టంగుటూరు.. హాట్ గురూ!

Updated By ManamFri, 11/09/2018 - 23:39
Tangutur
  • పలువురు నాయకులు ఇక్కడివారే

  • ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలకం

  • వృత్తి వ్యవసాయం.. ప్రవృత్తి రాజకీయం

  • రాజకీయాలను శాసిస్తున్న టంగుటూరు

Tanguturఒంగోలు: రాష్ట్రంలో రాజకీయ చైతన్యం కలిగిన ప్రకాశంలో.. ఎక్కువ మంది టంగుటూరు ప్రాంతానికి చెందిన వారే! నిజానికి స్థానిక నేతలకు ప్రజలు జైకొడతారు. అయితే, ప్రకాశంలో మాత్రం టంగుటూరు నాయకులను అన్నిచోట్లా ప్రజలు ఆదరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో వెనుకబడిన నియోజకవర్గం కొండపి కూడా ఒకటి. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రవృత్తి రాజకీయాలు.

అందరూ టంగుటూరు నుంచే...
ఈ ప్రాంతానికి చెందిన అనేకమంది రాజకీయ మేధావులుగా గుర్తింపు పొందారు. వీరిలో అత్యధికులు టంగుటూరు ప్రాంతానికి చెందిన వారే. ప్రస్తుతం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వస్థలం టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెం. ఆయన గత నాలుగైదు విడతలుగా టీడీపీ అధ్యక్షుడిగానే ఉంటున్నారు. ఈయన తాత కాలం నుంచి కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. దామచర్ల ఆంజనేయులు.. గతంలో కొండపి ఎమ్మెల్యేగా చేశారు. ఈయన కూడా తూర్పునాయుడు పాలేనికి చెందిన వారే. ఆంజనేయులు ఎమ్మెల్యేగాను, మంత్రిగాను జిల్లా  రాజకీయాల్లో తనదైన శైలిలో చక్రం తిప్పారు. ప్రస్తుతం ఎస్సీ నియోజకవర్గం అయిన కొండపి నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే డోలా బాలా శ్రీ వీరాంజనేయస్వామి తూర్పునాయుడు పాలేనికి చెందినవారే. డీసీసీబీ డైరెక్టర్ దామచర్ల పూర్ణచంద్రరావు తూర్పునాయుడు పాలెం వ్యక్తే. ఇక, జిల్లా టీడీపీ యువ నాయకుడు దామచర్ల సత్య తూర్పునాయుడు పాలెం నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 

వైసీపీ నుంచి గెలిచినా...
కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుది టంగుటూరు. ఇక్కడి నుంచి ఆయన రాజకీయ అరంగేట్రం ప్రారంభమైంది. ఆయన 2004లో కొండపి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఎమ్మెల్సీ అయ్యి.. ప్రస్తుతం కందుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రామారావు ఆ తర్వాత టీడీపీలోకి జంప్ చేశారు. ఇక గతంలో పోతుల రామారావు తండ్రి పోతుల చెంచయ్య జడ్పీ మాజీ చైర్మన్. ఆయన కూడా టుంగుటూరు వాసే. ఆయన అప్పట్లో జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇక పొగాకు బోర్డు మాజీ చైర్మన్ బెల్లం కోటయ్యది టంగుటూరే. కోటయ్య తనయుడు బెల్లం జయంత్ బాబు ప్రస్తుత టంగుటూరు సర్పంచ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా మొత్తంగా ప్రకాశం జిల్లాలో టంగుటూరు నేతల హవా కనిపిస్తోంది.

Tags
English Title
Tangutur Hot Hot
Related News