టెలికాంను ఆదుకుంటాం

Updated By ManamWed, 06/13/2018 - 22:34
Mali-Telecommunication-Market

Mali-Telecommunication-Marketన్యూఢిల్లీ: ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా చేపట్టిన క్రియాశీల విధానాలు మొబైల్ టారిఫ్‌లు ఊహించనంతగా తగ్గడానికి, కాల్ డ్రాప్ పరిస్థితిలో ‘‘చెప్పుకోతగ్గ మెరుగుదల’’ కనిపించడానికి దారితీశాయని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. టెలికాం రంగ ‘‘విజయ గాధ’’ను కొనసాగించేందుకు అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్రం సంశయించబోదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయనే భయాందోళనలను మంత్రి పారదోలే ప్రయత్నం చేశారు. టెలికాంలో నూతన అవకాశాలు నూతన ఉద్యోగాల పుట్టుకకు కారణమయ్యాయని, ఈ రంగంలో ఏకీకరణ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధోరణేనని ఆయన అన్నారు. పోటీ తీవ్రంగా ఉన్న మార్కెట్లో 4జి స్పెక్ట్రమ్ లేని ‘‘లోటు’’ ఉన్నప్పటికీ సేవల్లో ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, మహానగర్ టెలిఫోన్ లిమిటెడ్‌లు రెండూ సాయశక్తులా కృషి చేస్తున్నాయని మంత్రి వాటిని వెనకేసుకొచ్చారు. టెలికాం ఆపరేటర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడుల గురించి ప్రస్తావించినప్పుడు, ‘‘వడ్డీ రేట్ల విషయంలోకానీ, స్పెక్ట్రమ్ చెల్లింపును వాయిదా వేయడంలోకానీ చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడతా అవసరమైతే అటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. టెలికాంది విజయ గాధ. ఆ రంగం చెక్కుచెదరకుండా ఉండేట్లు చూస్తాం’’ అని మంత్రి జవాబిచ్చారు. ప్రభుత్వం సాధించిన విజయాలను చాటుకునేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత అభివృద్ధి చెందిన టెలికాం మార్కెట్లలో కూడా 3-5 సంస్థలే ఉన్నాయని, భారతదేశం కూడా అందుకు భిన్నం కాదని ఆయన అన్నారు.  టెలికాం రంగంలో ‘‘ఏకీకరణ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధోరణి. భారత్ కూడా అందులో భాగమైంది’’ అని అన్నారు. టెలికాం పరిశ్రమ దాదాపు రూ. 7.6 లక్షల కోట్ల రుణ భారంతో కునారిల్లుతోందని అంచనా. ఈ రంగంలో కొత్తగా అడుగిడిన రిలయన్స్ జియో కస్టమర్లను కూడగట్టుకునేందుకు మార్కెట్లో సమరశీల, విచ్ఛిన్నకర టారిఫ్‌లను ఆవిష్కరించడంతో, మునుపటి నుంచి ఉన్న అన్ని టెలికాం సంస్థలు రాబడులు, లాభదాయకత, ముఖ్య నిర్వహణాపరమైన గణాంకాల విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. తీవ్ర పోటీ సడలే సూచనలు లేకపోవడంతో టెలికాం రంగం విలీనాలు, స్వాధీనాల రూపంలో భారీయెుత్తున్న ఏకీకరణను వీక్షిస్తోంది. కొన్ని సంస్థలు వైదొలగాయి. ఆపరేటర్లకు ఊరట కల్పించేందుకు స్పెక్ట్రమ్ చెల్లింపుల వాయిదాల సంఖ్యను, రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీ హోల్డింగ్ పరిమితులను పెంచాలని  ప్రభుత్వం ఈ ఏడాది మొదట్లో నిర్ణయించింది. టెలికాం రంగంలోకి 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.5 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో టెలికాం శాఖ నూతన టెలికాం విధాన ముసాయిదాను విడుదల చేసింది. ఈ జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్ల విధానం లైసెన్సు ఫీజులను, స్పెక్ట్రమ్ వాడక చార్జీలను, యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ లెవీని సమీక్షించడం ద్వారా రుణాల భారంతో కుంగుతున్న టెలికాం పరిశ్రమ కష్టాలను తీర్చాలని ప్రతిపాదించింది.

నిధులివ్వాలని చూస్తున్నాం
ప్రభుత్వ రంగంలోని బి.ఎస్.ఎన్.ఎల్, ఎం.టి.ఎన్.ఎల్ రెండు సంస్థలూ ఈక్విటీ జారీ ద్వారా కొత్తగా మూలధనాన్ని సమకూర్చుకోవాలని కోరుకుంటున్నాయి. ఈ మేరకు అవి చేసిన అభ్యర్థనను ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఆ రెండు కంపెనీలు 4జి స్పెక్ట్రమ్ కోసం టెలికాం శాఖను వేర్వేరుగా అభ్యర్థించాయి. ప్రభుత్వానికి అదనపు ఈక్విటీ ఇవ్వజూపడం ద్వారా అవి నిధులలో కొంత మేర సమకూర్చుకోవాలని చూస్తున్నాయి.

English Title
Telecom will survive
Related News