ట్విటర్ ఫాలోయర్లు ఢమాల్!

Updated By ManamThu, 07/12/2018 - 23:47
twitter
  • ఉన్నట్టుండి తగ్గిపోతున్న అభిమానులు

  • ఫేక్ అకౌంట్ల తొలగింపే ప్రధాన కారణం.. నకిలీలను ఏరి పారేస్తున్నామని ప్రకటన

twitterన్యూఢిల్లీ: మీ ట్విటర్ ఫాలోయర్లు ఉన్నట్టుండి తగ్గుతున్నారా..? అయినా కంగారు పడకండి. ట్విటర్ వాళ్లే నెమ్మదిగా ఫేక్ అకౌంట్లన్నింటినీ తొలగిస్తున్నారు. యూజర్లందరికీ అర్ధవంతమైన, సరైన ఫాలోవర్లు మాత్రమే ఉండాలి తప్ప ఫేక్ ఫాలోవర్లు ఉండకూడదన్న ఉద్దేశంతో ఇలా చేస్తోంది. దీంతో ఇక తమకు ఇన్ని మిలియన్ల మంది ఉన్నారు, అన్ని మిలియన్ల మంది ఉన్నారని గొప్పలు చెప్పుకునేవాళ్ల జాతకాలన్నీ నెమ్మదిగా బయటపడతాయి. ‘లాక్డ్ అకౌంట్ల’ను క్రమంగా ఏరిపారేయడం వల్ల చాలామంది ప్రొఫైళ్లలో ఫాలోయర్ల సంఖ్య తగ్గుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ తమ రాజకీయ, వ్యాపార, వినోద కార్యకలాపాలను అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా ట్విటర్ ఫేక్ ఫాలోయుర్లను కొనుగోలు చేసేవాళ్ల ఆట ఇక కట్టినట్లవుతుంది. ట్విటర్‌ను మరింత మెరుగుపరిచి, తమ ఫాలోవర్లపై అందరికీ నమ్మకం కలిగించేందుకు ఇలా మరో ముందడుగు వేస్తున్నట్లు ట్విటర్ ఒక ప్రకటనలో తెలిపింది. తన ప్లాట్‌ఫాం ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించడం లాంటి వాటిని అరికట్టేందుకు ఇటీవలి కాలంలో ట్విటర్ చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. దాంతోపాటు మిలియన్ల కొద్దీ ఫేక్ అకౌంట్లను వరుసపెట్టి తొలగిస్తోంది. గత కొన్నేళ్లుగా తాము ఖాతా ప్రవర్తన తీరులో ఉన్నట్టుండి వచ్చే మార్పులను గమనించి, ఖాతాలను లాక్‌చేస్తున్నామని తెలిపింది. అలా లాక్‌చేయడం వల్ల పాస్‌వర్డ్ రీసెట్ చేయాలి, అందుకు వాళ్ల వివరాలు కూడా సరిగా ఉండాలి. అవి లేకపోతే ఇక లాగిన్ అవ్వలేరు. అలా లాక్‌చేసి కొంతకాలమైన అకౌంట్లను వరుసపెట్టి తొలగిస్తోంది. అందుకే చాలామందికి ఫాలోయర్ల సంఖ్య తగ్గుతోంది. 

Tags
English Title
Twitter followers dummal!
Related News