స్వీడన్ స్వీట్ విక్టరీ

Updated By ManamTue, 06/19/2018 - 00:54
image
  • తొలి మ్యాచ్‌లో దక్షిణకొరియాపై 1-0 గోల్స్‌తో  విజయం

  • ఫిఫా ప్రపంచ కప్‌లో స్వీడన్ మధురక్షణాలను అందుకుంది. తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాను 1-0 గోల్స్‌తో ఓడించి 60 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌ను గెలుచుకుంది.  స్వీడన్ స్టార్ గ్రాన్‌క్విస్ట్ ఏకైక గోల్ చేసి కొరియాపై విజయాన్నందించాడు.

imageనిజ్నీ నోవ్‌గొరోడ్ (రష్యా): ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో  స్వీడన్ బోణీ కొట్టింది.  సోమవారం  జరిగిన గ్రూప్-ఎఫ్ మ్యాచ్‌లో దక్షిణకొరియాపై 1-0 గోల్స్‌తో విజయం సాధించింది.   కొరియాతో ఆసక్తికరంగా సాగిన పోరులో ఆద్యంతం ఆధిక్యం కనబరిచిన స్వీడన్    మ్యాచ్ మొత్తంలో ఎక్కువ భాగం బంతిని తమ నియంత్రణలోనే ఉంచుకుంది.  పలుమార్లు వృథా ప్రయత్నాల తర్వాత 65వ నిమిషంలో గోల్ కొట్టింది.  ఈ దశలో లభించిన పెనాల్టీని స్వీడన్ చక్కగా వినియోగించుకుంది. ఆండ్రియాస్ గ్రాన్‌క్విస్ట్  స్పాట్ కిక్ ద్వారా దక్షిణ కొరియా గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్‌పోస్టులోకి తరలించేశాడు.  దీంతో స్వీడన్ ఆధిక్యత 1-0కు పెరిగింది.  అంతర్జాతీయ కెరీర్‌లో గ్రాన్‌క్విస్ట్‌కు ఇది ఏడో గోల్.   ఆ తర్వాత ఆధిక్యాన్ని సమం చేసేందుకు దక్షిణ కొరియా ఆఖరి వరకూ ప్రయత్నించినా.. లాభం లేకపోయింది.   1958 తర్వాత ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో స్వీడన్ గెలుపొందడం ఇదే తొలిసారి. అప్పట్లో మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో స్వీడన్ గెలిచింది.  ఆ తర్వాత జరిగిన ప్రపంచ కప్‌ల్లో ఆడిన స్వీడన్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేదు. ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోగా, రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.  కొరియాతో జరిగిన మ్యాచ్‌లో   స్వీడన్ 15 సార్లు గోల్‌పోస్టుపై దాడులు చేయగా.. దక్షిణా కొరియా 5 సార్లు మాత్రమే గోల్ ప్రయత్నం చేసింది.  మ్యాచ్ చివరి వరకూ ఆధిక్యం నిలబెట్టుకున్న స్వీడన్ ప్రపంచ కప్‌లో తొలి విజయం నమోదు చేసింది. 2002 ప్రపంచ కప్‌లో నైజీరియాతో జరిగిన మ్యాచ్  తర్వాత  స్వీడన్ కొట్టిన తొలి పెనాల్టీ గోల్ ఇదే. మెక్సికో: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది మెక్సికో. ఈ మ్యాచ్‌లో మెక్సికో జట్టు విజయం సాధించడంతో అభిమానులంతా ఒకేసారి రోడ్ల మీదకు వచ్చి డ్యాన్స్ చేయడంతో భూమి కంపించింది. మెజారిటీ అభిమానులు మెక్సికో జెండాలను పట్టుకుని, వారికి సంప్రదాయమైన  సమ్బ్రూ టోపీలను ధరించి స్టేడియంలో మెక్సికో జట్టుకు మద్దతు తెలిపారు. మెక్సికో దేశ అధికారక సాకర్ పాటను పాడారు.  మెక్సికోలోని కుటుంబాలు జంక్షన్‌ల వద్ద పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసుకుని మ్యాచ్‌ను తిలకించారు. మెక్సికో ప్లేయర్ హిర్వింగ్ లొజానో 35వ నిమిషంలో గోల్ చేయగానే మెక్సికో జట్టు అభిమానులు సంతోషంతో  ‘అవును మేము గోల్ చేశాం’ అని స్టేడియం దద్దరిల్లేలా కేకలు వేశారు. ఈ సయంలోనే మెక్సికో సిటీలో భూకంపం రెండు ప్రదేశాల్లో సంభవించింది. ఇది సాధారణ భూకంపమేనని అక్కడ జియోలాజికల్ సంస్థ తెలిపింది. ‘ నేను చెప్పలేనంత సంతో షంగా ఉన్నాను. మెక్సికో గెలిచింది నేను నా కొడుకుతో సెలబ్రేషన్స్ జరుపుకున్నానని’,  మెక్సికో జట్టు సెమీఫైనల్స్ చేరుకుంటుందని మెక్సికో ప్లేయర్ పులిడో అన్నాడు.

