న్యాయ శాఖ పరిశీలనకు చక్కెర సెస్సు

Updated By ManamTue, 05/15/2018 - 22:46
sugar

sugarన్యూఢిల్లీ: చక్కెరపై సెస్సు విధించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం ఒకటి ఆ లెవీపై న్యాయ మంత్రిత్వ శాఖ అభిప్రాయం కోరాలని నిర్ణయించింది. చక్కెరపై 5 శాతం జి.ఎస్.టి ఉంది. అది కాకుండా, కిలోకు రూ. 3 మించకుండా సెస్సు విధించాలనే ప్రతిపాదన వచ్చింది. అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో ఆ బృందం సోమవారం ఇక్కడ సమావేశమైంది. ‘‘అసలు సెస్సు విధించే అధికారం జి.ఎస్.టి కౌన్సిల్‌కు ఉందా అనేది మొదటి ప్రశ్న. ఆ అంశాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపాలని మేం నిర్ణయించాం’’ అని శర్మ మీడియా వారితో అన్నారు. లెవీ విధించడం ద్వారా వచ్చే నిధుల అంతిమ వినియోగంపై ఆహార మంత్రిత్వ శాఖ నుంచి కూడా బృందం ఒక నివేదికను కోరనుంది. సెస్సు విధించే బదులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైనా ఉన్నాయేమో మంత్రుల బృందం చర్చిస్తుందని, బృందంలో సభ్యుడైన కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్  చెప్పారు. గతంలో చక్కెర పరిశ్రమను ఆదుకునేందుకు అవసరమైన నిధులను కేంద్రం ఎలా సమకూర్చుకుంటూ వచ్చిందో కూడా బృందం పరిశీలిస్తుందని ఆయన అన్నారు. ‘‘జి.ఎస్.టి అమలులోకి రావడానికి ముందు, ఒక సెస్సు ఉంది. కానీ, ఆ సెస్సు సరిపోదు. కడచిన మూడేళ్ళలో అది రూ. 500 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల శ్రేణిలో ఉంది. మరి మిగిలిన నిధులు ఎలా పోగుచేసేవారు. దీనినంతటినీ బృందం ముందు ఉంచుతాం. మేం దీనిపై చర్చిస్తాం’’ అని ఆయన చెప్పారు. 

అభిప్రాయ భేదాలు
చక్కెరపై సెస్సు విధించే ప్రతిపాదన మే 4న జరిగిన జి.ఎస్.టి కౌన్సిల్ 27వ సమావేశం ముందుకు వచ్చింది. భేదాభిప్రాయాలు తలెత్తడంతో దాన్ని వాయిదా వేశారు. ఆంధ్ర ప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు సెస్సును వ్యతిరేకించాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని, లెవీ విధించడానికి సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం జూన్ 3న ముంబయిలో మరోసారి సమావేశమవుతుంది. కార్లు, విలాస వస్తువులు, పొగాకు వంటి ఎంపిక చేసిన కొన్ని వస్తువులపైన మాత్రమే సెస్సు విధించాలని జి.ఎస్.టి నిబంధనలు నిర్దేశిస్తూండడంతో న్యాయపరమైన యోగ్యత అంశం తలెత్తింది. జి.ఎస్.టిలోని అత్యధిక శ్లాబ్ 28 శాతంపైన 25 శాతం వరకు కూడా లెవీ విధించడానికి అవకాశం ఉంది. జి.ఎస్.టి వల్ల రెవిన్యూ నష్టపోయిన రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు ఇలా వసూలు చేసిన సెస్సును ఉపయోగిస్తారు. చక్కెరపై సెస్సు పూర్తిగా వేరే ప్రయోజనంతో కూడినదైనందున, న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి అభిప్రాయాన్ని కోరుతున్నారు.

ఎవరికి ఉపయోగం?
చక్కెరపై సెస్సు విధించాలనే ప్రతిపాదనను ఆహార మంత్రిత్వ శాఖ రూపొందించి, జి.ఎస్.టి కౌన్సిల్ ముందు ఉంచింది. ‘‘దీన్నుంచి అయ్యే వసూళ్ళను, ఈ పరిశ్రమకున్న తీవ్ర చక్రీయ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణంగా ఈ రంగం సంక్షేమానికి ముఖ్యంగా రైతులకు వినియోగించడం జరుగుతుంది’’ అని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెరపై సెస్సు విధించడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 6,700 కోట్లు సమకూరుతాయని అంచనా. 

చక్కెర సెస్సు చట్టం
జి.ఎస్.టిని ప్రవేశపెట్టడానికి ముందు 1982 నాటి చక్కెర సెస్సు చట్టం కిద సెస్సు విధించి, వసూలు చేసేవారు. చక్కెర అభివృద్ధి నిధి (ఎస్.డి.ఎఫ్) కోసం ఎక్సైజ్ సుంకంగా వసూలు చేసేవారు. ఈ నిధి కింద వసూలు చేసిన డబ్బును రైతుల బకాయిలను పరిష్కరించడానికి షుగర్ ఫ్యాక్టరీలకు ఆర్థిక సహాయం కల్పించడంతోపాటు  వివిధ మార్గాలలో పరిశ్రమకు సాయపడేందుకు ఉపయోగించేవారు. అయితే, 2017 జూలై 1 నుంచి ఈ సెస్సు కూడా జి.ఎస్.టి లోపల కలిసిపోయింది. మొత్తంమీద, చక్కెర పరిశ్రమ సంక్షేమానికి ముఖ్యంగా రైతులకు సాయపడి ప్రభావం చూపే విధంగా వినియోగించడానికి ప్రత్యేకమైన నిధి ఏదీ ప్రస్తుతం  అందుబాటులో లేదు. దాంతో కొత్త సెస్సు విధించాల్సిన అవసరం ఏర్పడుతోంది. 

Tags
English Title
Sugar cessation for judicial review
Related News