు పర్యాటకులు, లోలా స్నాకర్స్, అలెన్ వాటర్‌మెన్ మన తెలుగుదనాన్ని రుచి చూసి వావ్ అంటున్నారు. వీరితో పాటు హైదరాబాద్‌కు చెందిన మమతా మల్లిపూడి, విశాల్ ఫెర్నాండెజ్, బెంగళూరుకు చెందిన విజయ్ శర్మ మన ‘పల్లెవాసాన్ని’ భలేగా ఉందని ఎగిరి గంతేస్తున్నారు. స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణంలో టెన్షన్ ఫ్రీగా, పల్లె ప్రజల ఆత్మీయత సరికొత్తగా ఉందని సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. కుటుంబ సభ్యుల్లా కోళ్లు, ఆవులు, గేదెలు, మేకలను భావిస్తూ వాటిని ప్రేమగా ఆదరిస్తూ..వాటితో ఆడి పాడుతూ, మరోవైపు పాలు పితుకుతూ, ఇంతలోనే వరినాట్లు వేసేందుకు.. వాన చినుకులను సైతం లెక్కచేయకుండా వరి మడిలో దిగడం.. ఇవన్నీ జీవితకాలపు మధుర స్మృతులుగా మిగిలిపోతాయని సంబరంగా ‘మనం’తో తమ అనుభూతులను దేశ విదేశీ టూరిస్టులు పంచుకున్నారు. బిజీ బిజీ నగర జీవితం నుంచి మంచి బ్రేక్ దొరికిందని..ఇదంత గమ్మతుగా ఉందని.. వీటన్నింటినీ వీడియోలు, ఫొటోల రూపంలో పదిలపరచుకునేందుకు కెమెరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.  చక్కని ఈ టూర్‌పై బ్లాగ్‌ల్లో పుంఖాను పుంఖాలుగా రాసేస్తామంటున్న బెల్జియం టూరిస్టులు నెటిజెన్లను ఆలోచిం పచేస్తామంటున్నారు.  బొమ్మలు చెక్కడం, కలంకారీ అద్దకాల్లో మునిగిపోయిన పరదేశీయులు ఇవి సూపర్‌గా ఉన్నాయంటున్నారు.

మీరూ పల్లెబాట పట్టండి ..
imageతిరుపతి సమూహంలో శ్రీకాళహస్తి, మాధవమాల, వెంకటగిరి గ్రామాలు, అనంతపురంలో లేపాక్షి, నిమ్మలకుంట, వీరాపురం గ్రామాలు, రాజమండ్రి క్లస్టర్‌లో దిండి, నర్సాపూర్, ఉప్పాడ గ్రామాలు ప్రస్తుతం ‘సాంస్కృతిక ప్రాజెక్టు’ కింద ఎంపిక కాగా చిత్తూరు జిల్లాలోనే మరో క్లస్టర్‌ను ఏర్పాటు కానుంది.  గ్రామీణ పర్యాటకాన్ని అంతర్జాతీయ పర్యాటకులకు పరిచయం చేసే క్రమంలో అడుగడుగునా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేందుకు స్వయంగా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, పర్యాటక అధారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్హు శుక్లా రంగంలోకి దిగారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వీరు రూపొందించిన పల్లెబాట ప్రాజెక్ట్ విజయవంతంగా సాగుతోంది. అందుకే రొటీన్ లైఫ్‌తో విసిగిన మీరూ పల్లెబాట పట్టి చూడండి.  స్వహస్తాలతో కుండలు చేయడం, వస్త్రాలు నేయడం, పార-పలుగు చేతపట్టి వ్యవసాయ పనులు చేయడం, వాహనాల రద్దీ రొదకు దూరంగా ఎక్కడికి వెళ్లినా ఎడ్లబండి, ట్రాక్టరు, సైకిల్ వంటి గ్రామాల్లో అందుబాటులో ఉన్న వాహనాల్లోనే ప్రయాణిస్తూ సాగడం, మినరల్ వాటర్ బాటిల్ కాకుండా స్థానికంగా లభించే నీరు తాగుతూ చేసే ఈ ‘రెట్రో లైఫ్ టూర్’లో ఎంత సింప్లిసిటీ ఉందో మీరు స్వయంగా తెలుసుకుంటే పల్లె జీవితం హాయిగా ఉందనడం ఖాయం.  ఆర్గానిక్ తిళ్లు తింటూ, గో బ్యాక్ టు నేచర్ అంటూ ప్రకృతి షరతులకు లోబడి నడిచే జీవితపు మాధుర్యాన్ని ఒక్కరోజైనా గడపి చూడండి.. మన మూలాలు ఎంత గొప్పవో, ఎంత అందమైనవో తెలుసుకునే ఛాన్స్ దొరుకుతుంది.  మహారాష్ట్ర, రాజస్ధాన్, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే రూరల్ టూరిజం లేదా విలేజ్ టూరిజం చాలా పాప్యులర్ కాగా పెద్ద ఎత్తున టూరిస్టులు ఇక్కడికొచ్చి గ్రామీణుల్లో మమేకమవుతున్నారు.  

రెట్రో లైఫ్ 
imageపబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌తో సాగుతున్న ‘పల్లెటూర్’ ప్యాకేజ్‌లో ఎన్నో గ్రామీణ అందాలు, రుచులు దాగున్నాయి.  వీటిని ఎంజాయ్ చేసేందుకు ఫారిన్ టూరిస్టులే కాదు మనవారు కూడా హుషారుగా ఇక్కడికి తరలివస్తున్నారు.  మన మూలాలను స్వహస్తాలతో తాకి, మానసికంగా స్పృశించాలని ఉత్సాహపడుతున్న నేటి తరానికి ఇదో అరుదైన అవకాశం ఇస్తోంది.  ‘‘బీ ఎ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్’’ అన్నట్టు వీరంతా కూడా అచ్చం గ్రామీణుల్లానే ప్రవర్తిస్తూ, వారి దినచర్యనే ఫాలో అయ్యేలా ప్యాకేజీ ఉంటుంది.  మన పూర్వికులు తినే తిండి, చేసిన పనులు చేస్తూ.. వారి టైం టేబుల్‌నే అనుసరించడమే ఇందులో ఉన్న స్పెషాలిటీ. అంటే నో నైట్ షిఫ్ట్.. తెలవారకముందే నిద్ర లేచి, మూగజీవాల బాగోగులు చూసుకుంటూ.. పాడి పంటలతో ఊపిరి సలపలేనంత బిజీ షెడ్యూల్ గడపడం, పొద్దుగూకగానే ఇంత ముద్ద తిని పడకేయడం.. ఇలా సాగే యాత్రలో గ్రామీణుల చేతివృత్తులు, సంప్రదాయ కళలకు కూడా చోటు కల్పించేలా టూర్ డిజైన్ చేశారు.

Tags
English Title
village
Related News