టీటీడీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్ వద్దు

Updated By ManamSat, 08/04/2018 - 23:40
tdp
  • గిరిజన కార్పొరేషన్, గిరిజన ఉత్పత్తులకు కూడా

  • ఎంఎస్‌ఎంఈల రాయితీలను కేంద్రమే భరించాలి

  • సినిమా టికెట్లు, సిమెంట్‌పై పన్ను తగ్గించండి

  • జీఎస్టీ కౌన్సిల్‌కు మంత్రి యనమల సూచనలు

imageన్యూఢిల్లీ: మధ్య, చిన్న, మైక్రో తరహా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని రాష్ట్ర మంత్రి ఆర్థిక మంత్రి యనమల స్వాగతించారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శనివారం జరిగిన 29వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రాయితీలు ఇవ్వడానికి ముందు ఫిట్‌మెంట్ కమిటీ, లీగల్ కమిటీలు ప్రణాళికలు తయారుచేసుకొని జీఎస్టీ మంత్రి వర్గ ఉపసంఘం ముందు పెట్టాలన్నారు. మధ్య, చిన్న, మైక్రో పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహాకాలను కేంద్రప్రభుత్వమే భరించాలన్నారు.

సిమెంట్‌పై జీఎస్టీ 28 శాతం నుండి 18 శాతానికి, సినిమా టికెట్లుపై 18 శాతం నుండి 12 శాతానికి జీఎస్టీని తగ్గించాలని మంత్రి యనమల కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం, గిరిజన కార్పొరేషన్, గిరిజన ఉత్పత్తులను జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుండి తప్పించాలని కోరారు. ఆక్వా, జూట్ బ్యాగ్, చేపలు పట్టే వలలు, మత్య్సకారుల పడవలు, ఎండినచింతపండు, చేనేత వస్త్రాలు, పత్తి నూలు, పట్టు నూలుపై ఉన్న జీఎస్టీ నుండి మినహాయింపు కోరారు. నాపాశ్లాబ్, ట్రాక్టర్లు, ట్రాక్టర్ విడిబాగాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలన్నారు.

సామాన్య ప్రజలు వినియోగించే 29 రకాల వస్తువులకు జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని యనమల కోరారు. డిజిటల్ కొనుగోలుదారులకు జీఎస్టీలో రెండు శాతం మినహాయింపు ఇవ్వడాన్ని మంత్రి స్వాగతించారు. అయితే డిజిటల్ కొనుగోలుదారులకు ఇచ్చే జీఎస్టీ మినహాయింపులో లోపాలు లేకుండా అమలు చేయడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీఎస్టీ కౌన్సిల్‌కు మంత్రి యనమల రామకృష్ణుడు కౌన్సిల్‌కు సూచించారు.

English Title
TTD do not have a GST registration
Related News