నోటా రివ్యూ

Updated By ManamFri, 10/05/2018 - 13:51
Nota movie review
Vijay Devarakonda NOTA Movie review

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, ఇటీవ‌ల గీత గోవిందం... మూడు భారీ హిట్లు అందుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అదీ సినిమాల్లో ప్ర‌య‌త్నించి, ప్ర‌య‌త్నించి విసిగిపోయిన ఓ అబ్బాయి.. ఇక రైటింగో, డైర‌క్ష‌నో చేద్దామ‌నుకున్న ఓ అబ్బాయి వ‌రుస హిట్ల‌తో ఓ రౌడీ అనే బ్రాండ్ ఇమేజ్‌తో ముందుకు సాగ‌డం మామూలు అంశం కాదు. ఆ విజ‌యం ఇచ్చిన భ‌రోసాతోనే ఆయ‌న కింగ్ ఆఫ్ ది హిట్ అని ఓ బ్యాన‌ర్ పెట్టారు. తొలి సినిమాగా త‌న బ్యాన‌ర్‌పై `నోటా`ను విడుద‌ల చేశారు. ఈ సినిమా ఎలా ఉంది?  విజ‌య్ విజ‌యాల‌ను కొన‌సాగిస్తుందా?  లేదా?  జ‌స్ట్ హావ్ ఎ లుక్‌..

బ్యాన‌ర్‌:  కింగ్ ఆఫ్ ది హిల్ 
స‌మ‌ర్ప‌ణ‌:  కె.ఇ. జ్ఞాన‌వేల్ రాజా (స్టూడియో గ్రీన్‌)
ద‌ర్శ‌క‌త్వం: ఆనంద్ శంక‌ర్‌
న‌టీన‌టులు:  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ‌రీన్‌, నాజ‌ర్‌, స‌త్యరాజ్ తదిత‌రులు
మాట‌లు:  రాజేష్‌.ఎ.మూర్తి
సంగీతం:  శ్యామ్ సి.య‌స్‌.

క‌థ‌

Vijay Devarakonda NOTA Movie review

తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రి వాసుదేవ‌రావ్ (నాజ‌ర్‌) త‌న‌యుడు వ‌రుణ్‌(విజ‌య్ దేవ‌ర‌కొండ‌). ఓ స్వామీజీ స‌ల‌హా మేర‌కు త‌ను కుర్చీ నుంచి దిగిపోయి, త‌న ర‌క్తం పంచుకుని పుట్టిన బిడ్డ‌ను రెండు వారాల పాటు సీఎంగా ఉంచాల‌నుకుంటాడు వాసుదేవ్‌. ఆ ప‌థ‌కంలో భాగంగానే ఓ పుట్టిన‌రోజునాడు త‌న కుమారుడిని సీఎం కుర్చీలో కూర్చోబెడ‌తాడు. అయితే దాన్ని తాత్కాలికంగా భావించిన వ‌రుణ్ అంత సీరియ‌స్‌గా తీసుకోడు.

కానీ వాసుదేవ‌రావు జైలు నుంచి వ‌స్తుండ‌గా జ‌రిగిన ప్ర‌మాదంలో కోమాలోకి వెళ్ల‌డంతో అనుకోకుండా వ‌రుణ్ బాధ్య‌త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సంద‌ర్బంలో అత‌నికి మ‌హేంద్ర(స‌త్య‌రాజ్‌) సాయ‌ప‌డ‌తాడు. ఇంత‌కీ మ‌హేంద్ర ఎవ‌రు? వ‌రుణ్‌కి ఎందుకు సాయ‌ప‌డ్డాడు? ప‌్ర‌తిప‌క్ష నేత కుమార్తె క‌ళా ఏ విధంగా వ‌రుణ్‌కి సాయ‌ప‌డింది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు. 

స‌మీక్ష‌
త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌కు అద్దం ప‌ట్టే సినిమా ఇది. త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత‌కున్న న‌మ్మ‌కాలు, ఆమె కోమాలోకి వెళ్లిన త‌ర్వాత జ‌రిగిన ప‌ర్య‌వ‌సానాలు వీట‌న్నిటిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న క‌థ‌. త‌మిళంలో ఇప్ప‌టికీ న‌వ‌ల రూపంలో వ‌చ్చిన అంశం. దాన్ని స్క్రీన్‌కి త‌గ్గ‌ట్టు మ‌ల‌చుకున్నారు. అయితే ఏ సీన్ కూడా ఇందులో కొత్త‌గా లేదు. నిత్యం టీవీల్లో చూస్తున్న ప‌లు అంశాల‌ను క్రోడీక‌రించి, ఎడిట్ చేసి తెర‌మీద రెండున్న‌ర గంట‌ల పాటు చూపించిన‌ట్టు అనిపించింది. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను మిన‌హాయిస్తే మ‌న‌కు క‌నెక్ట్ అయ్యే ఎమోష‌న్ ఒక్క‌టే. దుండ‌గుల అక్ర‌మాల వ‌ల్ల కాలిపోయిన ఓ బ‌స్సులో ఓ స్కూలు పాప చ‌నిపోవ‌డం... ఆ పాప త‌ల్లిగా చేసిన మ‌హిళ న‌ట‌న‌ను మెచ్చుకోవాలి. హృద‌యాల‌ను క‌ల‌వ‌ర‌పెట్టే విధంగా న‌టించింది.

