అంత దమ్ము మీకుందా..?

Updated By ManamWed, 05/16/2018 - 18:05
Tirumala head priest Ramana Dikshitulu

Tirumala head priest Ramana Dikshitulu

తిరుమల: 65 ఏళ్లు పైబడిన టీటీడీ అర్చకులంతా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని కొత్త పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వివాదం తెరమీదికి తెచ్చిన 24 గంటలకే పాలకమండలి కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంతో రమణ దీక్షితులతో పాటు పలువురు రిటైర్మైంట్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే టీటీడీ నిర్ణయంపై ప్రధాన అర్చకులు స్పందించారు.

శ్రీవారి ఆలయ అర్చక వ్యవస్థలో వేలు పెట్టే అధికారం టీటీడీ అధికారులకు లేదని తేల్చిచెప్పారాయన. అర్చకులకు వయోపరిమితి నిర్ణయం.. తన ఆరోపణలకు ప్రతికార చర్యగా తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని దీక్షితులు తేల్చిచెప్పారు. ప్రభుత్వం హిందూ మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది.. ఇతర మత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేంత దమ్ము ఉందా..? ఆయన సర్కార్‌కు సూటి ప్రశ్న సంధించారు. 

కాగా.. రమణదీక్షితులు ఇటీవల చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆచార వ్యవహారాలపై పలు విమర్శలు చేసి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే టీటీడీపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై వివరణ కోరుతామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి సింఘాల్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ప్రధాన అర్చకులు ఏమని వివరణ ఇస్తారో అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

English Title
Tirumala chief priest, Ramana Deekshitulu respond Over TTD Decission
Related News