అవన్నీ అబద్ధాలే

Updated By ManamSun, 10/21/2018 - 04:20
ktr
  • రాహుల్ ఆరోపణలకు కేటీఆర్ కౌంటర్

  • అంబేద్కర్‌ను, పీవీని అవమానించింది కాంగ్రెస్సే...

  • ఆయన మాటలు శుష్క ప్రియాలు శూన్య హస్తాలే

  • సీఎంలను మార్చేందుకు మతఘర్షణలు చేయించిన చరిత్ర కాంగ్రెస్‌దే

  • ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్‌గాంధీ ఒకే తాను ముక్కలు

  • తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌పై మండిపడ్డ మంత్రి కల్వకుంట్ల

imageహైదరాబాద్: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రచారంలో అబద్ధాలే  మాట్లాడారని, పొరపాటున ఎక్కడా కూడా రాహుల్ నిజం మాట్లాడలేదని మంత్రి కె.టి. రామరావు అన్నారు. వృద్ధ జంబూకం కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణలో పాగా వేయడానికి అసత్యాలు వల్లిస్తోందని దీన్నే ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన రాహుల్ ప్రసంగానికి కౌంటర్ ఇచ్చాడు. ప్రజలను మతాల వారీగా విభజించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరును టీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలగించలేదన్నారు. ఆయన మాటలు శుష్క ప్రియాలు-శూన్య హస్తాలంటూ వాఖ్యానించారు. సిక్కుల ఊచకోతకు కారణమైన కాంగ్రెస్ పార్టీ కనీసం క్షమాపణ కూడా చెప్పలేదంటూ కేటీఆర్ సైతం ఘాటైన వాఖ్యలతో రాహుల్‌పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. తెలంగాణపై రాహుల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, జాగ్రత్తగా వాస్తవాలు మాట్లాడాలంటూ రాహుల్‌ను హెచ్చరించారు. మతం పేరిట సీఎంలను మార్చేందుకు అల్లర్లు చేయించిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. 

అంబేద్కర్ మరణించిన 34 యేండ్ల తర్వాత భారతరత్న ఇచ్చారని గుర్తుచేశారు. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, .వీపీ సింగ్ ప్రభుత్వం ఇచ్చిదంన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావును అవమాన పరిచిన చరిత్ర కాంగ్రెస్‌దేనని, పీవీ చనిపోతే కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఆయన పార్థివ దేహం ఉంచలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. చివరకు ఆయన భౌతిక కాయానికి సరిగా అంత్య క్రియలు కూడా నిర్వహించలేదని ఆరొపించారు. 

కాంగ్రెస్ నేతలైనప్పటికీ పీవీతో పాటు వెంకటస్వామి,ఈశ్వరీ భాయిలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘనంగా స్మరించుకుంటోందన్నారు. కాంగ్రెస్ కుసంస్కారంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచామని, రాహుల్ పచ్చి అబద్దం మాట్లాడారన్నారు. 17 వేల కోట్ల అంచనా వ్యయాన్ని కాంగ్రెస్ హాయంలోనే 40 వేల కోట్ల రూపాయలకు పెంచారన్నారు. ఇపుడు ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం 80 వేల కోట్లకు పెంచుతూ సీడబ్లుసీ అనుమతి ఇచ్చిందన్నారు. భూ సేకరణ వ్యయం పెరగడం,రిజర్వాయర్ల సామర్ధ్యం పెంపు కారణాలతో ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయని రాహుల్ గాంధీ మాట్లాడటానికి సిగ్గు అనిపించడం లేదా? అని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ హాయంలో చేసిన నిర్వాకాల కారణంగానే రైతుల ఆత్మ హత్యలు చోటుచేసుకున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసుంటే ఆత్మహత్యలు జరిగేవా? అని ప్రశ్నించారు.

తెలంగాణలో రైతుల ఆత్మ హత్యలు తగ్గుతున్నాయని కేంద్ర మంత్రి పార్లమెంటులో సమాధాన మిచ్చారని ఆయన గుర్తుచేశారు. రైతుల కోసం రైతు బిడ్డగా కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. 25 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చామన్నారు. 24 గంటల ఉచిత కరెంటు ,రైతు బంధు పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. రుణమాఫీపై కర్ణాటక తెలంగాణ మోడల్‌నే అనుసరిస్తోందన్నారు. రాహుల్‌కు స్క్రిప్ట్ రాసిచ్చిన వారు వాస్తవాలు చెప్పలేదంటూ చురకలంటించారు. ఉద్యోగ నియామకాల విషయంలోనూ రాహుల్ అబద్దం చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు. లక్షా ఎనిమిది వేల ఉద్యోగాల నియామాకానికి ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. పది వేల ఉద్యోగాలు కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని రాహుల్ దుర్మార్గంగా మాట్లాడారన్నారు.  ఇక, మోడీ,రాహుల్ గాంధీ ఓకే తాను ముక్కలేనంటూ కామెంట్ చేశారు. బీజేపీకి తెలంగాణలో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరంటూ ఎద్దేవా చేశారు. 

English Title
They are all lie




Related News