సార్వజనీన విద్య ఓ హక్కు

Updated By ManamTue, 05/15/2018 - 00:40
image

imageవిభిన్న కులాలు, ప్రజలు, సంఘాలు, భాషలు, మతాలు, సంస్కృతులతో భారతదేశం వైవిధ్యభరితంగా ఉంది. ఈ ప్రజ లకు పూర్తిస్థాయిలో రాజకీయ స్వాతంత్య్రం అనుభవిస్తున్నప్ప టికీ, అనేకమంది ప్రజలు నిరక్షరాస్యులుగా, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. విభిన్నవర్గాల ఉద్ధరణ, పురోగతికి ఏకైక అత్యంత శక్తిమంతమైన సాధనం విద్య అని టీఎంఏ పాయ్ ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక (2002) కేసులో సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. విద్య సార్వజనీయమైంది. తమకు నచ్చిన అంశంలో విద్యను పొందేందుకు ప్రతి వ్యక్తీ అర్హుడే. కానీ, గత కొంతకాలంగా విద్యను ప్రైవేటు వస్తువుగా మార్చే సేందుకు ప్రైవేటు విద్యాసంస్థలు తాపత్రాయ పడుతున్నాయి. ఈ తాపత్రాయంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు ప్రశ్నార్థ కంగా మారుతోంది. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాలయాలు, ఫీజుల ముసుగులో విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. నియంత్రణ లేకుండా ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులను పెంచేసి, ఆ మొత్తాన్ని చెల్లించాలని విద్యార్థుల నుంచి బలవంతం చేయడం ఇటీవల కొన్ని సందర్భాల్లో వెలుగు చూస్తున్నాయి. దేశంలో ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో ఈ విధమైన పరిస్థితులు చోటు చేసుకోవడం హర్షణీయం కాదు. ఇటీవల దేశంలో పలు విద్యాసంస్థలు అశాస్త్రీయంగా ఫీజులను పెంచడం, వాటిని విద్యార్థులపై రుద్దడం వంటి సంఘటలను జరు తున్నాయి. ఈ పరిణామాలతో కలత చెందిన విద్యార్థులు ఉద్య మబాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలం గా స్తబ్దుగా ఉన్న విద్యార్థి ఉద్యమాలు మళ్లీ రోడ్డుబాట పట్టా యనే చెప్పొచు.
దేశంలో 47 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 367 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 123 స్వయం ప్రతిప్రత్తి (డీమ్డ్) యూని వర్శిటీలు, 282 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 138 జాతీయ ముఖ్య విద్యాసంస్థలు ఉన్నాయి. ఇందులో కేంద్రీయ, రాష్ట్ర, 21 డీమ్డ్ యూనివర్శిటీలు, 138 జాతీయ ముఖ్య విద్యాసంస్థలకు   కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది. ఈ నిధులను యూజీసీ ద్వారా ఆయా విద్యాసంస్థలకు అందజేయడం జరు గుతుంది. కొన్ని డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు నిధులను తగ్గించి ఇవ్వడం వల్ల ఆయా సంస్థలు ఈ భారాన్ని విద్యార్థులపై వేయా ల్సిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు లేకపోలేదు. 

యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ)కి 2016-17 సంత్సరానికిగాను ప్లాన్ గ్రాంట్ కింద రూ.3,975 కోట్లను కేం ద్ర ప్రభుత్వం కేటాయించింది, నాన్ ప్లాన్  గ్రాంట్ కింద మరో రూ.6,927.87 కోట్లను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం కేటా యించిన నిధులలో దాదాపుగా 50 శాతం కేంద్రీయ విశ్వవి ద్యాలయాలకు అందజేస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ నిధు లలో కూడా భారీగా కొత విధింపు జరిగిందనే వాదనలు లేకపోలేదు. ప్లాన్ గ్రాంట్ కింద ఇచ్చే నిధులలో 50.32 శాతం కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు, 13.13 శాతం రాష్ట్ర విశ్వవిద్యా లయాలకు, 2.21 శాతం డీమ్డ్ యూనివర్శిటీలకు కేటాయిం చారు. మిగిలిన నిధులను ఇతర విద్యాలయాలకు అంద జేస్తు న్నారు. నాన్ ప్లాన్ గ్రాంట్ కింద 63.22 శాతం నిధులు కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కేటాయించగా, రాష్ట్రస్థాయి యూనివర్శిటీలకు 3.03 శాతం నిధులు, డీమ్డ్ యూనివర్శిటీ లకు 4.52 నిధులను కేటాయించారు. వీటిలో సింహభాగం కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు దక్కుతున్నాయి. 

దేశంలో ఉన్న 123 డీమ్డ్ యూనివర్శిటీల్లో నిధులను కేటా యించేందుకు 21 సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఉన్నాయి. ఈ జాబితాలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనెస్స్, బిట్స్, గాంధీగ్రాం రూరల్ ఇనిస్టిట్యూట్, సత్యసాయి ఇనిస్టిట్యూట్, తిలక్ మహావిశ్వవిద్యాలయం తదితర యూని వర్శిటీలు ఉన్నాయి. అయితే, గత కొంతకాలంగా నిధులను పూర్తిస్థాయిలో ఈ సంస్థలు పొందలేకపోతున్నాయి. డీమ్డ్ యూనివర్శిటీలకు నిధులు ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవడం గమనార్హం. 2016-17 ఆర్థిక సంవ త్సరానికిగాను డీమ్డ్ యూనివర్శిటీల జాబితాలోని 18 విద్యా సంస్థలకు రూ.5,567.52 లక్షల నిధులు, మరో పది విద్యా లయాలకు రూ.31,284 లక్షల నిధులు కేటాయించారు. 

