పరివర్తన బీజం... మాతృవందనం

Updated By ManamFri, 08/10/2018 - 02:54
German philosopher Karl Marc

imageమానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు ప్రపంచ ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త కారల్ మార్క్. . ఆ సిద్ధాంతాన్ని రుజువు చేసే ఘటనలు ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. లోగడ తల్లిదండ్రులు బిడ్డలకు ఇది వర్తించదనే మినహాయింపు సమాజంలో కనిపించేది. నేటి సమాజం అది కూడా చెరిపేసింది. మానవుడు తన అవసరాలకోసం సృష్టించుకున్న డబ్బుకు ,లోకం దాసోహమైపోయింది. పేదవారి అవసరాలకు...సంపన్నుల జల్సాలకు మూలం డబ్బు.  సత్య ప్రసాద్ మందులు మెమోరియల్ ఆర్ట్స్ విశాఖపట్నం 16వ వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో సుదర్శనం నెల్లూరు కళాకారులు మాతృవందనం నాటిక రసవత్తరంగా ప్రదర్శించారు. నాగ రాజా రావు రచించిన ఈ నాటిక నెల్లూరు సుధాకర్ దర్శకత్వంలో వాస్తవ సమాజానికి అద్దం పట్టింది. 

జమీందారీ వంశంలో పుట్టిన కొడుకును తల్లి గారాబంగా పెంచుతుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో అమ్మ నిర్మలాదేవి కొడుకును అన్నీ తానై పెంచి పెద్ద చేస్తుంది. అవసరంలో ఉన్న వారికి కొంత సాయం చేస్తూ ఊళ్లో ఆమె మంచిపేరు సంపాదించుకుంటుంది. కొడుకు అందుకు భిన్నంగా బలాదూర్ తిరుగుతూ...దుబారా ఖర్చులు చేస్తూ... కోట్ల ఆస్తికి తానొక్కడినే వారసుణ్ణి అని చెప్పుకొంటూ అప్పులు చేస్తుంటాడు. ఇదిలా ఉండగా నిర్మలాదేవికి సుస్తీ చేసి వైద్యుణ్ణి సంప్రదిస్తుంది. ఆమె అనారోగ్యానికి కారణం రెండు మూత్రపిండాలు (కిడ్నీలు) పాడవ్వడమే అని వైద్యులు నిర్థారిస్తారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ద్వారా ఆమె సమస్య పరిష్కారమవుతుంది. కానీ వైద్యం కాస్త ఖరీదైనది, పైగా కిడ్నీ దానం చేసే ఆరోగ్యవంతమైన వ్యక్తి దొరకాలని డాక్టర్ చెపుతాడు. తన ఆరోగ్యం కుదుట పడటానికి అవసరమైన డబ్బు సర్దుబాటు చేసుకుంటాను మిగతా ఏర్పాట్లు చూడమని డాక్టర్ కు పురమాయిస్తుందామె. అమ్మ ఆరోగ్య సంరక్షణకు ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోతే ఊళ్లో తన పరిస్థితి ఏం కావాలి? అప్పులిచ్చిన వాళ్లకు ఏ సమాధానం చెప్పాలో పాలుపోక అమ్మపై తన అక్కసు వెళ్లగక్కుతాడు. కొడుకు నుంచి పొంచి ఉన్న ప్రాణ భయంతో ఆమె ఇంటి నుంచి తప్పించుకుంటుంది. తల్లి కనిపించడం లేదని కొడుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేస్తాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ సత్య ప్రసాద్  కేసు దర్యాప్తు చేస్తాడు. ఇంటరాగేషన్లో ఎంత అడిగినా కొడుకు నుంచి ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో ఇన్స్పెక్టర్ తల బద్దలగొట్టకుంటాడు. అమ్మ తప్పిపోయిందన్న బెంగ కంటే ఏదో తెలీని ఆందోళనతో కొడుకు టెన్షన్ రోజు రోజుకీ ఎక్కువవ్వడంతో ఇన్స్పెక్టర్ ఇంటరాగేషన్ పంథా మారుస్తాడు. జాడ లేకుండా పోయిన ముసలి తల్లిపై అంత ప్రేమ ఎందుకు? ఇంతకీ ఆమె ఏకైక వారసుడిగా నీకు ఎన్ని కోట్ల ఆస్తి వస్తుంది? అందుకు సామాజిక పరమైన అడ్డంకులేమైనా ఉంటే చెప్పు సెటిల్ చేద్దాం? నా వాటా ఎంత అని సూటిగా ప్రశ్నిస్తాడు. ఏంటి సార్ మీరు కూడా...! అంటూ సిబ్బంది నీళ్లు నములుతారు. ఏం నాకు మాత్రం పెళ్లాం, పిల్లలు లేరా? వాళ్లకి అవసరాల్లేవా? డబ్బులు అక్కర్లేదా? అని మొహమ్మీద కుండ బద్దలగొట్టినట్టు మాట్టాడతాడు. ఆ దెబ్బకు కొడుక్కి ఒకింత ధైర్యం వస్తుంది. సెల్ లోంచి ఒక వ్యక్తిని బైటకు రప్పించి నిర్మలాదేవి తప్పిపోయిన రోజు రాత్రి ఊరి బస్ స్టాండులో అపరిచిత వ్యక్తి ఆమె శాలువ కప్పుకొని పడుకొని ఉండటంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నామని ఇన్స్పెక్టర్  చెబుతాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అతను తన వివరాలు చెప్పడంలేదని స్టేషన్ సిబ్బంది చెబుతారు. 