వ‌రుణ్ ఫ్రెండ్ వార్న్ (ప్రియ‌ద‌ర్శి) న‌టించాడు. ఆ పాత్ర‌కైతే అస‌లు లాజిక్కే ఉండ‌దు. జ‌స్ట్ ఏవో కొన్ని కోడ్స్ ఉప‌యోగించి, ఎక్క‌డో ప‌నామాలో ఉన్న అంత‌ర్జాతీయ అకౌంట్ల‌ను హ్యాక్ చేయ‌డం, వాళ్ల ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బులను త‌మ ఖాతాల్లో జ‌మ‌చేసుకోవ‌డం.. వీట‌న్నిటినీ చాలా సింపుల్‌గా చూపించేస్తారు. కానీ అది అంత తేలికైన విష‌యం కాద‌న్న లాజిక్ ఉండ‌దు. స‌న్నివేశాల ప‌రంగానూ ఎక్క‌డా కొత్త‌ద‌నం లేదు. పాట‌ల్లో ఒక్క ప‌దం కూడా అర్థం కాదు. అస‌లు అవి తెలుగు పాట‌లా.. తెలుగులోనే ఉన్నాయా? అనే అనుమానం కూడా క‌లుగుతుంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం ఈ సినిమాకు ఆశాదీప‌మే. ఆయ‌న కోస‌మే సినిమా ఆడాలి. ఆయ‌న కోస‌మే సినిమాను చూడాలి. అంతే త‌ప్ప ఇందులో చూడాలి.. అనిపించే అంశాలు ఏమీ ఉండ‌వు. మెహ‌రీన్ ఎందుకుందో అర్థం కాదు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి కుమార్తెగా చేసిన క‌ళా పాత్రే మెహ‌రీన్ క‌న్నా ఎక్కువ‌గా ఉంది. నేప‌థ్య సంగీతం బావుంది. కానీ స‌న్నివేశాల్లో లేని ఎమోష‌న్‌ని ఎంత ప్ర‌య‌త్నిస్తే మాత్రం సంగీత ద‌ర్శ‌కుడు పండించ‌గ‌ల‌డు? స్వామీజీ క‌థ‌కు ఎక్క‌డో ఓ ముగింపు ఉండాలి కాబ‌ట్టి ఏదో చేసిన‌ట్టు అనిపిస్తుంది. క‌థ‌ను స‌రిగా రాసుకున్న‌ట్టు అనిపించ‌వు.

సినిమా కూడా అనువాద చిత్ర‌మ‌నిపిస్తుంది. చాలా చోట్ల లిప్ సింక్ లేదు. చాలా వ‌ర‌కు తెలుగు బోర్డుల‌ను పెట్టి మేనేజ్ చేసిన వారు, ఓ చోట సీఎం ఆఫీస్‌లో త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌మెంట్ అనే ఆంగ్ల అక్ష‌రాల‌ను వ‌దిలేయ‌డం హాస్యాస్ప‌దం. కొన్ని పాత్ర‌ల‌కు డ‌బ్బింగ్ చెప్పిన తీరు కూడా క్వాలిటీగా లేదు. ఆనోటా, ఈనోటా ఎవ‌రైనా చెప్పుకుంటే సినిమా హిట్ కావాలి. కానీ ఈ సినిమా విష‌యంలో ఏ నోటా విజ‌యం.. అనే మాట రావ‌డం లేదు. గ‌తంలో వ‌చ్చిన `లీడ‌ర్‌`, `భ‌ర‌త్ అనే నేను` సినిమాల‌కు భిన్నంగా ఏమీ పెద్ద‌గా లేద‌నే మాటే అంద‌రి నోటా వినిపిస్తోంది.

రేటింగ్‌: 2.25/5

బాట‌మ్ లైన్‌:  విజ‌య్ ఫ్యాన్స్ నోట మాత్ర‌మే `నోటా`

English Title
Vijay Devarakonda NOTA Movie review
Related News