మెక్సికోలో మిన్నంటిన సంబరాలు
ఇదే నా బెస్ట్ గోల్: మెక్సికో స్టార్ లొజానో
డిఫెండింగ్ చాంపియన్ జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో  మెక్సికో ఫార్వర్డ్ ప్లేయర్ హిర్వింగ్ లొజానో 34వ నిమిషంలో సూపర్‌గోల్‌తో వరల్డ్ కప్ చరిత్రలో జర్మనీపై మెక్సికోకు రెండో విజయాన్నందించాడు. 1982 ప్రపంచ కప్‌లో మాత్రమే మెక్సికో జర్మనీని ఓడించగా.. మళ్లీ ఇన్నేళ్లకు జర్మనీపై మెక్సికో ఘన విజయం సాధించింది.   మ్యాచ్ 35వ నిమిషంలో జర్మనీ డిఫెండర్లను తప్పిస్తూ హిర్వింగ్ లొజానో కళ్లుచెదిరే గోల్ కొట్టాడు. దీంతో మెక్సికో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. మ్యాచ్ అనంతరం లొజానో మాట్లాడుతూ ‘‘మెక్సికో ఫుట్‌బాల్ చరిత్రలో ఇదే గొప్ప విజయం అని నేను అనుకోవట్లేదు. కానీ, మా జట్టు సాధించిన అతి పెద్ద విజయాల్లో ఇది ఒకటి అవుతుందని నమ్ముతున్నా’’ అని చెప్పాడు. ‘‘వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీని విజయంతో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. నా కెరీర్‌లోనే ఇది బెస్ట్ గోల్. ప్రపంచకప్‌లో ఆడాలని కలలు కన్నాం. మా కల నెరవేరింది. ఈ విజయాన్ని మెక్సికన్లకు అంకితం ఇస్తున్నాం. 

ఇలాగైతే కష్టమే...
బెర్లిన్: ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెం డింగ్ చాంపియన్ జర్మనీకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో జర్మనీ 0-1తేడాతో మెక్సికో చేతిలో ఘోర పరాజయం పాలైంది. దీంతో జర్మనీ మీడియా తమ జట్టు ఆటతీరుపై ఆందోళన వ్యక్తం చేసిం ది. ప్రపంచకప్ ఓపెనింగ్ గేమ్‌లో ఓడిపోవడం జర్మనీకి ఇదే మొదటిసారి. ‘ మెక్సికోపై జర్మనీ ఆడిన ఆటతీరు కలవరపెడుతుంది. ఈ ఓటమితో జర్మనీ ప్రపంచకప్ సాధించటంపై మాకు ఆందోళన కలుగుతుంద’ని జర్మన్ డైలీ బిల్డ్ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ‘ మా ఆందోళనకు కారణం ఉంది’ జర్మన్ జట్టు అనిర్లక్ష్యంమైన ఆట వల్లనే మెక్సికో గెలుపొందిందని మునిచ్ లోని ఒక   పత్రిక ప్రచురించింది. ‘జర్మనీ తప్పులు చేయటం ప్రారంభించిం ద’ని ఫ్రాంక్ఫర్టర్ ఆల్గెవెుయిన్ పత్రిక పేర్కొనగా, ‘ పిచ్‌పై ప్రపంచ చాంపియన్స్ ఆట ఎక్కడ కనిపించలేదు’ అని స్పోర్ట్స్ బిల్డ్ మ్యాగజైన్ ప్రచురించింది. ఆదివారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో జర్మనీ 0-1తో మెక్సికో చేతిలో ఓడిపోయింది.
 

Tags
English Title
Sweden is a sweet Victory
Related News