ఏదో ఒకటి రాసి కేసు క్లోజ్  చేసేద్దాం. ఇప్పుడు చెప్పండి ఇంతకూ మీ అమ్మగారు ఇంటి నుంచి పారిపోయిన రోజు రాత్రి ఏం జరిగిందని ఇన్స్పెక్టర్  మళ్లీ తన ఇంటరాగేషన్ మొదలుపెడతాడు. ఏముంది సార్, ఆమె చేత డాక్యుమెంట్లపై సంతకం పెట్టించబోతే చేయి విదిలించుకుని అక్కడి నుంచి పారిపోందిని చెబుతుండగా జరిగిన సన్నివేశాలు రంగస్థలం మీద ప్రత్యక్షమవుతుంటాయి. లైట్లు ఆరిపోయి వెలిగేసరికి ఇన్స్పెక్టర్ ముఖంలో ఏదో సాధించిన వెలుగు... ఆనందం కనిపిస్తాయి. సరిగ్గా అప్పుడే నిర్మలాదేవి పాత్ర పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె దయాదార బిక్షపై చదువుకుని ప్రయోజకులైన ఎంతోమంది అభాగ్యుల తరపున ఆమె మేలు కోరుతూ ఇన్స్పెక్టర్  ఒక పథకం ప్రకారం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఆమెను కనుగొనడంతో ఇన్స్పెక్టర్ తో నిజం చెప్పేసిన కొడుకు గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుంది. ఇంతకీ ఈ అపరిచిత వ్యక్తి సంగతేంటి? అని ఇన్స్పెక్టర్ దృష్టి అతనిపై మళ్లిస్తాడు. ఏమో సార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తన వివరాలు చెప్పడం లేదు. చూడబోతే అమాయకంగా కనిపిస్తున్నాడు అంటారు. అతని దగ్గర ఆధారాలేమైనా ఉన్నాయేమో వెదకుతారు. చేతిలో ఓ కాయితం కనిపిస్తుంది. ఆ కాయితం చదివితే తన గుట్టు బయట పడుతుందని కంగారు పడతాడు. ఇన్స్పెక్టర్  ఆ కాయితం చదువుతాడు. అది డాక్టర్ పంపిన చీటీ. అందులో నిర్మలా దేవి గార్కి అని రాసి ఉండటంతో ఆమె వైపు చూస్తాడు ఇన్స్పెక్టర్ . అప్పుడు నిర్మలాదేవికి విషయం అర్థమౌతుంది. అపరిచిత వ్యక్తి అప్పుడు తన సంగతి చెబుతాడు. కడు పేదరికంలో ఉన్న తన తల్లికి గుండె ఆపరేషన్ అవసరం పడిందని, ఆమెకు వైద్యం చేయించే ఆర్థిక స్థోమత తనవద్ద లేదని వైద్యులకు విన్నవించుకున్నానని డాక్టర్ గారి సూచన మేరకు తన కిడ్నీ అమ్మి అమ్మకు వైద్యం చేసించుకుంటానని ఆశపడి వచ్చానని చెబుతాడు. ఔను వచ్చిన వ్యక్తి చాలా అవసరంలో ఉన్నాడు అతనికి ఒక లక్ష