కేసీఆర్ కబంధ హస్తాల్లో తెలంగాణ బందీ

Updated By ManamTue, 10/23/2018 - 06:58
uttam
  • ఎన్నికల్లో ఆయన కుటుంబానికి ప్రజలకు మధ్యే పోటీ 

  • టీఆర్‌ఎస్ పాలనపై ధ్వజమెత్తిన  కూటమి నేతలు

pccpresidenth-uttama-kumar-readహైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాలు గున్నరేండ్ల పాలనపై మహాకూటమి నేతలు తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ,  కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల్లో బందీ అయిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ  కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు బొందపెట్టే రోజులు దగ్గరపడ్డాయని ఉత్తమ్ విమర్శించారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. కాళేశ్వరంతోపాటు ఇతర నీటి పారుదల ప్రాజెక్టుల్లో ఆరు శాతం కమీషన్‌ను కేసీఆర్ కుటుంబమే తీసుకుంటోందని, తాను అధికారికంగా ఈ విషయం చెబుతున్నానని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎల్. రమణ మాట్లాడుతూ, కేవలం 45 రోజుల్లోనే ఎవరూ ఊహించని విధంగా టీఆర్‌ఎస్ గ్రాఫ్ 60 నుంచి 30 సీట్లకు పడిపోయిందని వివరించారు. సమాజ హితం కోరినప్పుడే విలువ పెరుగుతుందని, తెరాస పాలనలో అది కొరవడిందని కోదండరాం అన్నారు. పొత్తుల విషయంలో అంతా కలిసి ముందుకెళ్లాలని ప్రజల నుంచి తమపై ఒత్తిడి వస్తోందని ఆయన తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలన తిరిగి రాకుండా  చూడాలని ప్రజాస్వామిక వాదులంతా బలంగా కోరుకుంటున్నారని అన్నారు. సీట్ల విషయంలో చిన్నపాటి విభేదాలు వచ్చినా పొత్తుతోనే ఎన్నికలకు పోతామని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రమొస్తే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి పాలనలో భాగస్వామ్యం లభిస్తుందని భావించామని, కానీ ఉద్యమంతో సంబంధం లేని వారికే పదవులు దక్కాయని చాడా వెంకట్‌రెడ్డి విమర్శించారు. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను సురవరం సుధాకర్ రెడ్డి వివరించారు.

English Title
Telangana captive in KCR
Related News