నేడు సుప్రీం విచారణ

Updated By ManamThu, 05/17/2018 - 22:46
imag
  • ఉదయం 10.30 గంటలకు ప్రారంభం.. యడ్డీకి ఆహ్వానంపై కాంగ్రెస్-జేడీఎస్ పిటిషన్

  • బుధవారం రాత్రి హౌస్ మోషన్.. అత్యవసర విచారణకు చీఫ్ జస్టిస్ స్వీకరణ

  • జస్టిస్ సిక్రి, జస్టిస్ బాబ్డే, జస్టిస్ భూషణ్‌తో ధర్మాసనం.. ఉదయం 2.11 గంటలకు విచారణ 

  • గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం: సింఘ్వి.. ప్రమాణ స్వీకారంపై స్టే విధించాలని విజ్ఞప్తి

  • ఏకీభవించిన ధర్మాసనం.. స్టేకు నిరాకరణ.. తుది తీర్పునకు లోబడి యడ్డీ ప్రమాణం 

imageన్యూఢిల్లీ: తమ కూటమికి మెజారిటీ ఉన్నా.. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా.. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారించనుంది. ఉదయం 10.30 గంటలకు జస్టిస్ జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం విచారించనుంది. మరోవైపు, ఈ పిటిషన్‌లో తనను కూడా ఇంప్లీడ్ చేయాలని ప్రముఖ న్యాయకోవిదుడు రాంజెఠ్మాలానీ వ్యక్తిగతంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట ఆయన ఈ మేరకు పిటిషన్ చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని వ్యక్తిగతంగా సవాలు చేస్తూ ఈ కేసులో వ్యక్తిగతంగా ఇంప్లీడ్ అయ్యే అవకాశం కల్పించాలని కోరారు. అయితే, శుక్రవారం ఈ విషయాన్ని సరైన బెంచ్ ముందు ప్రతిపాదించాలని ధర్మాసనం సూచించింది. దాంతో ఆయన శుక్రవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.

రాత్రంతా కొనసాగిన హైడ్రామా..
రోజంతా చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలని యడ్యూరప్పను కర్ణాటక రాష్ట్ర గవర్నర్ imageవజూభాయ్ వాలా బుధవారం ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కాంగ్రెస్ హౌజ్ మోషన్‌కు రంగం సిద్ధం చేసుకుంది.  లేఖ యడ్యూరప్పకు చేరిన వెంటనే రాత్రి 11.47 గంటలకు సుప్రీంకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అప్పటికప్పుడే వాదనలు వినాలని అభ్యర్థించింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వి, వివేక్ తనఖా, పార్టీ లీగల్‌సెల్‌కు చెందిన లాయర్లు తదితరలు కృష్ణ మీనన్ మార్గ్‌లో ఉన్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నివాసానికి రాత్రి 12:28 గంటలకు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి తగినంత సంఖ్యాబలం లేనందున యడ్యూరప్ప ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అర్ధరాత్రి అత్యవసర విచారణకు స్వీకరించారు. అనంతరం జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనాన్ని నియమించారు. ఈ ధర్మాసనం తెల్లవారుజామున 2.11 గంటలకు విచారణ ప్రారంభించింది. కాంగ్రెస్-జేడీఎస్ తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గోవింద్ ఎం కర్జోల్, సీఎం ఉడాసి, బస్వరాజ్ బొమ్మై తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఉదయం 5.28 గంటల వరకు వాదనలు కొనసాగాయి. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే విధించడాన్ని కేంద్రం, బీజేపీ తరఫు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘బీజేపీ నేత యడ్యూరప్ప, గవర్నర్ మధ్య ఎలాంటి సమావేశం జరిగిందో.. వాటి వివరాలు ఏమిటో ఎవరికీ తెలియవు. ఈ అంశం అంతా స్పెక్యులేషన్లతో కూడుకున్నది. కాబట్టి స్టే ఇవ్వకూడదు’’ అని కేకే వేణుగోపాల్ వాదించారు. ‘‘ఒక వ్యక్తి ప్రమాణస్వీకారంతో ప్రపంచమేమి మునిగిపోదు. ఇదేమి జీవన్మరణ సమస్య కాదు. ఒక వ్యక్తిని ఏమీ ఉరితీయట్లేదు. ఈ పిటిషన్‌ను ఇంత అర్ధరాత్రి..అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు’’ అని వేణుగోపాల్ పేర్కొన్నారు. మరోవైపు, సింఘ్వీ కూడా గట్టిగా వాదనలు వినిపించారు. జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్నా గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అసంబద్ధమని అన్నారు. అలాగే.. బలనిరూపణకు 15 రోజుల సమయం ఇవ్వడాన్ని ప్రశ్నించారు. తన బలానికి సంబంధించి గవర్నర్‌కు యడ్యూరప్ప ఇచ్చిన లేఖను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే యడ్యూరప్ప ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలకు వాయిదా వేయాలని వినతి చేశారు. అయితే ఏ ప్రాతిపదికన గవర్నర్ బీజేపీని అధికార ఏర్పాటుకు ఆహ్వానించారో తెలియనందున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేయడం లేదా స్టే విధించడం చేయకూడదని కేకే వేణుగోపాల్ వాదించారు. బలనిరూపణ వరకు వేచి ఉండాలని అన్నారు. అదే సమయంలో ధర్మాసనం కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ‘‘ఈ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. రెండోస్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో జేడీఎస్ ఉన్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ కలిస్తే వాటికే ఎక్కువ సీట్లు అవుతాయి. ఈ పరిస్థితుల్లో ఏ ప్రాతిపదికన యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు’’ అని వ్యాఖ్యానించింది.

కాంగ్రెస్-జేడీఎస్ పొత్తుపైనా, ఆయా ఎమ్మెల్యేల సంతకాలపై వేణుగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలు విధుల నిర్వహణను కోర్టులు అడ్డుకోజాలవని ముకుల్‌రోహత్గీ వాదించారు. ఇది రాజ్యాంగంలోని అధికరణం 361కు విరుద్ధమన్నారు. అయిత బలనిరూపణ సమయాన్ని ఏడు రోజులకు కూడా తగ్గించకూడదని అన్నారు. అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. బీజేపీని ఆహ్వానించడం రాజ్యాంగ విరుద్ధం, అక్రమం, నిర్హేతుకమని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనంజజ గవర్నర్‌కు బీజేపీ సమర్పించిన లేఖను శుక్రవారం విచారణలో సమర్పించాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. ఈ లేఖలను పరిశీలించిన అనంతరమే నిర్ణయం వెలువరిస్తామని పేర్కొంది. అయితే.. విచారణ పూర్తయ్యే వరకు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని ఆపాలన్నీ సింఘ్వి విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. స్టే విధించేందుకు నిరాకరిస్తూ..  యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయడమనే అంశం తుది తీర్పునకు లోబడి ఉంటుందని కోర్టు స్పష్టం చేస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. దాంతో కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయ్యింది.

English Title
Supreme Court today
Related News