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాల ల్లో 2016-17 సంవత్సరానికిగాను 2,94,27,158 మంది విద్యా ర్థులు ప్రవేశం పొందారు. ఇందులో 1,41,56,470 మంది బాలి కలు కూడా ఉన్నారు. అత్యధికంగా ఆర్ట్స్ విభాగంలో 1,03,43, 541మంది విద్యార్థులు, సైన్స్ విభాగంలో 49,66,190 మంది విద్యార్థులు, ఇంజనీరింగ్ విభాగంలో 47,81,913మంది విద్యా ర్థులు ప్రవేశం పొందారు. వీరికి విద్యాబోధనలకుగాను ఆయా విద్యాలయాల్లో 1,10,879మంది ప్రొఫెసర్లు, 1,59,912 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ ఫ్యాకల్టీ 38,901 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా 9,49,925మంది, ఇన్‌స్ట్రక్టర్లుగా 48,251 మంది విధులు నిర్వహిస్తున్నట్లు యూజీసీ 2016-17 రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా 72.63 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులు నిర్వహిస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు మంజూరు కాకపోవడంతో పలు డీమ్డ్ విశ్వవిద్యాయాలు విద్యార్థులపై పెనుభారం మోపుతున్నాయి. ఫీజులను కూడా 15 నుంచి 20 శాతం వరకు పెంచాయని ఈ మధ్య విద్యార్థులు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. విద్యాలయాలు క్వాలిటీ పేరుతో ఫీజు లను ఇష్టానుసారంగా పెంచడం ఎంతవరకు సబబు అని విద్యా ర్థులు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. విద్యను అంగడి వస్తువు గా మర్చడం వల్ల దేశానికే నష్టం వాటిల్లుతుందని, ఈ పరిస్థితి వల్ల సమాజంలో మరిన్ని అసమానతలు ఏర్పడవచ్చని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

విద్యను మార్కెట్ వస్తువుగా మార్చి, తమకు నచ్చిన రీతిలో వాటిని విక్రయించేందుకు ప్రైవేటు విద్యాసంస్థలు ప్రయ త్నాలు చేస్తున్నాయి. దీంతో ఉన్నత వర్గాలకు మాత్రమే ఈ విద్య పరిపూర్ణంగా అందే అవకాశాలు ఉన్నాయి. భారీ మొత్తం లో ఫీజుల చెల్లించలేని వారికి సాంకేతిక, ఇతర అనుబంధ విద్యలకు దూరమైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, కేరళ ఎడ్యుకేషన్ బిల్ (1970) కేసులో ‘విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు కావని, అవి సంపదను ఉత్పత్తి చేయవని’ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినా ఇప్పటికీ ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజల పేరుతో విద్యార్థులను పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో పరీక్షలకు హాజరయ్యేందుకు కూడా అనుమతులు ఇవ్వడం లేదనే విమర్శలు కూడా లేకపోలేదు. 

విద్యను పొందేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని, ఈ హక్కులను ఎవరూ కాదనలేరని ఉన్నికృష్ణణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (1993) కేసులో సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం ద్వారా విద్య ప్రాథమిక హక్కుగా మారి, భారత రాజ్యాంగంలోని 21ఏ ఆర్టికల్‌గా 2009 నుంచి దేశవ్యా ప్తంగా అమలులోకి వచ్చింది. ఈ ఆర్టికల్ ద్వారా విద్యను పొం దేందుకు 6నుంచి 14 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికీ హక్కు ఏర్పడింది.  

ప్రైవేటు విద్యాలయాల్లో, మరి ముఖ్యంగా డీమ్డ్ విశ్వ విద్యాలయాల్లో ఫీజుల నియంత్రణలకు ఒక ప్రత్యేక మానిట రింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత యూజీసీ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖపై ఉంది. ఈ కమిటీలో విద్యా వేత్తలు, యూజీసీ ప్రతినిధి, ఆయా యూనివర్శిటీ పాలకవర్గ సభ్యులు, విద్యార్థులను నియమిస్తే  బావుంటుంది. ఈ కమిటీ శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి ఫీజుల పెంపునకు సిఫార్సు చేస్తే, అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుంది. ఫీజుల పెంపు వల్ల విద్యాలయాలు రణరంగాలుగా మారక ముందే ప్ర భుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటే,  యాజమాన్యాలకు, విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండొచ్చు.  

విద్యను వ్యాపర సామగ్రిగా చూడడం ప్రైవేటు విద్యా సంస్థలు మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బహుళ ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని విద్యను అన్నివర్గాలకు అం దించాల్సిన ఉంది. దేశంలో ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రాధాన్యతల ఆశించిన స్థాయిలో లేవని ఇటీవల విడు దలయిన ప్రభుత్వ నివేదికల బట్టి తెలుస్తోంది. అన్ని వర్గాలకు అవరోధాలు లేని ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- దాసరి రవికుమార్, చల్లూరి బాబు, 
పీహెచ్‌డీ స్కాలర్స్, 
టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనెస్స్, తుల్జాపూర్

English Title
Universal education is a right
Related News