టీడీపీ ఎంపీల వాకౌట్

Updated By ManamMon, 08/06/2018 - 22:56
Rammohannayudu
  • వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల అంశంలో కేంద్రం తీరుకు నిరసన

  • మోదీ ఓ నియంత: రామ్మోహన్‌నాయుడు

tdpన్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చిన కేంద్రం వాటిని వెనక్కి తీసుకోవడంపై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర వైఖరికి నిరసనగా సోమవారం లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ... అసలు బుందేల్‌ఖండ్ తరహాలో రూ.22 వేల కోట్లు నిధులు ఇస్తామని కేవలం రూ.350 కోట్లు ఇవ్వడం రాష్ట్రంపై కక్ష సాధింపుగానే కనిపిస్తోందని మండిపడ్డారు. 7 వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి వెనక్కి తీసుకోవడం దారుణమని అన్నారు. యూసీ ఇవ్వలేదన్న సాకుతో డబ్బులు వెనక్కి తీసుకున్నామని చెప్పడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు చేటని, మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఇది ఎన్డీయే ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పారు. రాష్ట్ర హక్కులు కాపాడతాం అంటూనే రాష్ట్రానికి ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకోవడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితులతో ఆయా జిల్లాల్లో కరవు నెలకొందని, ఈ సమయంలో ఆ నిధులు ఎంతో అవసరమని జిల్లాల అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు దిల్లీ వస్తున్నారని, రైల్వే జోన్‌పై అందరం మంత్రి పీయూష్ గోయల్‌ని కలుస్తామని పేర్కొన్నారు.

అనంతరం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, మురళీమోహన్ మండిపడ్డారు. ఆధారాలు లేకుండా జీవీఎల్ పిచ్చిగా మాట్లాడుతున్నారని, జీవీఎల్‌కు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. జీవీఎల్ సర్పంచ్‌గానైనా గెలవగలరా అంటూ ప్రశ్నించారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై నిరంతరం పోరాటం చేస్తున్నామని.. న్యాయం జరిగే వరకు కొనసాగిస్తామని వెల్లడించారు. అనంతరం బుట్టా రేణుక  మాట్లాడుతూ కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాలకి బుందేల్ ఖండ్ తరహా లాంటి ప్రత్యేక ప్యాకేజీ  ఇస్తామని హామీ ఇచ్చింది కానీ ఇంత వరకు అలాంటి నిధులు ఎక్కడ కేటాయించలేదని పేర్కొన్నారు. గత శుక్రవారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల మంజూరు గురుంచి అడిగిన ప్రశ్నకి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం చాలా నిరుత్సాహ పరచిందన్నారు. 350 కోట్లు రాష్ట్రానికి ఇచ్చి వెనక్కు  తీసుకున్న మాట వాస్తవమే అని మంత్రి తెలిపారన్నారు. సంబంధించిన పత్రాలు రాకముందే పొరపాటున నిధులు విడుదల చేశామని వారు తెలిపారన్నారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్ పరిశీలించిన తరువాత నీతి ఆయోగ్ డిమాండ్ నెంబరు 40 కింద కేంద్రం రాష్ట్రాలకి నిధులు విడుదల చేస్తుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన యూసీలపై చట్టపరమైన తదుపరి అనుమతు లు రాలేదు అని మంత్రి తెలపడం గమనార్హం అన్నారు. కేంద్రం రాష్ట్రాల పట్ల ఇలాంటి వ్యవహరించడం తగదని ఆమె అన్నారు. 

English Title
TDP MPs walkout
Related News