సమస్యే లేదు.. స్టే ఇచ్చే ప్రసక్తే లేదు

Updated By ManamFri, 05/04/2018 - 10:44
Supreme Court Rejects Stay SCST Act Verdict
  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తీర్పుపై తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు

  • చట్టాల్లోకి సుప్రీం చొరబడుతోందన్న అటార్నీ జనరల్

Supreme Court Rejects Stay SCST Act Verdictన్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట సవరణపై ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చే ప్రసక్తే లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మార్చి 20న ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాల్సిందిగా కోరుతూ విచారణలు జరుగుతున్నాయి. తాజాగా స్టే విధించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. చట్టం, అధికారం, న్యాయవ్యవస్థల అధికారాలకు సంబంధించి రాజ్యాంగంలో సరైన విధివిధానాలను నిర్దేశించారని, కానీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించి న్యాయవ్యవస్థ తన పరిధిని దాటేసి చట్టంలోకి చొరబడిందని అన్నారు. చట్టం ప్రకారం నిందితులపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉన్నా.. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే సదరు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీం కోర్టు తీర్పునివ్వడం, చట్టంలో లేకున్నా ముందస్తు బెయిల్ ఇవ్వాలనడం సరైనది కాదని అన్నారు. అంతేగాకుండా ప్రాథమిక విచారణ లేకుండా ఇలాంటి కేసుల్లో ఒకవేళ డీఎస్పీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే.. అది ధిక్కరణ కిందకే వస్తుందని కూడా సుప్రీం కోర్డు వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆ తీర్పుతో దేశం మొత్తం ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు మూలానా ఆందోళనలతో 8 మంది మరణించారని అన్నారు. అయితే, ఏజీ వ్యాఖ్యలపై జోక్యం చేసుకున్న జస్టిస్ ఆదర్శ్ కే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌ల ధర్మాసనం.. ‘‘నేరం చేసినవాడు తప్పించుకోవాలని మేమెప్పుడు సూచించలేదు. ఒకవేళ ఓ వ్యక్తి దళితులు, గిరిజనులపై తీవ్రమైన నేరం చేస్తే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టాల్సిందే. అలాంటి సందర్భాల్లో ప్రాథమిక విచారణ లేకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేయొచ్చు. కానీ, మేం చెప్పిందల్లా నిర్దోషులు, అమాయకులు ఇలాంటి కేసుల వలలో చిక్కుకోకూడదనే. నేరం చేయని అమాయకుల స్వేచ్ఛ, హక్కులను కాపాడేందుకే ఆ మార్గదర్శకాలను ఇచ్చాం తప్పిస్తే.. చట్టాన్ని మార్చాల్సిందిగా మేం చెప్పట్లేదు’’ అని వివరించింది. తీర్పుపై స్టే ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను మే 16కు వాయిదా వేసింది. 

English Title
Supreme Court Rejects Stay SCST Act Verdict
Related News