నాటి కిష్కింధ.. నేటి అనెగొంది!

Updated By ManamSun, 10/21/2018 - 08:56
temple tourism

imageచరిత్ర లోతుల లోనికి వెళితే ఎన్నో అద్భుతాలను వీక్షించవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలలో చారిత్రక స్థలాలే పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. గత తరాల పాలకులు, వారి పాలన, 
నాటి ప్రజల జీవన విధానాలు, స్థితిగతుల గురించిన వివరాలను వీలైనంతగా తెలుపుతాయి ఈ స్థలాలు. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇవి అక్షయ పాత్రలు. 

కోణార్క్, అజంతా, ఎల్లోరా, నాగార్జున కొండ, అమరావతి, గయ.. వంటివన్నీ ఆ కోవకు చెందినవే! అలాంటి వాటిల్లో ‘అనెగొంది’ కూడా ఒకటి. ఒకప్పుడు ఎంతో వైభవానికి చిరునామాగా ఉండి ప్రస్తుతం ఒక శిథిల నగరంగా మిగిలిన హంపికి, పక్కనే ప్రవహించే తుంగభద్రా నదికి ఉత్తరం పక్కన ఉన్న పురాతన ప్రశాంత పల్లె అనెగొంది. 

విజయనగరాన్ని పాలించిన రాజులకు హంపి కన్నా ముందు రాజధాని అనెగొంది. ‘అనె’ అంటే కన్నడంలో ఏనుగు. విజయనగర రాజులు తమ గజ సైన్యాన్ని ఇక్కడ ఉంచడం వలన ఏనుగుల కొష్టం అన్న అర్థంలో అనెగొందిగా దీనికి పేరు వచ్చింది. ఈ ప్రాంతం అశోక చక్రవర్తి పాలనలో ఉన్నట్లు పురాతన గ్రంథాల వల్ల తెలుస్తోంది. 

శాతవాహనులు, చాళుక్యులు, కాదంబులు, రాష్ట్రకూటులు, విజయనగర రాజులు, ఢిల్లీ, బహమనీ సుల్తానులు ఈimage ప్రాంతాన్ని పాలించినట్లుగా శాసనాధారాలు లభించాయి. అనెగొంది పరిసర ప్రాంతాలలో చరిత్రకారులు జరిపిన త్రవ్వకాలలో శిలా యుగం నాటి రాతి, లోహ పరికరాలు, పనిముట్లు లభించాయి. అదేవిధంగా అనెగొందికి సమీపంలోని రాతి గుహలలో ఆది మానవులు ఎర్ర రంగుతో రాతి మీద  చిత్రించిన పశువుల, సూర్య చంద్రుల, మానవ రూపాలను చూడవచ్చు. సందర్శనకు ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన గల మార్గదర్శి (గైడ్) అవసరం. లభించిన శిధిల నిర్మాణాలు, పరికరాలు, వస్తువులు, పురాతన గ్రంథాలు మొదలైన వాటి ఆధారంతో శాస్త్రవేత్తలు సుమారు నాలుగు బిలియన్ల (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) సంవత్సరాల నుండి ఇక్కడ జనావాసాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. వీటిల్లో రాతి యుగం, కొత్త రాతి యుగం, అధునాతన జీవన విధానం.. వంటి అన్ని రకాల నాగరికత వర్థిల్లినట్లుగా తెలిపారు. ఇక్కడ ఉన్న రాతి గుహలు, వాటిల్లోని చిత్రాలు, సమాధులు కొత్త రాతి యుగానికి చెందినవిగా తేల్చారు.

హనుమంతుడు పుట్టిందిక్కడే!
పౌరాణిక విశేషాల గురించి మాట్లాడుకొంటే, వాల్మీకి మహర్షి రామాయణ మహా కావ్యంలో ఉదహరించిన మాతంగ, ఋష్యమూక, హేమకూట, అంజనాద్రి పర్వతాలు, శ్రీరాముడు భక్త శబరిని కలిసిన పంపా సరోవరం అన్నీ ఇక్కడ కనపడతాయి. మాయావి అనే అసురుని వాలి సంహరించిన గుహ, అన్నకు భయపడి సుగ్రీవుడు మాతంగ పర్వత పాదాల వద్ద నివాసమున్న సుగ్రీవ గుహ కూడా ఉన్నాయి. ఇదే కిష్కింధ అన్నదానికి అవి బలం చేకూరుస్తున్నాయి. సంతానం కోసం అంజనాదేవి తపస్సు చేసి వాయునందనుని పుత్రునిగా పొందినది ఇక్కడి పర్వతం మీదనే! ఆమె పేరు మీదుగా అంజనాద్రి అని పిలుస్తున్నారు. గుర్తుగా శిఖరాన హనుమంతుని, అంజనాదేవి, సీతా రామ లక్ష్మణ ఆలయాలు ఉంటాయి. కొండ పైకి చేరుకోడానికి 575 సోపానాలతో మార్గం ఉంది. ప్రతినిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. దశరథ తనయులు భక్త శబరిని కలిసింది, ఆమె పెట్టిన ఎంగిలి పండ్లను ఆప్యాయంగా స్వీకరించింది అంజనాద్రికి కొద్ది దూరంలో కొండల మధ్య సుందర ప్రశాంత వాతావరణంలో ఉన్న పంపా పుష్కరణి ఒడ్డునే అని తెలుస్తోంది. కోనేరు ఒడ్డున శ్రీ మహాలక్ష్మి ఆలయం ఉంటుంది.

