టీజీ వర్సెస్ ఎస్వీ

Updated By ManamWed, 07/11/2018 - 23:10
image
  • కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటనపై పోరు 

  • లోకేశ్‌ను ఎస్వీ హిప్నటైజ్ చేశారన్న వెంకటేష్

  • ప్రభుత్వ కార్యక్రమంలో అభ్యర్థుల ప్రకటనా? 

  • ఫామ్ ఇచ్చే ముందు ప్రకటిస్తారు: టీజీ 

  • లోకేశ్ ప్రకటనే ఫైనల్ - ఎస్వీ మోహన్ రెడ్డి

imageకర్నూలు: ‘‘వచ్చే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక, అసెంబ్లీ అభ్యర్థిగా ఎస్వీ మోహన్ రెడ్డి పోటీచేస్తారు. వారికి భారీగా ఓట్లు వేసి ఆశీర్వదించాలి’’ అంటూ ఇటీవల కర్నూలులో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన ఆ పార్టీలో మంటలు రాజేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ టికెట్‌ను తన కుమారుడు టీజీ భరత్‌కు ఇప్పించుకోవాలని రాజ్యసభ సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి టీజీ వెంకటేష్ మొదటి నుంచి భావిస్తూ వస్తున్నారు. ఆ కోవలోనే టీజీ భరత్ కూడా నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ చొచ్చుకుపోతున్నారు. కాగా గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన ఎస్వీ మోహన్ రెడ్డి రెండేళ్ల క్రితం టీడీపీలో చేరారు.

ఇక అప్పటి నుంచి టీడీపీలో ఆధిపత్య పోరు మొదలైంది. పట్టు కోసం టీజీ, ఎస్వీ తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ టికెట్ తమదంటే.. తమదని చెబుతూ వస్తున్నారు. కర్నూలు అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు ఎవరనే ఊగిసలాట ధోరణికి మంత్రి నారా లోకేష్ తెరదించేశారు. కర్నూలు అసెంబ్లీకి ఎస్వీ మోహన్ రెడ్డి, పార్లమెంటుకు బుట్టా రేణుక పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో ఎస్వీ వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రకటన టీజీ వర్గీయులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా టీజీ భరత్ తీవ్ర నిరాశకు గురయినట్టు తెలుస్తోంది. దీనిపై టీజీ వెంకటేష్ తీవ్రంగా స్పందించారు. 

లోకేష్ టీడీపీ అధ్యక్షుడు కాదు: టీజీ 
‘‘లోకేష్ టీడీపీ అధ్యక్షుడు కాదు. సీఎం కూడా కాదు. కేవలం ఒక మంత్రి. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం వెనుక కారణం అంతు చిక్కుడంలేదు. చంద్రబాబు ఎప్పుడూ బీఫామ్ ఇచ్చే సమయంలోనే అభ్యర్థిని ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. మరీ ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో సీఎం సర్వేలు చేసి ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి టికెట్ ప్రకటిస్తారు’’ అని టీజీ అన్నారు. కానీ లోకేష్ ఎందుకు ఇంత భిన్నంగా  స్పందించారో అర్థం కావడంలేదన్నారు. లోకేష్ బాబు సాధారణంగా అలా మాట్లాడేవారు కాదని, మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేశారేమోనని అనుమానం కలుగుతోం దన్నారు. ఆయన ఏమైనా చేయగలడని అన్నారు. అందువల్లే లోకేష్ అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నానన్నారు. కర్నూలు టిక్కెట్ విషయంపై గతంలో చంద్రబాబు దగ్గర చర్చకు వచ్చిందన్నారు.  యువకులు రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహంగా ఉన్నారని, వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పానని వెల్లడించారు. తనకు రాజ్యసభ సీటు ఇచ్చాం కదాని ప్రశ్నిం చారని, అవసరమైతే రాజ్యసభ సీటుకు రాజీనామా చేస్తానని స్పష్టంగా చెప్పానని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పే నిర్ణయాన్ని బట్టి తన స్పందన ఉంటుందన్నారు. ఎందుకు ఇలా జరిగిందో తనకు తెలియదని అన్నారు. పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే స్పందిస్తానని టీజీ చెప్పారు.

అన్నీ ఆలోచించే లోకేశ్ నిర్ణయం: ఎస్వీ
టీజీ వెంకటేష్ ప్రకటనపై ఎస్వీ మోమన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంత్రి లోకేష్ తనను కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉంద న్నారు. పరిసితులను బట్టి లోకేష్ ముందుగానే అభ్య ర్థులను ప్రకటిం చారని అన్నారు. టీజీకి రాజ్యసభ సీటు ఇచ్చారు కాబట్టి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామి ఇచ్చారని అన్నారు. లోకేష్ అన్ని ఆలోచించే నిర్ణయం తీసు కున్నారని అన్నారు. కాగా లోకేష్ ప్రకటనపై ఇద్దరు నేతలు భిన్నంగా స్పందించడం తీవ్ర చర్చాంశనీయమైంది. లోకేష్ ప్రకటన ఫైనల్ కాదని టీజీ వర్గీయులు చెబుతున్నారు. టిక్కెట్ విషయమై తేల్చుకోవాలని భావిస్తున్నట్టు తెలు స్తోంది. త్వరలో చంద్రబాబును కలసి సీటు విషయం చర్చించనున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. 

English Title
Tg x Sv
Related News