రూపాయల నగదు ఇచ్చి పంపించమని డాక్టర్ తనకు ఫోన్లో చెప్పిన సంగతి నిర్మలాదేవి గుర్తు చేసుకుంటారు. ఇంతలో ఆమె కొడుకు పశ్చాత్తపంతో ... మా అమ్మకు వేరే ఎవ్వరి కిడ్నీ అవసరం  నేనే ఇస్తానంటాడు. తన ఆశలు నీరుగారిపోవడంతో అపరిచిత వ్యక్తి నిరాశతో అమ్మను రక్షించుకోలేకపోయానన్న బెంగతో ఏడుస్తూ వెనుదిరిగిపోతాడు. అతని పరిస్థితి గమనించిన నిర్మలాదేవి అమ్మను రక్షించుకోవాలనే నీలాంటి కొడుకును కన్న అమ్మ అదృష్టవంతురాలు ఆమె వైద్యానికయ్యే ఖర్చు నేను భరిస్తానని భరోసా ఇస్తుంది. వేరొకరి దయాధార బిక్షతో అమ్మను బతికించుకుంటే అందులో నా గొప్పతనం ఏముంటుంది.  కిడ్నీ తీసకుని అందకు బదులుగా అమ్మ ఆపరేషన్ ఖర్చు భరిస్తేనే తనకు సంతృప్తిగా ఉంటుందని అతను వాదిస్తాడు. అప్పుడు ఆమె సరేనని అంగీకరించడంతో కథ సుఖాంత మౌతుంది. ఇందులో ఇన్స్పెక్టర్  పాత్రలో సత్యప్రసాద్ లీనమై నటించి కథను కీలక మలుపు తిప్పారు. నిర్మలా దేవిగా రమాదేవి, మల్లన్న(కిడ్నీ డోనర్) పాత్రకు దర్శకుడు నెల్లూరు సుధాకర్ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. పట్నాల రాజు నేపథ్య సంగీతం సన్నివేశాలను హృదయాలకు హత్తుకునేలా చేసింది. లక్ష్మీకాంత్ బాబు రంగాలంకరణ బావుంది. సుప్రసిద్ధ రంగస్థల నటుడు కె. మందులు స్మారకార్థం ఆయన కుమారుడు సత్య ప్రసాద్ మందులు మెమోరియల్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి 16 సంవత్సరాలుగా తన తండ్రి ఆశయాలను కొనసాగించడం అభినందనీయమని ముఖ్య అతిథి మాజీ మంత్రి, నాటక రచయిత దాడి వీరభద్ర రావు అభినందించారు. ప్రముఖ రంగస్థల దర్శకుడు బొట్టా వేణుకు ఈ సందర్భంగా మందులు స్మారక రంగస్థల పురస్కారం అతిథుల చేతులమీదుగా అందజేశారు. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ భైరి రవి కిరణ్ కు యువ స్ఫూర్తి పురస్కారం అందజేశారు. విశేష సంఖ్యలో హాజరైన ప్రేక్షకులతో ఆడిటోరియం కిక్కిరిసింది. 
-రతన్ రాజు 9490263115

English Title
Transition beam ... motherhood
Related News