మాయావి హతమైన వాలి గుహ 
imageభాగవత పురాణం ప్రకారం పంచ పుష్కరుణులలో స్నానమాచరించడం పరమ పవిత్రం అని తెలుస్తోంది. అవి మానససరోవరం (కైలాస పర్వతం), బిందు సరోవరం (గుజరాత్), నారాయణ సరోవరం (గుజరాత్), పుష్కర సరోవరం (రాజస్థాన్) మరియు పంపా సరోవరం (హంపి, కర్ణాటక).

మరో గాథ ప్రకారం పంపాదేవి.. పార్వతీ దేవి అంశ. ఆమె ఇక్కడ తపమాచరించి సదాశివుని పతిగా పొందినదట. హంపి విరూపాక్ష ఆలయంలో పంపా దేవి కొలువుతీరి ఉంటారు. పంపా సరోవరం దాటిన తరువాత దుర్గాదేవి ఆలయం వస్తుంది. ఋష్యమూక పర్వత పాదాల వద్ద ఆలయం నిర్మించారు. విజయనగర రాజులు దండయాత్రలకు తరలి వెళ్లే ముందు ఈ దేవిని కొలిచి బయలుదేరేవారట. నేటికీ భక్తులు తమ కోర్కెలు అమ్మకు నివేదించుకొని ఇక్కడి చెట్టుకు కొబ్బరి కాయ కడతారు. అలా చేస్తే తమ కోర్కెలు నెరవేరతాయన్నది వారి నమ్మకం. 
ప్రాంగణంలో ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈ కోవెల వెనక పక్క అనెగొంది కోట ఉంటుంది. అందులో వినాయక ఆలయం, నక్షత్ర, రాశీ వృక్షాల వనం, కోనేరు, వాలి గుహ ఉంటాయి. దుందుభి అనే రాక్షసుని తనయుడు మాయావి తన తండ్రిని చంపిన వాలి మీద పగతో రెచ్చగొట్టాడు. కానీ వానర వీరుని బలం ముందు ఆగలేక పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. తమ్ముడు సుగ్రీవుని బయట కాపలా ఉంచి వాలి మాయావిని వెదుకుతూ గుహ లోపలికెళ్ళాడు. రోజులు గడుస్తున్నా అన్న తిరిగి రాకపోవడంతో చనిపోయాడని తలంచిన సుగ్రీవుడు బిలానికి అడ్డంగా ఒక పెద్ద రాతిని ఉంచి వెళ్ళిపోయాడు. వాలి తిరిగి రావడం, సుగ్రీవుని ద్రోహిగా నిర్ణయించి రాజ్యం నుండి వెళ్లగొట్టడం.. అదంతా తరువాత కథ. మాయావిని చంపిన గుహ ఇదే అని చెబుతారు.

నవ బృందావనాలు
శిథిల కోట ద్వారం దాటి లోనికి వెళితే నేర్పరులైన శిల్పులెవరో పేర్చినట్లుగా కొండరాళ్ళు గుట్టలు గుట్టలుగా ఉండే మార్గంలో ఋష్యమూక పర్వతాగ్రభాగం చేరుకొంటే చుట్టూ ఎత్తుగా ఉన్న కొండలు, మధ్యలో పచ్చని పొలాలు, వాటన్నిటినీ చుడుతూ గలగలా పారే తుంగభద్రానది! ప్రకృతి సుందర రూపాన్ని సంపూర్ణంగా కన్నుల పండుగగా వీక్షించే అద్భుత అవకాశం. కొండపైన ఉన్న గుర్తుల ప్రకారం చివరి దాకా నడిస్తే క్రింద ఉన్న గుహలోని శివలింగాన్ని, పెద్ద పుట్టను పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నుండి పాకుతూ చేరుకోవడం మరో అరుదైన అనుభవం.
రామాయణం ప్రకారం రామబంటు తొలిసారిగా తన స్వామిని కలిసింది మాతంగ  పర్వతం మీదనే అని తెలుస్తోంది. వాలిని కోదండ రాముడు చెట్టు చాటు నుండి నేల కూల్చినది ఇక్కడకు దగ్గరలోని నింబపురం అనీ, అక్కడ గుట్టగా కనిపించే బూడిదను వాలి తాలూకు చితాభస్మం అనీ చూపిస్తారు.

