మాల్యా పరారీ వెనుక..!

Updated By ManamFri, 09/14/2018 - 15:58
Did delay by SBI allow Vijay Mallya to leave India in 2016?
  • ముందే ఊహించిన ఎస్‌బీఐ అధికారులు

  • సీనియర్ న్యాయవాది దవేతో సమాలోచన

  • సుప్రీంకు వెళ్లాలని సూచించిన లాయర్

  • అయినా స్పందించని స్టేట్‌బ్యాంక్ వర్గాలు

  • రెండు రోజులకే లండన్ పారిపోయిన మాల్యా

Vijay Mallya escape row: SBI Chairman says not all high-value clients

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉండి భారతీయ అధికారులు, బ్యాంకులను ముప్పు తిప్పలు పెడుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పారిపోవడానికి కారణం ఎవరు? మాల్యా భారతదేశం వదిలి వెళ్లిపోవడానికి దాదాపు నెల రోజుల ముందే... మాల్యా తమకు దాదాపు రూ. 2వేల కోట్లు బాకీ ఉన్నారని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది. డెట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్‌టీ)కి సమర్పించిన డిక్లరేషన్‌లో భాగంగా ఈ విషయం తెలిపింది. ఆ ట్రైబ్యునల్ అప్పటికి మాల్యా, ఆయన కంపెనీలు చెల్లించాల్సిన బాకీల విషయం చూస్తోంది.

ఎస్‌బీఐ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం 2014 జనవరి 31 నాటికి ఉన్న బాకీలను ఆ నివేదికలో తెలిపాయి. వాటిలో ఒక్క ఎస్‌బీఐకే మాల్యా దాదాపు రూ. 2,043 కోట్లు కట్టాల్సి ఉంది. అన్ని బ్యాంకులకు కలిపి రూ. 6,963 కోట్లు బాకీ ఉన్నారు. కొన్ని వారాల తర్వాత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ఫిబ్రవరి 28న ఎస్‌బీఐ సీనియర్ అధికారులను కలిశారు. మాల్యా దేశం వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆ సమావేశంలో బ్యాంకు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. 

అప్పుడు వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి, మాల్యా దేశం వదిలి వెళ్లకుండా ఉత్తర్వులు పొందాలని దవే వారికి సూచించారు. దానికి నాటి ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య కూడా సరేనన్నారు. మర్నాడు సోమవారం కావడంతో వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని దవే సూచించారు. ఆరోజు ఆయన కోర్టుకు వెళ్లినా, ఎస్‌బీఐ అధికారులు మాత్రం ఎవరూ అక్కడకు రాలేదు. అలాగే, మాల్యా దేశం విడిచి వెళ్లకుండా ఆదేశించాలన్న పిటిషన్ కూడా దాఖలు కాలేదు. సరిగ్గా రెండు రోజుల తర్వాత.. అంటే మార్చి 2న విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లిపోయారు. 

అంతటి సీనియర్ న్యాయవాది చెప్పిన తర్వాత, పైగా స్వయంగా బ్యాంకు ఉన్నతాధికారులకే అనుమానం వచ్చిన తర్వాత కూడా వాళ్లు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియలేదు. అప్పుడే కోర్టుకు వెళ్లి ఉంటే, మాల్యా పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని.. ఆయన దేశం విడిచి వెళ్లకుండా చూడగలిగే అవకాశం ఉండేది. అయితే, తమవైపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని ఎస్‌బీఐ వర్గాలు అంటున్నాయి. బాకీ ఉన్న మొత్తాలను రికవరీ చేసుకోడానికి బ్యాంకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపాయి. 

English Title
Vijay Mallya escape: SBI Chairman says not all high-value clients




Related News