ఏకగ్రీవాల జోరు

panchayat
  • ప్రోత్సాహక నిధుల కోసం ప్రజల యత్నం

  • గట్టి అభ్యర్థులున్న చోట పోటీకి సై...

  • 2,000 గ్రామాల్లో ఏకగ్రీవాలకు టీఆర్‌ఎస్ కృషి

హైదరాబాద్: ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకం, ప్రజా చైతన్యం కారణంగా గ్రామ పంచాయతీ లను ఏకగ్రీవం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ఏకగ్రీవం కావడంతో పాటు మరి కొన్ని గ్రామాల్లో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసి లక్షలు ఖర్చు చేయడం ఎందుకనే ఆలోచనలో గ్రామాల్లో అత్య దికులు ఏకగ్రీవాలకు మొగ్గుచూపుతున్నారు. సర్పంచ్‌గా పోటీ చేయాల నుకునే వ్యక్తులు గ్రామాభివృద్ధికి ఆర్ధిక తోడ్పాటు ఇచ్చే విధంగా రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్ని కల సందర్భంగా గ్రామాలన్ని కళకళలాడుతున్నాయి. జీవనోపాధి కోసం ఎక్కడికో వెళ్లిన వారంతా చేరుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో ఆర్ధికంగా స్ధిరపడిన వర్గాలు కూడా జన్మభూమి రుణం తీర్చుకుంటామంటూ లక్షల వ్యయం లెక్కచేయకుండా పంచాయతీ ఎన్నికలకు సిద్దపడుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడేందుకు తహతహలాడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు  లక్షల వ్యయంతో కూడుకున్నవని భావించిన గ్రామాల్లోని చైతన్య వంతమైన యువత మాత్రం పెద్దగా ఆసక్తి కనబర్చలేక పోతున్నారు. గ్రామంలోనే ఉండి అందరి మన్ననలు అందుకుంటున్న వారు కూడా లక్షల వ్యయం చేసి  ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదని చేతులెత్తేస్తున్నారు. ఎంత ప్రజాభిమానం ఉన్నా చివరికి డబ్బే ప్రధానం అని తేలడంతో ఈ ఎన్నికల్లో లక్షలు వ్యం చేసేవారే పోటీ పడే పరిస్ధితులు గ్రామాల్లో నెలకొన్నాయి. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం రూ. 10 లక్షల ప్రోత్సాహకం ఇస్తుంది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్‌ను స్పూర్తిగా తీసుకొని కొంత మంది యువ ఎమ్మెల్యేలు నియోజక వర్గం నిధి నుండి ఏక గ్రీవ గ్రామ పంచాయతీలకు రూ. 10 నుండి రూ. 15 లక్షల వరకు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. మరి కొన్ని గ్రామాల్లో  సర్పంచ్‌గా పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నవారు కూడా ఏక గ్రీవంగా ఎన్నుకున్న పక్షంలో గ్రామాభివృద్ధికి రూ. 25 లక్షల వరకు ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఈ విధంగా రాజకీయంగా గట్టి అభ్యర్ధులు ఉన్న గ్రామాల్లో మినహా ఇతర గ్రామాల్లో అత్యధికులైన ప్రజలు ఏకగ్రీవాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తొలి విడత ఎన్నికలు జరగాల్సిన గ్రామాల్లో కొన్ని ఏకగ్రీవాలు జరిగాయి. బుధవారం మరికొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు జరిగాయి. తొలి విడత ఎన్నికలు జరుగనున్న జనరల్ కేటగిరి గ్రామాల్లో డబ్బున్నవారిదే హవా అన్నట్లుగా రాజకీయాలు జోరందుకుంటున్నాయి. మొదటి విడత 4,480 గ్రామాలకు ఈ నెల 21న  ఎన్నికలు జరగనున్నాయి. కనీసం 2 వేల గ్రామాలను ఏకగ్రీం చేయాలనే ఆలోచనతో అధికార టీఆర్‌ఎస్ చర్యలు చేపట్టింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇప్పటికే రంగంలోకి దిగారు. గ్రామాల్లో పర్యటిస్తున్నారు. టీఆర్‌ఎస్ బలంగా ఉన్న గ్రామాల్లో ఏకగ్రీవాలకు  ప్రోత్సహిస్తున్నారు. గ్రామాభివృద్దికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఇరు వర్గాలను సంతృప్తి పరిచే విధంగా లోపాయికారి వ్యవహరాలకు తెరలేపుతున్నారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు అధికారం కావాలనే పార్టీ ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా నాగ్వారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా లక్ష్మిని ఎన్నుకొనేందుకు  గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.  సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే మూడు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇబ్రహీంపూర్, జే పీ తండా, కంగుల్ గ్రామాలలో పంచాయతీ ఎన్నికను ఏకగ్రీవం చేసుకున్నారు. జనగామ జిల్లాలోని మరియాపురం, నర్సాపూర్, అబ్దుల్ నాగారం గ్రామ సర్పంచులను ఏకగ్రీవ చేసుకొనేందుకు అంగీకారానికి వచ్చారు. దుబ్బాకలోని వెంకటగిరి తండా, మిరదొడ్డి మండలం బేగంపేట గ్రామ సర్పంచ్‌ను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యాదాద్రి జిల్లా లప్పనాయక్ తండా ఏకగ్రీవమైంది. వనపర్తి జిల్లాలోని  10గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 10 లక్షల చొప్పున అభివృద్ది నిధి ఇవ్వడానికి స్ధానిక ఎమ్మెలే నిరంజన్‌రెడ్డి ముందుకొచ్చారు. కర్నెతండా, ఈర్లతండా, అల్లమయ్యపల్లి. సూరాయిపల్లి, అంతాయపల్లి, కోతులకుంట తండా, ఆముదం బండ తండా, మల్కిమియాన్ పల్లి, సల్కలాపూర్ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.  మరి కొన్ని జిల్లాల్లో కూడా ఏకగ్రీవాలు జరుగుతున్నాయి.  రాష్ట్ర స్ధాయిలో  రాజకీయంగా ప్రతిపక్షానికి స్ధానం లేకుండా చేసిన టీఆర్‌ఎస్  అధినాయకత్వం గ్రామాల్లో కూడా ప్రతిపక్షాలకు స్ధానం లేకుండా చేయాలనే ఆలోచనతో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంది.

సంబంధిత వార్తలు