ఋష్యమూక పర్వతాన్ని సందర్శించుకొని అనెగొంది గ్రామం వైపుకు వెళితే ఎన్నో నిర్మాణాలను చూడవచ్చు. పురాతన రంగనాథ స్వామి ఆలయం, మహారాజుల నివాసం అయిన గగన్ మహల్ సహా మరెన్నో శిథిల మండపాలు, నిర్మాణాలు కనపడతాయి. తుంగభద్రా నదీ గర్భంలో మధ్వ మతాచార్యులైన తొమ్మిది మంది గురువుల సమాధులు ఉంటాయి. వీటిని నవ బృందావనాలు అంటారు. నదిలో నీటి మట్టం తక్కువగా ఉన్న సమయంలో బృందావన సందర్శనకు అవకాశం ఉంటుంది. 

ఇక్కడే నది ఒడ్డున ఆంధ్ర భోజుడుగా ప్రసిద్ధికెక్కిన శ్రీకృష్ణ దేవరాయల సమాధి ఉంటుంది. ఆయన అరవై నాలుగు కళల్లో నిష్ణాతుడన్న సత్యం తెలిపేలా మండపాన్ని అరవై నాలుగు స్తంభాలతో నిర్మించారు.

విజయనగర వైభవ చిహ్నాలు
మాతంగ మహర్షి నివాసముండటం వలన ఆయన పేరు మీద పిలవబడే మాతంగ పర్వతం హంపి వైపున ఉంటుంది. దుందుభి మృత దేహాన్ని విసిరేసి తన తపస్సుకు భంగం కలిగించిన వాలి ఈ పర్వతం పైకి వస్తే మరణిస్తాడని శపించారు మాతంగ ముని. అదే సుగ్రీవునికి రక్ష అయ్యింది. వాలితో వైరం తలెత్తినప్పుడు ఇక్కడే తల దాచుకొన్నాడు. పర్వత అగ్రభాగాన వీరభద్ర స్వామి ఆలయం నిర్మించారు. పర్వతం వెనుక ప్రవహించే నదిలో స్నానమాచరించే సమయంలోనే సుగ్రీవునికి రావణునిచే అపహరించబడి, ఆకాశ మార్గాన వెళుతున్న భూజాత విడిచిన నగలు లభించినది. వాటిని అతను దాచిన సుగ్రీవ గుహను అచ్యుతరాయ నిర్మిత రామాలయం వెళ్లే దారిలో చూడవచ్చు.

హంపిలో విరూపాక్ష ఆలయం, ఆలయం పక్కనే ఉన్న హేమకూట పర్వతం మీది జైన, ఇతర ఆలయాలు, ఊరిలోని కృష్ణాలయం, వీరభద్ర ఆలయం, కమలమహల్, గజశాల, విజయ విఠలాలయం, బాడవ లింగం, మహానవమి గద్దె, నల్లరాతి మెట్ల కోనేరు, హజార రామ ఆలయం, స్నానశాల.. ఇలా ఎనభై నాలుగు విశిష్ట నిర్మాణాలను సందర్శించుకొనవచ్చు. ఇవన్నీ నాటి విజయనగర వైభవాన్ని తమ విషణ్ణ రూపాలతో తెలియజేస్తాయి. 
విరూపాక్ష ఆలయం వెనక ఉన్న హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా పీఠం కూడా తప్పక సందర్శించవలసినదే. శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, గ్రంథాలు, పురాణాలు ఏకాభిప్రాయంతో ప్రస్తుతించిన ఏకైక ప్రదేశం అయిన అనెగొంది సందర్శకులకు ఆధ్యాత్మిక, చారిత్రక, ప్రకృతి సౌందర్యాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించే అరుదైన అవకాశాన్ని అందిస్తుంది.

ప్రయాణ-వసతి సౌకర్యాలు

హంపిలో అందుబాటు ధరలలో అద్దె గదులు, రిసార్ట్స్ (విరూపారూప గద్దె వద్ద) లభిస్తాయి. హంపికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న  రైల్వే స్టేషన్ హోస్పేట. దేశం నలుమూలల నుండి ఇక్కడికి రైలు సౌకర్యం ఉంది. స్థానికంగా తిరగడానికి ఆటోలు లభిస్తాయి. తమంతట తామే తిరుగుదామని తలచే పర్యాటకుల కోసం అద్దెకు సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు రోజువారీ అద్దెకు లభిస్తాయి. వీటిని బస చేసిన హోటల్  వాళ్లే అమరుస్తారు.
 

image

 

English Title
temple tourism
Related News