భారత్-బంగ్లా మధ్య సువర్ణాధ్యాయం

Updated By ManamFri, 05/25/2018 - 22:21
modi
  • సహకారం.. స్నేహభావంతో ముందుకు.. ప్రజల మధ్య కూడా అవగాహన: ప్రధాని

  • బెంగాల్‌లో మోదీ.. బంగ్లా ప్రధాని హసీనా.. విశ్వ భారతి వర్సిటీ స్నాతకోత్సవానికి రాక

  • యూనివర్సిటీ ఆవరణలో బంగ్లా భవన్.. ప్రారంభించిన భారత ప్రధాన మంత్రి

  • నిర్మాణం చేపట్టిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. సాంస్కృతిక బంధానికి గుర్తన్న హసీనా

modiశాంతినికేతన్: స్నేహ భావం, పరస్పర అవగాహన, సహకారంతో భారత్-బంగ్లాదేశ్ మధ్య బలమైన బంధంతో ముందుకు సాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య కూడా పరస్పర అవగాహనతో ఒకరి నుంచి మరొకరు చాలా నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు.  కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో  సువర్ణాధ్యాయం కొనసాగుతోందని అభిప్రాయప డ్డారు.  పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో గల విశ్వ భారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హాజరయ్యారు. శుక్రవారం ఉదయమే ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్‌లో పనగఢ్‌కు చేరుకున్నారు. ఆయనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నేరుగా విశ్వ భారతి వర్సిటీకి చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మోదీ, మమత కలిసి స్వాగతించారు. ఈ సందర్భంగా మోదీ, హసీనా ఇద్దరూ వర్సిటీ సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఈ స్నాతకోత్సవ వేడుకలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, బంగ్లాదేశ్ వేర్వేరు దేశాలైనప్పటికీ పరస్పర అవగాహన, సహకారాలతో బలమైన బంధాన్ని కలిగి ఉన్నాయన్నారు. ప్రజా విధానాలు, సాంస్కృతిక పరంగా మెరుగైన బంధాలు కలిగి ఉన్నామని చెప్పారు. ఇరు దేశాల ప్రజల మధ్య కూడా పరస్పర అవగాహన ఉందన్నారు. అనంతరం వర్సిటీ క్యాంపస్ ఆవరణలో బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్మించిన బంగ్లా భవన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ.. ఈ బంగ్లా భవన్ ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధానికి చిహ్నమని అన్నారు. 

వర్సిటీలో నీటి కొరతపై నిరసనలు
విశ్వ భారతి వర్సిటీ స్నాతకోత్సవ వేదిక వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకునే ముందు స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్సిటీలో తీవ్ర నీటి కొరత ఉందని, సురక్షిత నీరు అందుబాటులో లేదని పేర్కొంటూ పలువురు యువకులు నిరసనలు చేపట్టారు. దీనివల్ల పలువురు విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్నాతకోత్సవ వేడుక జరిగే వేదిక సమీపంలో కొద్ది సమయం ఈ నిరసనలు సాగాయి. అయితే వర్సిటీ అధికారులు వారికి సర్దిచెప్పి నిరసన విరమింపజేశారు.

బంగ్లా భవన్‌లో తొలి చర్చలు
విశ్వ భారతి విశ్వవిద్యాలయం ఆవరణలో బంగ్లా భవన్‌ను ప్రారంభించిన తర్వాత ఇరు దేశాల ప్రధానులు ఇందులోనే ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో తొలిసారిగా జరిగిన చర్చల్లో భద్రత, దక్షిణాసియా ప్రాంత రాజకీయ పరిస్థితులు, ద్వైపాక్షిక బంధాలు తదితర అంశాలపై కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దాదాపు అర్ధ గంట పాటు జరిగి భేటీలో రోహింగ్యా శరణార్థుల అంశంపైనా ప్రధానంగా చర్చ జరిగింది. తాను ఈ సమావేశంలో పాల్గొననప్పటికీ ఈ అంశాలపై చర్చ జరిగినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ సహాయ మంత్రి మహ్మద్ ఆలం పేర్కొన్నారు. రోహింగ్యాల విషయంలో భారత్, బంగ్లాదేశ్... ఒకే రకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని, తమ ప్రధాని హసీనా బంగ్లాదేశ్‌లో ఉన్న శరణార్థులకు ఆహారం అందిచేందుకు హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. అయితే తమ దేశంలో ఉన్న శరణార్థులందరినీ మయన్మార్ తప్పక వెనక్కి తీసుకెళ్లాలని అన్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా భారత్‌లో ఉన్న శరణార్థులకు గౌరవంగా, భద్రంగా తిరిగి మయన్మార్‌కు పంపుతామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, తీస్తా నది వివాదంపైనా మోదీ, హసీనా చర్చించారని, దీన్ని సానుకూలంగా పరిష్కరిస్తారని ప్రధాని మోదీపై తమకు నమ్మకం ఉందని ఆలం వెల్లడించారు.

English Title
Suvarnadhi between Bharat-Bangla
Related News