మూడో ఓపెనర్, రెండో వికెట్ కీపర్‌పై... సెలెక్టర్లు ఆలోచించాలి

Updated By ManamTue, 10/16/2018 - 05:49
prudvi sha
  • జట్టులో పృథ్వీ షా, రిషబ్ పంత్ స్థానాలు పదిలం

prudvi shaఆస్ట్రేలియా పర్యటనకు ముందు వెసిండీస్‌తో టెస్టు సిరీస్‌ను టీమిండియా గెలవడం ఆనందదాయకమే. కానీ ఆస్ట్రేలియా పర్యటనకు టెస్టు జట్టును ఎంపిక చేసేటప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్, జాతీయ సెలెక్షన్ కమిటీ కొన్ని ప్రధానమైన అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా టెస్టు సిరీస్‌కు మూడో ఓపెనర్, రెండో వికెట్ కీపర్ గురించి ఆలోచించాలి. వెసిండీస్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన పృథ్వీ షా, రిషబ్ పంత్‌లు జట్టులో తమ స్థానాలను స్థిరపరచుకున్నారు. ఆడిలైడ్‌లో డిసెంబర్ 6వ తేదీన తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. కానీ 17 ఇన్నింగ్స్‌లకు గాను 14 ఇన్నింగ్స్‌లలో విఫలమైన కేఎల్ రాహుల్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ సమర్థిస్తోంది. సుదీర్ఘ సిరీస్‌లో మూడో ఓపెనర్ ఉండటం చాలా అవసరం. ‘కేఎల్ రాహుల్ తన తప్పులను తెలుసుకుని వాటిని సరిచేసుకుంటాడన్న నమ్మకముంది. అతని గేమ్ గురించి, ప్రవర్తన గురించి ఎటువంటి సందేహమూ లేదు. అతను చాలా పాజిటివ్‌గా ఉన్నాడు. తన తప్పులను ఎత్తి చూపిన వారికి అతను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు’ అని ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ అన్నాడు. కెప్టెన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో షా-రాహుల్ కనీసం మరొక్కసారి అడిలైడ్‌లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది. కానీ మరోసారి రాహుల్ విఫలమైతే పరిస్థితి ఏంటి? దీనిపై టీమ్ మేనేజ్‌మెంట్ వద్ద గానీ, సెలెక్టర్ల వద్దగానీ ఖచ్చితమైన జవాబు లేదు. 

వెస్టిండీస్‌తో సిరీస్‌లో మయంక్ అగర్వాల మూడో ఓపెనర్‌గా ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఇంకా ఖరారు కాని జట్టులో చోటు కోసం అగర్వాల్ పోటీ పడుతున్నాడు. అగర్వాల్ దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్ది పరుగులు చేశాడు. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో మిచెల్ స్టార్క్, హాజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లను షా సమర్థవంతంగా ఎదుర్కోగలడా? అనే సందేహాలూ తలెత్తుతున్నాయి. అగర్వాల్, షా, రాహుల్‌లను ముగ్గురు స్పెషలిస్ట్ ఓపెనర్లుగా తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ ఫామ్‌లో లేకపోవడం మిగిలిన ఈ ఇద్దరు యువకులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో అగర్వాల్ దురదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే అతని రాష్ట్రానికే చెందిన అంతో ఇంతో అనుభవమున్న కరుణ్ నాయర్ తెరపైకి వచ్చే అవకాశముంది. ఈ విషయానికొస్తే.. మురళీ విజయ్‌కి అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉంది. కానీ విజయ్ సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ సిరీస్‌ల్లో విఫలమయ్యాడు. అంతేకాకుండా సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌పై లేనిపోని ఆరోపణలు చేశాడు. అయితే టీమిండియా నుంచి తొలగించిన తర్వాత ఇంగ్లీష్ కౌంటీలో ఎస్సెక్స్ జట్టుకు ఆడిన విజయ్ 56, 100, 85, 80 పరుగులు చేసి మళ్లీ ఫామ్‌లోకి వస్తున్నాడు. ‘న్యూజిలాండ్-ఎ జట్టుతో సిరీస్‌లో మయాంక్, విజయ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. వీరిద్దరిలో ఎవరు బాగా ఆడితే ఆ క్రికెటర్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసే అవకాశముంది. ఏ సెలెక్షన్ కమిటీ కూడా వివాదాలను కోరుకోదు’ అని సోమవారం మాజీ ఓపెనర్ దీప్‌దాస్ గుప్తా అన్నారు. మరో చాయిస్ శిఖర్ ధావన్. కానీ వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌ల్లో ధావన్ తన ఫామ్‌ను కనబరచుకోవాల్సివుంది. మరోవైపు సొంత గడ్డపై ధావన్ రెడ్ బాల్ ఫామ్ అతని సామర్థ్యాన్ని స్పష్టంగా చెప్పలేకపోతోంది. ఎందుకంటే పేస్ ఫ్రెండ్లీ వాతావరణంలో అతను వరుసగా విఫలమవుతున్నాడు. మంచి హారిజాంటల్ బ్యాట్ ప్లేయ ర్‌గా పేరున్న ధావన్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయొచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఉపయోగించే కూకబుర్రా బంతి సీమ్ తొలి 20 ఓవర్ల తర్వాత తగ్గిపోతుంది. కానీ ధావన్ ఇంగ్లాండ్ పర్యటనలో ఆ తొలి ఓవర్ల ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాడు. అంతమాత్రాన అతని సామర్థ్యాన్ని శంకించలేం. 

ఇక వికెట్ కీపర్ల విషయానికొస్తే.. ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించని వృద్ధిమాన్ సాహాకు అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఇతను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవచ్చు. ఒకవేళ సాహా సెలెక్ట్ అయినా జట్టుకు మ్యాచ్‌లు గెలిపించే సామర్థ్యంలో ఈ బెంగాల్ కీపర్ కంటే తాను మెరుగైన కీపర్‌నని పంత్ నిరూపించగలడు. సాహా ఫిట్‌నెస్ సాధిస్తే పరిస్థితి ఏంటని రెండో టెస్టు తర్వాత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అడిగిన ప్రశ్నకు శాస్త్రి సమాధానమిస్తూ.. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న జట్టుకే ప్రాధాన్యత ఇస్తామని అనడం పంత్‌కే కోచ్ మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. రెండో కీపర్ స్థానం కోసం ఉన్న మరో ఆప్షన్ కోన భరత్. ఇతను ఇండియా-ఎ జట్టుకు ఆడుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో భరత్ సెంచరీ చేశాడు. 

ఏదిఏమైనా ఇటీవల జూనియర్ జట్టు కోచ్ 
రాహుల్ ద్రవిడ్ చెప్పినట్టు విదేశీ పర్యటనకు వెళ్లకముందే బాగా సిద్ధపడాలి. విదేశీ వాతావరణానికి అనువైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌లను ఎంచుకోవాలి. ఇంగ్లాండ్‌లో ఘోర పరాభవం చెందినట్టుగా కాకుండా ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ సేన ఘన విజయాలు సాధించాలని కోరుకుందాం.

English Title
The third opener, the second wicketkeeper ... the selectors should think
Related News